కర్ణాటక కమలంలో కలహాల కుంపటి

  •  సగానికిపైగా స్థానాల్లో అసమ్మతులు
  •  చల్లార్చేందుకు నేరుగా రంగంలోకి అమిత్‌ షా

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక బిజెపిలో కలహాల కుంపచటి రాజుకుంది. అసమ్మతులు, సహాయ నిరాకరణలు కొనసాగుతున్నాయి. వీటిని చక్కబెట్టేందుకు నేరుగా అమిత్‌ షా రంగంలోకి దిగినా ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. కర్ణాటకలో 2, 3వ విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండో విడతకు సంబంధించి ఏప్రిల్‌ 26న ఎన్నికలు, మూడో విడతకు సంబంధించి మే 7న ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. రెండవ విడతలో 14, మూడో విడతలో మిగిలిన 14 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్ణాటకలో బిజెపి అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. 25 సీట్లలో బిజెపి విజయం సాధించింది. కాంగ్రెస్‌, జెడిఎస్‌లకు చెరో స్థానం దక్కింది. మాండ్య నుంచి సినీనటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందింది. ఈసారి పరిస్థితులు బిజెపికి అంత అనుకూలంగా లేవన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆరు మాసాల క్రితం 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి గణనీయంగా సీట్లు తగ్గిపోయాయి. 104 నుంచి 66 అసెంబ్లీ స్థానాలకు బిజెపి పడిపోయింది. ఇదే పరిస్థితి ఇప్పుడు జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ కనిపిస్తోంది. దీనికితోడు ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. బాహాటంగానే నాయకుల మధ్య గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల పూర్తి బాధ్యతలను చూస్తున్న మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపైనా కొంతమంది సీనియర్‌ బిజెపి నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కర్ణాటక బిజెపిలో కుటుంబపాలన నడుస్తోందంటూ కర్ణాటక మాజీ బిజెపి అధ్యక్షులు కెఎస్‌.ఈశ్వరప్ప విమర్శించారు. యడ్యూరప్ప జాతీయ కౌన్సిల్‌ సభ్యులని, ఆయన కుమారుడు బివై.విజేంద్ర ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారని, మరో కుమారుడు షిమోగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారని ఈశ్వరప్ప గుర్తు చేస్తున్నారు. హవేరీ లోక్‌సభ స్థానానికి తన కుమారుడికి టికెట్టు ఆశించి భంగపడిన ఈశ్వరప్ప… షిమోగాలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని హెచ్చరిస్తున్నారు. అమిత్‌ షాను కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లి కలవకుండానే వెనక్కు వచ్చేశారు. ధార్వాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శిరహట్టి బాలేహోసూరు భావైక్యత పీఠానికి చెందిన ఫకీర్‌ దింగాళేశ్వర్‌ స్వామి బిజెపికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. లింగాయత్‌ ప్రజలను ఓటు బ్యాంకుగా మాత్రమే బిజెపి చూస్తోందని ఆయన విమర్శించారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది మంది లింగాయత్‌లు ఎక్కినైనా వారిలో ఏ ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన మండిపడుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెసు పార్టీలో చేరిన జగదీశ్‌ షెట్టర్‌ తిరిగి జనవరిలో బిజెపిలో చేరారు. ఆయనకు బెల్గాం టికెట్టు ఇవ్వడంపై స్థానిక బిజెపి నాయకులు తీవ్ర నిరసన గళాలు వినిపిస్తున్నారు. బీదర్‌ లోక్‌సభ టికెట్‌ సిట్టింగ్‌ ఎంపి దేవేంద్రప్పకు కాదని భగవంత్‌ ఖుబాకు ఇచ్చారు. దీన్ని ఎమ్మెల్యేలు ప్రభుచౌహాన్‌, శరణు సలాగర్‌లు బాహాటంగానే వ్యతి రేకిస్తున్నారు. చిత్రదుర్గ, దావరణగేరే, తుముకూరు, చిక్కబళ్లాపూర్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ అసమ్మతి ఉంది.

మిత్రపార్టీకి సహకారం కరువే!
లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బిజెపి, జెడిఎస్‌లు కూటమిగా పోటీలో ఉన్నాయి. ఇక్కడ బిజెపి 25 స్థానాల్లో, జెడిఎస్‌ మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అందులో కుమారస్వామి… మాండ్య నుంచి పోటీలో ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి సినీనటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఈసారి అక్కడి నుంచి పోటీ చేయాలని ఆమె భావించారు. ఆమెను తప్పించి జెడిఎస్‌కు సీటు కేటాయించారు. కుమారస్వామి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. హసన్‌ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపిగా ప్రస్తుతం హెచ్‌డి దేవేగౌడ మనవడు ఉన్నారు. ఆ స్థానాన్ని తిరిగి ఆయనకే కేటాయించారు. ఇక్కడ బిజెపి నుంచి సహకారం శూన్యంగానే కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో రేవన్నకు కాకుండా కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రేయస్‌ పటేల్‌కు సహకరించనున్నట్టు బాహాటంగానే బిజెపి మాజీ ఎమ్మెల్యే ప్రీతమ్‌ జి గౌడ్‌ సన్నిహితుడు ఉద్దూరు పురుషోత్తం ప్రకటించారు. జెడిఎస్‌కు కేటాయించిన కోలార్‌ లోక్‌సభలోనూ అంతంత మాత్రంగానే సహకారం అందుతోంది.

➡️