మహిళను మంటల్లోకి నెట్టిన వైసిపి నేత

Apr 13,2024 23:43 #attack, #fight, #YCP Leaders

– గాయపడిన బాధితురాలు
-విశాఖలో దారుణం
ప్రజాశక్తి- గాజువాక, కలెక్టరేట్‌ విలేకరులు (విశాఖపట్నం):తన ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని ఆక్రమిస్తున్న వైసిపి వార్డు అధ్యక్షుడిని ‘ఇదేం పని’ అని అడిగిన మహిళను సదరు వ్యక్తి మంటల్లోకి నెట్టేసిన ఘటన జివిఎంసి 65వ వార్డు భానోజీతోటలో శనివారం చోటుచేసుకుంది. న్యూ పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ దాలిబాబు కథనం ప్రకారం… గాజువాక నియోజకవర్గం పరిధి 65వ వార్డు భానోజీతోటలో జలుమూరు రాధ నివసిస్తున్నారు. ఆ వార్డు వైసిపి అధ్యక్షునిగా మొదలవలస లోకనాథం ఉన్నారు. స్థానికంగా ఉంటున్న ఆయన వార్డులోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. దానికి సమీపంలో ఉంటున్న రాధ ఇంటి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్నీ ఆక్రమించేందుకు ప్రయత్నించారు. రాధ లేని సమయంలో అక్కడ భూమిని చదును చేశారు. ప్రహరీ కట్టాలని అనుకున్నారు. చదును చేసే క్రమంలో తుప్పలు, చెత్తాచెదారాన్ని కుప్పగా పోసి పెట్రోల్‌ పోసి మంటపెట్టారు. ఈ విషయం తెలిసి రాధ అక్కడకు వచ్చారు. తన ఇంటి పక్కనున్న స్థలంలో చెత్తను ఎందుకు డంప్‌ చేశారని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో వారిరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లోకనాథం ఆమెను మెడ మీద చేయి వేసి బలంగా నెట్టారు. దీంతో, ఆమె మంటల్లో పడడంతో చెయ్యి, నుదురు, ముఖంపై గాయాలయ్యాయి. రాధా కుటుంబీకులు నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సిపి రవిశంకర్‌ ఆదేశాల మేరకు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ దాలిబాబు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి లోకనాథాన్ని అరెస్టు చేశారు. ఆయనకు సహకరించిన ఇద్దరు మహిళలపైనా కేసు నమోదు చేశారు.
ఐద్వా ఖండన
మహిళను మంటల్లోకి తోసేయ్యడాన్ని ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, వై.సత్యవతి ఓ ప్రకటనలో ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
ఆడబిడ్డలపై వైసిపి అరాచకాలు : అచ్చెన్నాయుడు
విశాఖలో చోటుచేసుకున్న దారుణ ఘటనను టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. వేధింపులపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం హేయమన్నారు. ఆడబిడ్డలపై వైసిపి నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. కాగా విశాఖ కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న రాధను టిడిపి జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ పరామర్శించారు. వైసిపి నాయకులు రౌడీలను మించిపోయారని ఆరోపించారు. ఈ ఘటనపై హత్యాయత్నం కింద కాకుండా పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేశారని ఆయన తప్పుబట్టారు.

➡️