ఐక్య ఉద్యమాలతోనే ‘ఉక్కు’ పరిరక్షణ

  • ఐద్వా జాతీయ నాయకులు ఇషిత ముఖర్జీ

ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) : ఐక్య ఉద్యమాలతోనే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోగలమని ఐద్వా జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్‌ ఇషిత ముఖర్జీ అన్నారు. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఆపాలి’ పేరిట ఉక్కు నగరంలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విశాఖ ఉక్కుపై జరుగుతున్న కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డిసిఐ)ని, బ్యాంకింగ్‌ తదితర సెక్టార్లను ప్రయివేటీకరణ కాకుండా ఉద్యమాల ద్వారా కాపాడుకున్నామని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు కార్మికుల పోరాటం కూడా తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. ప్రభుత్వ రంగం ఉంటేనే రిజర్వేషన్లు అమలు అవుతాయని, భవిష్యత్తు తరాలకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వ రంగం నిర్వీర్యమైతే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు కరువవుతాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. ప్రయివేటీకరణ, ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను పోరాటాల ద్వారా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ ప్లాంట్‌కు ప్రయివేటీకరణ గండాలు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయని, వాటన్నింటినీ కార్మికులు సమర్థవంతంగా తిప్పికొట్టారని గుర్తు చేశారు. గతంలో నష్టాల్లోకి వెళ్లినప్పుడు బిఐఎఫ్‌ఆర్‌ నుంచి స్టీల్‌ప్లాంట్‌ బయటపడిందని తెలిపారు. పోస్కో వంటి సంస్థలు ప్లాంట్‌ను కైవసం చేసుకుందామని చేసిన కుట్రలు ఫలించలేదని వివరించారు. ఇప్పుడు ప్లాంట్‌లోకి వచ్చిన జిందాల్‌ సంస్థను తిప్పికొట్టడం అసాధ్యమేమీ కాదన్నారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌లోని కార్మిక సంఘాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోన్న యాజమాన్య వైఖరిని ఖండించారు. సభలో స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైటి.దాస్‌, యు.రామస్వామి, కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు పివిఎస్‌బి.శ్రీనివాసరాజు, ఐద్వా నాయకులు మణి, వేణు తదితరులు పాల్గొన్నారు.

➡️