రహదారుల నిర్మాణంతోనే సమగ్రాభివృద్ధి

  •  రాష్ట్రంలో 1,134 కిలోమీటర్ల జాతీయ రహదారులకు శ్రీకారం
  •  వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోడీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిలో జాతీయ రహదారులు కీలకపాత్ర పోషిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రూ.లక్ష కోట్లు విలువ చేసే 114 జాతీయ రహదారి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు సోమవారం జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ వీటిలో కొన్నింటిని ప్రారంభించగా, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలో హర్యానా సెక్షన్‌ను మోడీ ప్రారంభించారు. హర్యానాలో రూ.9,750కోట్ల విలువ చేసే ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. గురుగ్రామ్‌లో రోడ్‌ షో కూడా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో రూ.20,500 కోట్ల విలువ చేసే మరో 42 ప్రాజెక్టులను కూడా మోడీ ప్రారంభించారు. వీటిల్లో రూ.14వేల కోట్ల విలువైన బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే కూడా వుంది.
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రూ.29,395 కోట్లతో చేపట్టిన 1,134 కిలోమీటర్ల రోడ్ల పనులకు సంబంధించి ప్రధాని కొన్నింటికి శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని నోవాటెల్‌లో నిర్వహించగా, ప్రధాని నరేంద్ర మోడీ గుర్‌గ్రామ్‌ నుండి వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఆనందపురం-పెందుర్తి- అనకాపల్లి సెక్షన్‌, గురజాన్‌పల్లి నుంచి అవనిగడ్డకు, గుండుగొలను నుంచి కలపర్రు, నాలుగు లైన్‌ల విజయనగరం బైపాస్‌, ముర్కుంబట్టు నుంచి చెర్లోపల్లి, దేవరపల్లి నుంచి జీలుగుమల్లి వరకు నిర్మించిన జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. అలాగే బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌ పనులకు, కర్నూలు నుంచి ఆత్మకూరుకు, ఎన్‌హెచ్‌ 71లో తమిళనాడు సరిహద్దు నుంచి పుత్తూరు వరకు, పుట్టపర్తి నుంచి కోడూరు, మైదుకూర్‌ నుంచి బద్వేల్‌, వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు, బి కొత్తపల్లి నుంచి గోరంట్ల వరకు, తాడిపత్రి నుంచి ముద్దనూర్‌, సోమయాజుల పల్లె నుంచి డోన్‌ వరకు, సీతారామపురం నుంచి దత్తులూరు వరకు, కడప, కర్నూలు సరిహద్దు నుంచి జమ్మలమడుగు వరకు, ముదిరెడ్డిపల్లి నుంచి నెల్లూరు సరిహద్దు వరకు చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా 3వ ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదగాలన్నదే తమ లక్ష్యమని మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డి పురందేశ్వరి, నేషనల్‌ హైవేస్‌ రాష్ట్ర రీజియన్‌ రీజినల్‌ అధికారి రాకేష్‌ కుమార్‌ సింగ్‌, ఆర్‌అండ్‌బి చీఫ్‌ ఇంజినీర్‌ వి రామచంద్ర, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ నీరజ్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

➡️