మీతో మీరే పోటీపడండి : ప్రధాని మోడీ

Jan 29,2024 14:40 #Pariksha Pe Charcha, #PM Modi

న్యూఢిల్లీ :   విద్యార్థులు ఇతరులను పోటీగా భావించకుండా .. తమకు తామే పోటీగా భావించాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అలాగే మీ పిల్లల రిపోర్టు కార్డులను మీ విజిటింగ్‌ కార్డుల్లా పరిగణించవద్దని ప్రధాని మోడీ తల్లిదండ్రులకు సూచించారు. సోమవారం ‘పరీక్షా పే చర్చ’ ఏడో ఎడిషన్‌ సందర్భంగా ప్రధాని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులే భారతదేశ భవిష్యత్తు రూపకర్తలుగా అభివర్ణించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత విస్తృతమవుతుండడంతో .. ఈ కార్యక్రమం తనకు కూడా పరీక్షలాగా మారిందని అన్నారు.

పోటీ, సవాళ్లు జీవితంలో స్ఫూర్తినిస్తాయని.. అయితే పోటీ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. మీ పిల్లలను మరొకరితో పోల్చకూడదని, అది వారి భవిష్యత్తుకు హాని కలిగించవచ్చని అన్నారు. కొందరు తమ పిల్లల రిపోర్ట్‌ కార్డులను విజిటింగ్‌ కార్డుగా పరిగణిస్తారని, ఇది మంచిది కాదని అన్నారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి మూడు రకాలుగా ఉంటుందని ప్రధాని వివరించారు. సహ విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి ఎదురైతే.. ఒక్కోసారి పిల్లలు తాము రాణించలేకపోతున్నామని ఒత్తిడిగా ఫీలవుతారని అన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు ప్రిపరేషన్‌ సమయంలో చిన్నచిన్న లక్ష్యాలను ఏర్పరుచుకుని, క్రమంగా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలని, దీంతో మీరు పరీక్షలకు సిద్ధమవ్వచ్చని అన్నారు.

గత కొన్నేళ్లుగా ప్రధాని ఈ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా నాలుగో ఎడిషన్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ ఏడాది భారత మండపంలో టౌన్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 2.26 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుండి ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలితో పాటు కళా ఉత్సవ్‌ విజేతలు హాజరయ్యారు.

➡️