ఇంటర్‌నెట్‌తో కేరళ హైటెక్‌ పాఠశాలల అనుసంధానం

Jan 5,2024 10:59 #Internet, #kerala

తిరువనంతపురం  :   రాష్ట్రంలోని అన్ని హైటెక్‌ పాఠశాలలకు ఈ వారంలో ఇంటర్‌నెట్‌ బ్రాడ్‌బాండ్‌ సదుపాయాన్ని కేరళ ప్రభుత్వం కల్పించనుంది. కోఫాన్‌ పబ్లిక్‌ బ్రాడ్‌బాండ్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ చర్య తీసుకోనున్నారు.సార్వజనీన ఇంటర్‌నెట్‌ సదుపాయాన్ని పెంపొందించేందుకు, కార్పొరేట్‌ టెలికం రంగానికి ప్రత్యామ్నాయంగా గత జూన్‌లో కోఫాన్‌ను ప్రారంభించారు. ప్రైవేటు రంగ కేబుల్‌ నెట్‌వర్క్‌లు, మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల దోపిడీ నుండి ప్రజలను కాపాడేందుకే ఈ ప్రాజెక్టు ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువున గల 20లక్షల కుటుంబాలకు ఉచిత ఇంటర్‌నెట్‌ను సకాలంలో అందచేసి, డిజిటల్‌ అంతరాన్ని పోగొడతామని చెప్పారు. దారిద్య్ర రేఖకు ఎగువున గల కుటుంబాలు చార్జీలు చెల్లించాల్సి వుంటుంది. అయితే కమర్షియల్‌ రేట్ల కన్నా తక్కువగానే వుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 2వేల పబ్లిక్‌ ప్రదేశాల్లో ఉచిత వైఫై అందుబాటులో వుంచారు. అన్ని ప్రభుత్వ, స్థానిక కార్యాలయాలు ఈ సర్వీస్‌ను ఉపయోగించు కుంటాయి. అయితే కేరళ పాఠశాలలను అనుసంథానం చేయడం పదే పదే జాప్యమవుతూ వచ్చింది. ఆర్థికపరమైన కారణాలే ఇందుకు దోహదపడ్డాయి. అయితే కె-ఫాన్‌ ప్రాజెక్టు నిర్వహణకు సరిపడా ఆదాయం ఆ ప్రాజెక్టు వల్లనే వస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

➡️