బోట్లు దగ్ధం బాధితులకు పరిహారం – రూ.7.11 కోట్లు పంపిణీ : మంత్రి సీదిరి అప్పలరాజు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) విశాఖపట్టణం ఫిషింగ్‌ హార్బర్‌లో ఈ నెల 19న జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన కుటుంబాలకు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రూ.7,11,76,000 పరిహార చెక్కులను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గురువారం పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందన్నారు. మరమ్మతుల కోసం ప్రతి ఒక్కరికీ 80 శాతం సాయం అందించారు. బోటు రకాన్ని ఒట్టి రూ.16 లక్షల నుంచి రూ.24 లక్షల పరిహారమిచ్చారు. బోట్లలో పనిచేసే సుమారు 400 మందికి రూ.10 వేల చొప్పున అందించామని చెప్పారు. ఏ ఒక్కరికీ కూడా ఇబ్బంది లేకుండా సాయం అందించాలని ముఖ్యమంత్రి సూచించారని గుర్తు చేశారు. హార్బర్‌ నవీకరణ నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించామని, బోట్లు కొనుగోలుకు రుణ సదుపాయం కల్పించామని వివరించారు. బయోడిగ్రేడబుల్‌ బోట్లకు కూడా భవిష్యత్తులో రాయితీ ఇస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఎవరైనా మెకనైజ్డ్‌ బోట్లు కొనుగోలు చేసుకున్నట్లయితే 75 శాతం రాయితీతో అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 30 బోట్లు పూర్తిగా, 19 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, తితిదే మాజీ చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, విశాఖ ఎంపి ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌, మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ విజరు చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️