కేంద్ర వివక్షపై సమిష్టి పోరు

  • ఢిల్లీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సహా మంత్రివర్గం ధర్నా
  • లెఫ్ట్‌, ఆప్‌, డిఎంకె, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఎస్పీ, విసికె సహా పలు పార్టీల మద్దతు
  • లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఓటమే లక్ష ్యం : ప్రతిపక్షాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పన్ను వాటాను నిరాకరించడం, గ్రాంట్లు నిలిపివేయడం, రుణ పరిమితిని తగ్గించడం, అభివృద్ధి ప్రణాళికలను తిరస్కరించడం వంటి కేంద్ర ప్రభుత్వ దురుద్దేశపూరిత చర్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలో కేరళ ప్రభుత్వం ఆందోళన నిర్వహించింది. జాతీయ నాయకులను సమీకరించి జరిపిన ఈ ఆందోళన లోక్‌సభ ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు ఐక్య వేదికగా మారింది. కేంద్రంలోని నిరంకుశ మోడీ ప్రభుత్వానికి కేరళ పోరాటం గట్టి హెచ్చరికగా నిలిచింది. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత ఇప్పటికీ బలంగానే ఉందన్న సందేశాన్ని యావత్‌ దేశానికి అందించింది. బిజెపియేతర ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం చూపుతున్న వివక్షపై జాతీయ చర్చకు ఈ ఆందోళన తెర లేపింది. గురువారం ఉదయం కేరళ ముఖ్యమంత్రి పినర యి విజయన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వామపక్ష నేతలు, కార్యకర్తలు కేరళ హౌస్‌ నుంచి పోరాట వేదిక జంతర్‌మంతర్‌కు ప్రదర్శనగా చేరుకు న్నారు. ‘ఫెడరలిజాన్ని కాపాడేందుకు పోరాటం’ అన్న బ్యానర్‌తో ర్యాలీ సాగింది.

సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తమిళనాడు మంత్రి పళనివేల్‌ త్యాగరాజ్‌ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన ఆందోళనకు సిపిఐ(ఎం) రాజ్యసభ పక్షనేత ఎలమరం కరీం స్వాగతం పలికారు. సిపిఐ జాతీయ కార్యదర్శి బినరు విశ్వం అధ్యక్షత వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడాలని ప్రతిపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు ఈ ఆందోళనకు వేదికైంది. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, డిఎంకే ఎంపి తిరుచ్చి శివ, వికెసి ఎంపి తోల్‌ తిరుమావళవన్‌, కేరళ కాంగ్రెస్‌ నేత జోస్‌ కె మణి తదితరులు మాట్లాడారు. జాన్‌ బ్రిట్టాస్‌ వక్తలను వేదికపైకి ఆహ్వానించారు. ఎల్‌డీఎఫ్‌ కన్వీనర్‌ ఇ పి జయరాజన్‌ వందన సమర్పణ చేశారు. ఈ ఆందోళనలో సిపిఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌, బృందాకరత్‌, ఎంఏ బేబి, ఎ. విజయరాఘవన్‌, కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ మాస్టార్‌ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ పంపిన సందేశం వీడియోను వేదిక వద్ద ప్రదర్శించారు.

కేంద్ర-రాష్ట్ర సంబంధాల సమతుల్యత అవశ్యం : పినరయి విజయన్‌

                 కేంద్ర-రాష్ట్ర సంబంధాల సమతుల్యతను కాపాడుకోవడం కోసమే కేరళ పోరాటమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అనే భావనపై ఆధారపడిన ప్రజాస్వామ్యం ‘యూనియన్‌ ఓవర్‌ స్టేట్స్‌’ అనే అత్యంత అప్రజాస్వామిక పరిస్థితిలోకి నెట్టబడుతున్నదని విమర్శించారు. దీని పర్యవసానాలు దేశమంతటా స్పష్టంగా కనిపిస్తున్నాయనీ, ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో స్పష్టమైందని అన్నారు. ‘ రాష్ట్రాలకు సమాన హోదా కోసం, సమాఖ్య నిర్మాణాన్ని పరిరక్షించడమే ఈ ఆందోళన లక్ష్యం. అలా ఫిబ్రవరి ఎనిమిది చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దీన్ని ఉత్తర-దక్షిణ సమస్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారని ప్రధాని అనడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ప్రజాస్వామిక పోరాటం. రాష్ట్రాల పట్ల వివక్షకు నిరసన. రాష్ట్రం, ప్రజల హక్కులు ప్రమాదంలో ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండలేం. రాష్ట్రాల సమాఖ్యగా దేశం పురోగమించాలి. అంతే కాకుండా రాష్ట్రాలపై సమాఖ్య నియంతృత్వం తోడవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాలను, తద్వారా దేశాన్ని బలోపేతం చేయడంలో కేరళ పోరాటం కీలక మైలురాయిగా నిలిచింది. ఈ ప్రజాస్వామిక పోరాటానికి మరిన్ని రాష్ట్రాలు, పార్టీలు చేరుతాయని ఆశిస్తున్నా.

రాష్ట్ర జాబితాలో శాంతిభద్రతలు సహా పలు అంశాలపై రాష్ట్రాల అధికారాలను హరించివేసే చట్టాలను మోడీ తెస్తున్నాడు. వ్యవసాయం, ఇంధనం, ఆరోగ్యం, విద్య, సహకారం వంటి అంశాలపై కూడా చట్టాలు చేశారు. సహకార మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. రాష్ట్రాలను ప్రభావితం చేసే అంశాలపై సంబంధితరాష్ట్రాలను సంప్రదించకుండా బహుళజాతి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది.. రాష్ట్రాలపై కేంద్రం అప్రజాస్వామిక స్వభావానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రాల ఆర్థిక వనరులను దోచుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఫెడరలిజాన్ని నాశనం చేస్తున్నారు. కేంద్రం వివక్షను, రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతూ కేంద్రానికి లేఖలు రాసినా, వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. కేరళ విపత్తును ఎదుర్కొంటున్న తరుణంలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యతిరేక చర్యలు కొనసాగించింది” అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. ” రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్లుగా మోడీ ప్రభుత్వం మాట్లాడడం దారుణమని అన్నారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ, కేరళలో సొంత ఆదాయం అనూహ్యంగా పెరిగింది. రాష్ట్ర మొత్తం వ్యయం 2020-21లో రూ. 1.32 లక్షల కోట్ల నుంచి 2022-23 నాటికి రూ. 1.59 లక్షల కోట్లకు పెరిగింది. ఏడాది చివరి నాటికి 1.69 లక్షల కోట్లు. ఇది రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలను చూపుతోంది. సొంత ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంతో అదనపు మొత్తాన్ని వెచ్చించాం. రాష్ట్రం 2020-21లో రూ.47,661 కోట్ల నుంచి సొంత పన్నుల రాబడిని 2021-22లో రూ.58,341 కోట్లకు, 2022-23లో రూ.71,968 కోట్లకు పెంచుకుంది. సంవత్సరం చివరి నాటికి రూ.78,000 కోట్లకు చేరింది.

కేంద్రం దెబ్బ తిన్నప్పుడు కూడా కేరళలో ఆర్థిక స్తబ్ధత లేదు. సొంత ఆదాయాన్ని పెంచుకోవడం ఆర్థిక దుర్వినియోగమా? కేరళ ప్రస్తుత జిఎస్‌డిపి దాదాపు రూ.11 లక్షల కోట్లు. రుణ పరిమితుల కారణంగా కేరళ ఇందులో 10 శాతం నష్టపోతోంది. మూలధన వ్యయంపై బహుళస్థాయి ప్రభావాన్ని లెక్కిస్తే, వచ్చే ఐదేళ్లలో కేరళ రూ. 3 లక్షల కోట్ల వరకు నష్టాన్ని చవిచూడవచ్చు. దీనివల్ల కేరళ ఆర్థిక వ్యవస్థ 20 నుంచి 30 శాతం కుంచించుకుపోతుంది. కేరళ 100 రూపాయల పన్ను ఆదాయంలో 79 రూపాయలు వసూలు చేస్తుంది. కేంద్రం 21 రూపాయలు మాత్రమే ఇస్తుంది. 35 చెల్లించాలి. ఉత్తరప్రదేశ్‌కు 100కి 46, బీహార్‌కు 100కి 70 ఇస్తే, కేరళకు 100కి 21 మాత్రమే ఇచ్చారు. దీనిని వివక్ష తప్ప ఏమి చెప్పాలి. పన్ను వాటాను 3.87 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గించడం వల్ల రూ.18 వేల కోట్ల నష్టం వాటిల్లింది” అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు.

ప్రధాని మోడీకి స్పష్టమైన వార్నింగ్‌ : డి.రాజా

                    సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ, కేరళ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ ఆందోళనతో ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టమైన హెచ్చరిక చేశారని అన్నారు. ”బిజెపిని అధికారం నుంచి దింపాలంటే ప్రతిపక్ష పార్టీల ఐక్యత అవసరం. ఈ ఆందోళన ప్రతిపక్ష పార్టీల ఐక్యత, సామరస్యాన్ని బలోపేతం చేస్తుంది. దేశాన్ని రక్షించాలంటే బీజేపీని తరిమి కొట్టాలి” అని రాజా అన్నారు.

హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి : భగవంత్‌ మాన్‌

                     పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ ”ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఢిల్లీకి వచ్చి తమ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి దేశంలో నెలకొంది. దేశానికి అవసరమైన ఆహారధాన్యాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న పంజాబ్‌ పట్ల కూడా కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పంజాబ్‌కు చెల్లించాల్సిన రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్డీఎఫ్‌), మండి డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎండిఎఫ్‌) నిలిపివేయబడ్డాయి. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాం. ఈ విధంగా, రాష్ట్రం దావా వేసిన ప్రతి అంశానికి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ను సంప్రదించాలి. పంజాబ్‌లో గవర్నర్‌ అసలైన ప్రతిపక్షం. గవర్నర్‌ను మోడీ ప్రభుత్వం ఎంపిక చేసింది. కానీ మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. అది మర్చిపోకూడదు” అన్నారు. డీఎంకే నేత, తమిళనాడు మంత్రి పళనివేల్‌ త్యాగరాజ్‌ మాట్లాడుతూ, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య సూత్రాలను సమర్థించిన నరేంద్రమోడీ, ప్రధాని అయ్యాక సమాఖ్య సూత్రాల పునాదులను తారుమారు చేసే పనిలో నిమగమై ఉన్నారని విమర్శించారు.

పథకం ప్రకారమే రాష్ట్రాలపై దాడి : సీతారాం ఏచూరి

                  సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ, రాష్ట్రాలను నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే దాడి చేస్తోందని విమర్శించారు. లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రాన్ని ఫాసిస్టు స్వభావంతో కూడిన హిందూ దేశంగా మార్చడమే బిజెపి లక్ష్యమన్నారు. ”దేశ సమాఖ్య వ్యవస్థకు ఇది విరుద్ధం కాబట్టి ఫెడరలిజాన్ని నాశనం చేయడానికి బిజెపి పూనుకుందని” అన్నారు. రాజ్యాంగం ప్రకారం, ”భారతదేశం రాష్ట్రాల యూనియన్‌. కానీ బిజెపి మోడీల దృష్టిలో రాష్ట్రాలు లేవు. యూనియన్‌ మాత్రమే ఉంది. ‘రాష్ట్రాలు చిప్ప ఎత్తుకుని కేంద్రాన్ని దేబిరించాలని వారు కోరుకుంటున్నారు. అలా ఎన్నటికీ జరగనివ్వం’ అని ఏచూరి అన్నారు. ప్రతిపక్షాల నిరసనలు ఉత్తర, దక్షిణ విభజనను సృష్టిస్తున్నాయని ఆరోపించిన మోడీ, దేశ భౌగోళిక స్థితిని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. పంజాబ్‌, ఢిల్లీ దక్షిణాది నుంచి కేంద్ర స్థానాన్ని నిరసిస్తున్నాయా? అని ప్రశ్నించారు. కేరళ సాగిస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి అన్ని విధాలా అండగా ఉంటాం” అని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం యుద్ధం : అరవింద్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం కారణంగా కేరళ ముఖ్యమంత్రి, మంత్రులు నిరసనకు దిగాల్సి వచ్చింది. జంతర్‌ మంతర్‌ అంటే సాధారణంగా అధికారులపై నిరసనలు వ్యక్తం చేసే ప్రదేశం. ఇక్కడ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు నిరసనకు దిగాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దేశం ఇదంతా గమనిస్తున్నది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఆ రాష్ట్రాలకు రావాల్సిన నిధులు నిరాకరించారు. మంత్రులను, నాయకులను దర్యాప్తు ఏజెన్సీలు వేటాడుతున్నాయి. కేరళ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఢిల్లీ ప్రజలు భారతీయ పౌరులు కాదా? ప్రతి రాష్ట్రానికి రావాల్సిన వాటా, సాయం అందించడం కేంద్ర ప్రభుత్వ విధి. మనలో ఎవరూ అడుక్కోవడం లేదు. హక్కు వాటా ఇమ్మంటున్నాం. విజయన్‌ ఇక్కడ నిరసనలు చేస్తున్నది తన భార్య, పిల్లల కోసం కాదు. ఆయన పోరాటం ప్రజల కోసమే.ఏ హక్కయితే మాకుందో అది ఇవ్వండి. అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టును ఆశ్రయించలేం. నిధులు లేకుండా కేరళ ఎలా ముందుకు సాగుతుంది? ఇతర రాష్ట్రాలు ఎలా ముందుకు వెళ్తాయి? గతంలో ఎవరైనా నేరారోపణలు వచ్చినప్పుడు దాన్ని కూలంకషంగా విచారించి దోషిగా తేలి జైలుకెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆ వ్యక్తిని ముందుగా అరెస్ట్‌ చేసి జైల్లో పెడతారు. ఆ తర్వాత కేసు పెడతారు. ప్రభుత్వాలను కూలదోస్తారు. తాజాగా, వారు జార్ఖండ్‌ ముఖ్యమంత్రిని అరెస్టు చేశారు. రేపు నన్ను, ఇతరులను అరెస్టు చేయవచ్చు. కాలచక్రం తిరుగుతుంది. అధికార పక్షం ప్రతిపక్షం, ప్రతిపక్షం అధికార పక్షం అవుతుంది. తమ హౌదా గురించి గర్వపడే వారు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది” అని అన్నారు.

➡️