18 నుంచి నామినేషన్ల స్వీకరణ : కలెక్టర్‌

విలేకరులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి జిల్లాలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా||వి.వినోద్‌కుమార్‌ తెలియజేశారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నాడు నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల వ్యయ పరిశీలన తదితర అంశాలపై జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌, సివిల్‌ సప్లై డిఎం రమేష్‌ రెడ్డితో కలిసి పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ తేదీన ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవుతుందన్నారు. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఏప్రిల్‌ 25వ తేదీ అన్నారు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీ చివరి గడువు అన్నారు. మే 13వ తేదీ పోలింగ్‌, జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలన్నారు. అన్ని రకాల డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే నామినేషన్లను అనుమతిస్తామన్నారు. చివరి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. మూడు గంటల తరువాత ఒక్క సెకండ్‌ దాటినా ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు నామినేషన్లు తీసుకోవడానికి అవకాశం లేదన్నారు. ఎవరి నామినేషన్లను తిరస్కరించడం తమ ఉద్దేశం కాదన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం-2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం-2బి సమర్పించాలన్నారు. సెలవు దినాల్లో సైతం నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్‌ చేయలేరన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో గరిష్టంగా 3 వాహనాలకు అనుమతిస్తామన్నారు. 5 మంది వ్యక్తులు (అభ్యర్థితో సహా) ఆర్‌ఒ ఆఫీస్‌లోకి రావొచ్చన్నారు. అభ్యర్థి సువిధ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్లు సమర్పించవచ్చన్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల మధ్య అభ్యర్థి లేదా అతని ప్రపోజర్‌ లేదా అతని ఏజెంట్‌ ద్వారా నామినేషన్లను పంపవచ్చన్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు సంబంధించి నోడల్‌ అధికారులను నియమించామన్నారు. నియోజకవర్గాలోని అన్ని బందాలు, నోడల్‌ అధికారులు, ఎన్నికల పరిశీలకులతో వ్యయ పర్యవేక్షణ నోడల్‌ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు, వ్యయ పర్యవేక్షణ నోడల్‌ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటన తేదీ నుంచి పోల్‌ తేదీ వరకు పని చేస్తుందన్నారు. అధికారుల మధ్య సమన్వయం అత్యంత ముఖ్యమన్నారు. సీ-విజిల్‌ యాప్‌ ఫిర్యాదులను సరాసరి 26 నిమిషాల్లోనే పరిష్కరిస్తున్నామన్నారు.

➡️