సంగీత, నృత్య కళలతో సమాజ వికాసం : భూమన కరుణాకరరెడ్డి

Feb 14,2024 15:51 #Arts, #ttd, #TTD EO
Community development through music and dance arts: Bhumana Karunakara Reddy

మహతిలో ఘనంగా దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం ప్రారంభం
ఐదు రాష్ట్రాల కళాకారులతో సదస్సులు, సంగీత, నృత్య ప్రదర్శనలు

ప్రజాశక్తి – క్యాంపస్ : భారతీయ సంప్రదాయ కళలైన సంగీతం, నృత్యం, వాద్య కళలను ప్రోత్సహించేందుకు టీటీడీ ఎంతగానో కృషి చేస్తోందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాల ఆధ్వర్యంలో కళావైభవం పేరిట మూడు రోజుల దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం తిరుపతి మహతి కళామందిరంలో బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఛైర్మన్ మాట్లాడుతూ సంగీతం, సాహిత్య కళలతోనే మానవ నాగరికత వికసించిందన్నారు. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితాల్లో ఒత్తిడి నివారణకు సంగీతం ఎంతగానో దోహదపడుతుందన్నారు. సంగీత, నృత్య కళలను నేర్చుకున్న వారికి ఉపాధి అవకాశాలు తగ్గడంతో ఎక్కువ మంది ఈ కళలను నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. ఈ కళలను బతికించుకునేందుకు ప్రజలు ఉపాధి కోసం కాకుండా దైనందిన జీవితంలో ప్రత్యామ్నాయంగా ఉండేలా నేర్చుకోవాలన్నారు. పురాతనమైన ఈ కళలను ప్రోత్సహించేందుకు టీటీడీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సంగీత, నృత్య కళాశాల, నాదస్వర, డోలు పాఠశాలను నిర్వహిస్తోందని చెప్పారు. ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఎందరో మహామహులైన కళాకారులను తయారు చేసిందన్నారు. ఘంటసాలకే రాగాలు నేర్పిన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుతోపాటు నేదునూరి కృష్ణమూర్తి, శ్రీ నూకల చినసత్యనారాయణ లాంటి ఎందరో మహానుభావులు ఈ కళాశాలలో సేవలందించారని కొనియాడారు. ఈ కళలను ప్రచారం చేయడం ద్వారా మన సంస్కృతి పరిఢవిల్లేందుకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ శక్తి పీఠాదీశ్వరి మాతా రమ్యానంద భారతి అనుగ్రహ భాషణం చేస్తూ సాక్షాత్తు సరస్వతి దేవి జన్మించిన రోజైన శ్రీ పంచమి నాడు కళల ద్వారా భారతీయ వైభవాన్ని చాటిచెప్పే కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు.

జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ సంగీత, నృత్యకళలు భారతీయతను ప్రతిబింబిస్తాయన్నారు. ప్రాభవం కోల్పోతున్న ఈ కళలను సజీవంగా నిలిపేందుకు ఎస్వీ సంగీత కళాశాల చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కళాశాల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చేలా తీర్చిదిద్దేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ వయొలిన్ విద్వాంసురాలు కుమారి కన్యాకుమారి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని అంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి నిపుణులైన కళాకారులు, విద్యార్థులు ఒకే వేదిక పైకి రావడం ఎంతో సంతోషకరమన్నారు. ఆయా రాష్ట్రాల్లోని సంగీత నృత్యరీతులు వేరువేరుగా ఉంటాయని చెప్పారు. అందరూ ఒకేచోట ప్రదర్శించడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సంగీత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ సాహిత్యం, సంగీతం, నృత్యం వేర్వేరు కాదని, అన్నీ కలిపి నాట్యశాస్త్రంలో ఇమిడి ఉంటాయని వివరించారు. శ్రీ భరతముని నాట్య శాస్త్రాన్ని లోకానికి అందించారని తెలియజేశారు. ఈ కళలన్నీ సమాజహితం కోసమేనని, కళాకారులు అందుకు అనుగుణంగా పని చేయాలని కోరారు. టీటీడీ ముఖ్య గణాంకాధికారి, కళాశాల ప్రత్యేకాధికారి శ్రీ శేషశైలేంద్ర మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని కళాకారులతో శ్రీవారికి సంగీత, నృత్య నివేదన అందించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటైందన్నారు. నిజమైన ఆనందాన్ని ఇచ్చేవి సంగీత, నృత్య కళలని, వీటిని ప్రోత్సహిస్తేనే భారతీయత నిలబడుతుందని అన్నారు. వివిధ రాష్ట్రాల కళాకారులు ఇక్కడ మూడు రోజులు పాటు ప్రదర్శనలు ఇస్తారని, వీటిని చూసి ఇతర కళాకారులు స్ఫూర్తి పొంది ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. భవిష్యత్తులో మ్యూజిక్ థెరపీ లాంటి నూతన కోర్సులు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టీటీడీ విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీలో 33 విద్యాసంస్థలు ఉన్నాయని, వీటిలో ఎస్వీ సంగీత కళాశాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలియజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్ ఈ కార్యక్రమానికి సహకారం అందించాయని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం కళాశాల ఆధ్వర్యంలో యువలయం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు., తిరిగి దక్షిణ భారతస్థాయిలో సంగీత, నృత్యోత్సవం నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో 400 మంది విద్యార్థులు, సాయంత్రం కళాశాలలో 1500 మంది విద్యార్థులు ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణ శర్మ, సంగీత నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️