అభివృద్ధి పనులు ప్రారంభం

Feb 8,2024 23:24

ప్రజాశక్తి – భట్టిప్రోలు
నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. వేమూరులో నూతనంగా రూ.8.60కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంధ్రం భవనాలను, మండలంలోని సూర్యపల్లి, కోనేటిపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాలు, విలేజి క్లినిక్‌లు, అద్దేపల్లి షాదీ ఖానా, నూతన హంగులతో ఏర్పాటు చేసిన మండల అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గతంలో అనేక మంది ఎంఎల్‌ఎలు, మంత్రులుగా పని చేసినప్పటికీ వైద్యశాల అభివృద్ధిని విస్మరించారని అన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో నేడు 30పడకల వైద్యశాలను నిర్మించటం గర్వకారణం అన్నారు. నూతన సచివాలయ భవనాలతో పాటు గ్రామ ఆరోగ్య కేంద్రాలు, రైతుబంధు కేంద్రాల వంటి అనేక రకాల అభివృద్ధి పనులను చేపట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. 14ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి దేశ రాజకీయాల్లో నేనే చక్రం తిప్పానని, అనేక మంది ప్రధాన మంత్రులను సైతం తన సారధ్యంలోనే నియమింపబడ్డారని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లి మరో పార్టీ నాయకుల కాళ్లు పట్టుకునే స్థితికి దిగజారాడని ఆరోపించారు. సినిమా యాక్టర్ పార్టీని పెట్టి ఇంకొక పార్టీలో విలీనం చేయటం, విలీనం గావించబడిన వ్యక్తేమో ఢిల్లీ వెళ్లి మరొక పార్టీ కాళ్లు పట్టుకోవడం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో సంక్షేమం అందుతుందని అన్నారు. ప్రజలంతా మరో మారు జగన్మోహన్ రెడ్డిని సిఎంగా చూడాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మంచి జరిగిందనిపిస్తేనే ఓటేయాలని అంటున్న జగన్‌ వ్యాఖ్యలు ఆలోచన కలిగిస్తుందని అన్నారు. మరెవరికైనా అలా అడిగే ధైర్యం ఉందాని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతకు 175స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేక వివిధ పార్టీలను కలుపుకుంటున్నాడని అన్నారు. తమ పార్టీ 175స్థానాల్లో పోటీ చేసి 175స్థానాలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసి మరో సారి వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్ బాబు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, వేమూరు, భట్టిప్రోలు మండలాల వైసిపి కన్వీనర్లు బొల్లి ముంత ఏడుకొండలు, మోర్ల శ్రీనివాసరావు, ఎంపీపీలు ఎల్లమాటి మోహన్, డివి లలిత కుమారి, జడ్పిటిసిలు గాజుల హేమలత, టి ఉదయభాస్కరి, వేమూరు, భట్టిప్రోలు, సూరేపల్లి పిఎసిఎస్ అధ్యక్షులు గాజుల భాను ప్రకాష్, గుమ్మడి సాంబశివరావు, గోవర్ధనగిరి శేషాచల శ్రీనివాసరావు (చిన్న బుజ్జి), సర్పంచులు ద్వారా రవికిరణ్మయి, మొర్ల విజయలక్ష్మి, మోర్ల కోటేశ్వరమ్మ, డాక్టర్ హరిణి, నాయకులు మల్లేశ్వరరావు, బాలాజీ పాల్గొన్నారు.

➡️