సమస్యను ఎదుర్కొనే ధైర్యమే ఆత్మవిశ్వాసం

Jan 6,2024 21:36 #ap governer, #speech

– అనంతపురం జెఎన్‌టియు 13వ స్నాతకోత్సంలో గవర్నర్‌

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి:’ఆత్మవిశ్వాసం అన్నింటిలోనూ విజయాన్ని అందివ్వకపోవచ్చు… అయితే సమస్యలను ఎదుర్కొనే మనోధైర్యాన్నిస్తుంది’ అని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. అనంతపురం జెఎన్‌టియు 13వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. విశ్వవిద్యాలయంలోని ఎన్‌టిఆర్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ స్నాతకోత్సవంలో 2020-21, 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. విశ్వేశ్వరయ్య టెక్నాలజీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసరు కె.బాలవీరారెడ్డికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఛాన్సలర్‌ హోదాలో హాజరవ్వగా, ఢిల్లీ ఐఐటి మాజీ డైరెక్టరు ప్రొఫెసరు విఘ్నేశ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గన్నారు. అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ.. విద్య అన్నది సమాచార సంగ్రహణకే కాదని, 21 శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనే ఆలోచన విధానముండాలని సూచించారు. ‘గొడుగు వర్షాన్ని ఆపలేదు…కాని వర్షంలో నిలబడేందుకు ఉపయోగపడుతుంది. ఆత్మవిశ్వాసం కూడా అన్నింటిలోనూ విజయాన్ని అందివ్వకపోవచ్చు కాని, సవాళ్లను ఎదుర్కొనే మనోధైర్యాన్ని ఇస్తుంది ‘ అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేసిన వ్యాఖ్యాలను ఈ సందర్భంగా ఉటంకించారు. విద్యార్థులు కూడా విజయాన్ని సాధించడం ఒక్కటే కాదు…సవాళ్లను ఎదుర్కొనే మనోధైర్యం కలిగి ఉండాలని సూచించారు. వి.సత్యనారాయణ రాజు మాట్లాడుతూ.. విజ్ఞానమంటే కేవలం కంప్యూటరు విద్య మాత్రమే కాదని అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో సివిల్‌ , మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కెమికల్‌ అన్ని విభాగాలు సమానాభివృద్ధి జరగాల్సి ఉందని సూచించారు. ఈ సందర్భంగా 71 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 68,963 మందికి బ్యాచ్‌లర్‌ డిగ్రీ, 16914 మందికి ప్రొస్టుగ్రాడ్యుయేషన్‌, 265 మందికి పిహెచ్‌డి ప్రదానం చేశారు. స్నాతకోత్సవం అనంతరం విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన పరిపాలనా భవనాన్ని గవర్నర్‌ మీట నొక్కి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వైస్‌ ఛాన్స్‌లర్‌ రంగ జనార్థన్‌, రెక్టార్‌ ఆచార్య ఎం.విజయ్ కుమార్‌, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, వర్సిటీ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

➡️