హమాస్‌తో యుద్ధం చేసేందుకు ఉద్యోగాల వంకతో భారతీయుల్ని ఇజ్రాయిల్‌ పంపనున్న కేంద్రం : మల్లికార్జున ఖర్గే

Jan 27,2024 18:35 #Mallikarjun Kharge

న్యూఢిల్లీ : గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం వల్ల వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతదేశంలో గ్రామీణ పేదరికం పెరిగినందు వల్ల ఉద్యోగాలు లేని వారిని ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం కోసం కేంద్రం ఇజ్రాయెల్‌ పంపించాలని చూస్తోందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. శనివారం ఖర్గే కేంద్రంపై మండిపడ్డారు. భారత్‌లో విస్తృతంగా గ్రామీణ కష్టాలు ఉన్నాయని, అందువల్ల జరుగుతున్న యుద్ధంలో ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. గడచిన ఐదేళ్లలో వ్యవసాయం (-0.6 శాతం), వ్యవసాయేతర (-1.4 శాతం) రంగాలు రెండూ ప్రతికూలతల్ని ఎదుర్కొన్నాయి. దీంతో గ్రామీణ పేదరికం పెరిగింది. భారతదేశంలో 2014లో పురుషుల రోజువారీ వేతనం రూ. 220గా ఉంది. అదే 2022-2023లో 212గా ఉంది. ఉద్యోగాల కల్పన 30 నెలల కనిష్టానికి పడిపోయింది. దీంతో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ పథకం కింద పనికోసం డిమాండ్‌ రోజురోజుకి పెరుగుతోంది. మోడీ ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌లో నిధులను తగ్గించింది. కానీ గ్రామీణ నిరుద్యోగం ఎక్కువగా ఉన్నందున రూ. 28,000 కోట్లు కేటాయించవలసి వచ్చింది. 14వ ఆర్థిక సంఘం (2015- 2020)లో వాగ్దానం చేసిన దానికంటే పంచాయతీలకు వాస్తవ నిధుల పంపిణీ 10.4 శాతం తక్కువగా ఉంది. అంతేకాకుండా, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసిజి) అమ్మకాలు గతేడాది (2023)లో ఎటువంటి పెరుగుదల లేదు. గృహాల పొదుపులు 50 ఏళ్ల కనిష్ట స్థాయికి వెళ్లాయి. ప్రైవేట్‌ రంగలో ఉద్యోగాల కల్పన 21 సంవత్సరాల కనిష్టంగా ఉంది. 2018-19, 2022-23 మధ్య ప్రజల నుండి వ్యక్తిగత పన్ను వసూళ్లు 50.55 శాతం పెరిగాయి. అయితే కార్పొరేట్‌ పన్ను వసూళ్లు 2.72 శాతం మాత్రమే పెరిగాయి. ఇవన్నీ ఆర్థిక అసమానతల్ని తెలియజేస్తోందని, గతేడాది కూరగాయల ధరలు 60 శాతం పెరిగి ప్రజలపై పెనుభారం మోపాయని ఖర్గే అన్నారు. ఇంకొద్దిరోజులే మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండనుంది. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌.. మోడీ ప్రభుత్వపు చివరి బడ్జెట్‌ అని ఖర్గే అన్నారు.

గతేడాది డిసెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌, హర్యానా ప్రభుత్వాలు ఇజ్రాయెల్‌లో ఉద్యోగాల భర్తీకి భవన నిర్మాణ కార్మికుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించాయి. కేంద్ర ప్రభుత్వం కనీసం పదివేల మంది కార్మికులను ఇజ్రాయెల్‌కు పంపాలని యోచిస్తోంది. ఈ కార్మికులను నేషనల్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డిసి) ఎంపిక చేస్తుంది. ఇజ్రాయెల్‌కు ఉత్తరప్రదేశ్‌, హర్యానాల నుండి పంపే కార్మికుల కోసం చట్టపరమైన చర్యలకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ఈ నెల ప్రారంభంలో అన్నారు.

➡️