ప్రచార ఖర్చులపై నిరంతర నిఘా

ఎన్నికల ప్రచారానికి

మాట్లాడుతున్న వ్యయ పరిశీలకులు నీనా నిగమ్‌

  • వ్యయ పరిశీలకులు నీనా నిగమ్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఎన్నికల ప్రచారానికి వ్యయ పరిమితికి మించి వెచ్చించే అవకాశమున్న ఆయా అభ్యర్థుల ఖర్చులపై నిరంతర నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి నీనా నిగమ్‌ ఆయా నోడల్‌ ఏజెన్సీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పలు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణ, సాధారణ ఎన్నికల సన్నద్ధతపై నోడల్‌ అధికారులతో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ అధ్యక్షతన జిల్లా ఎన్నికల పరిశీలకులు కోమల్‌జిత్‌ మీనా, శరవణ కుమార్‌, నవీన్‌ కుమార్‌ సోనీలతో కలిసి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నంలో భాగంగా నగదు, బహుమతుల పంపిణీపై సి-విజిల్‌ వంటి అప్లికేషన్ల ద్వారా ఫిర్యాదు దాఖలు చేసేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ, ఎన్నికల ప్రచారాన్ని తనిఖీ చేయడానికి ఇప్పటికే బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు, సన్నద్ధత ప్రణాళికపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థుల సహా రిజిస్టరై, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల ప్రచార ఖర్చుల నమోదుపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్యాంకుల నుంచి జరిగే అనుమానాస్పద నగదు లావాదేవీలు, ముఖ్యంగా రూ.ఐదు లక్షలకు మించిన నగదు డిపాజిట్లపై, మద్యం షాపులకు వెళ్లే సరుకు రవాణాపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ తొలుత ఎన్నికల పరిశీలకునికి జిల్లాలోని వ్యయ పర్యవేక్షణ బృందాల పనితీరు గురించి వివరించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలు, జిల్లా ఎన్నికల నియంత్రణ కేంద్రం (కంట్రోల్‌రూమ్‌), రాజకీయ ప్రచారానికి సంబంధించిన అనుమతుల వివరాలు, జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక కార్యకలాపాలు, ఎన్నికల సంబంధిత ఇతర అంశాలపై వివరించారు.ఎన్నికల కోసం చేసిన భద్రతా ఏర్పాట్లను ఎస్‌పి జి.ఆర్‌.రాధిక వివరించారు. ఒడిశా సరిహద్దుగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, వాటి పనితీరు, సిబ్బంది గురించి వివరించి ఇప్పటివరకు సీజ్‌ చేసిన నగదు, మద్యం, బంగారం, గంజాయి వంటి వాటి వివరాలు, నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల గురించి తెలిపారు. సమావేశంలో ఎఎస్‌పి ప్రేమకాజల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, జిఎస్‌టి అసిస్టెంట్‌ కమిషనర్‌ రాణీ మోహన్‌, సిపిఒ ప్రసన్నలక్ష్మి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సూర్యకిరణ్‌, జిల్లా ఆడిట్‌ అధికారి సుల్తానా, డిటిసి చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, డిపిఒ వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌ కుమార్‌, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి వాసుదేవరావు, జిల్లా ఖజానా అధికారి మోహనరావు, ఆదాయపు పన్నుశాఖ అధికారి కె.రవిశంకర్‌, డిసిసిబి సిఇఒ వరప్రసాద్‌, నీటిపారుదల శాఖ ఎస్‌ఇ పొన్నాడ సుధాకర్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

➡️