నంది పురస్కారాల్లో అన్యాయం జరిగింది

Dec 31,2023 16:19 #Kurnool
comments on nandi awards
  • కళకు, కళాకారులకు దక్కని గౌరవం..!
     నంది అవార్డుగ్రహీత పత్తిఓబులయ్య

ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ : ఈ ఏడాది నాటక రంగానికి ఇచ్చిన నంది బహుమతులు పారదర్శకంగా జరగలేదని, న్యాయ నిర్ణేతలు ప్రతిభకు పట్టం కట్టలేదని కళకు కళాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని నంది అవార్డుగ్రహీత టిజివి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య అన్నారు. ఆదివారం మధ్యాహ్నం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ పద్యనాటకాలకు ఈ ఏడాది ప్రాధాన్యత ఇవ్వలేదని చారిత్రక నాటకాలను మాత్రమే మూడింటిని తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తమ సంస్థ కళాకారులకు అహర్యం, మరియు లైటింగ్‌కు ఇచ్చిన నంది పురస్కారాలను తాము తిరస్కరిస్తున్నామని వాటిని అక్కడే ఇచ్చేసి వచ్చామన్నారు. తాము ప్రదర్శించిన నాటకాలు ఏ కోణంలో తిరిస్కరించారో చెబితే ఏ లోపాలున్నాయో వెల్లడిస్తే తాము సరిదిద్దుకోడానికి కూడా సిద్దంగా ఉన్నామని అవేవి వెల్లడించకుండా అప్రజాస్యామికంగా, ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. పారదర్శకంగా చేయాలనుకున్నప్పుడు నిబంధనలు ముందుగా రూపొందిస్తే వాటికి అనుగుణంగా నటులు నాటకకర్తలు, కళాసంస్థలు నడుచుకుంటాయని పురస్కారాలను ఏకపక్షంగా ఇచ్చినట్లుందన్నారు. ప్రతీ సమావేశంలో ఛైర్మెన్‌ పోసాని కృష్ణమురళి తాము పారదర్శకంగా, ప్రలోభాలకు లొంగకుండా చేస్తామని చెబుతూ వచ్చారని తీరా ఫలితాల్లో మాత్రం చివరకు అన్యాయం చేశారన్నారు. పురస్కారాలకోసమే కళాకారులుండరని ప్రతిభకు పురస్కారాలేమి కొలమానం కాదని, పురస్కారాల వల్ల కళాకారులు స్ఫూర్తిపొంది మరింత ఎక్కువగా కళామతల్లికి సేవచేసే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో సంస్థ సభ్యులు కళాకారులు ఇనాయతుల్లా, శ్రీనివాసులు రెడ్డి, రాజారావు, సామేల్‌, తదితరులు ఉన్నారు.

➡️