ఫిర్యాదులు నేరుగా అందజేయొచ్చు : సిఇఒ ఎంకె మీనా

Apr 5,2024 23:27 #CEO MK Meena

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రతిరోజూ సాయంత్రం 4, 5 గంటల మధ్య ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను, విజ్ఞాపనలను తమకు నేరుగా రాష్ట్ర సచివాలయంలో అందజేయొచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయ పనిదినాలతోపాటు ప్రభుత్వ సెలవు దినాల్లోనూ తమ కార్యాలయంలో ఫిర్యాదులు, విజ్ఞాపనలను అందజేయవచ్చన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో ఫిర్యాదులను స్వీకరించే సదుపాయం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌, రూమ్‌ నెంబరు 129లో ఫిర్యాదు సెల్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

రూ.47.49 కోట్ల సొత్తు స్వాధీనం
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.47.49 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సిఇఒ ఎంకె మీనా తెలిపారు. ఇందులో రూ.17.85 కోట్లు నగదు, రూ.8.82 కోట్లు విలువ చేసే మద్యం, రూ.1.63 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌, ఎన్నికల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఉచితాలు రూ.1.56 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటితోపాటు రూ.12.36 కోట్లు విలువైన వస్తువులతోపాటు రూ.5.24 లక్షలు విలువగల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

➡️