నాణేలు చరిత్రను బహిర్గతం చేస్తాయి

Apr 12,2024 00:09 #Ambedkar University VC, #hydrabad
  •  అంబేద్కర్‌ వర్సిటీ విసి సీతారామారావు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ప్రపంచ చరిత్ర లోహంతో ముడిపడి ఉందని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బిఆర్‌ఎఒయు) విసి కె సీతారామారావు అన్నారు. లోహంతో తయారయ్యే నాణేలు మాత్రమే ఆయా ప్రాంత, దేశ చరిత్రను బహిర్గతపరుస్తాయని చెప్పారు. ‘న్యూమిస్మాటిక్స్‌-దక్షిణ భారత దేశ చరిత్ర పునర్నిర్మాణం’అనే అంశంపై హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ వర్సిటీలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువ పరిశోధకులు ఈ అంశాలపై దృష్టి పెడితే చరిత్రకు సంబంధించిన మరిన్ని చారిత్రక అంశాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఎఎస్‌ఐ డైరెక్టర్‌ సత్య మూర్తి ఈ ముగింపు సదస్సులో కీలకోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పురాతన నాణేలు ప్రపంచ చరిత్రను వెలికితీసేలా చేశాయని అన్నారు. చరిత్రకారులు పురాతన నాణేలను మరింత అధ్యయనం చేయాలనీ, తవ్వకాల్లో బయటపడే నాణేలను సేకరించి మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన సుధారాణి మాట్లాడుతూ.. ఈ సదస్సులో అనేక చారిత్రక ఆనవాళ్లు, విభిన్నమైన నాణేలు, వాటిపై పరిశోధనలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించామని వివరించారు. సౌత్‌ ఇండియన్‌ న్యూమిస్మాటిక్స్‌ సొసైటీ అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ.. సొసైటీని మరింత పటిష్ట పర్చాలనీ, దేశ చరిత్రను అధ్యయనం చేయడానికి ఈ సదస్సు దోహదపడుతుందని చెప్పారు. ఇంటాక్‌ (న్యూ ఢిల్లీ) గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు వేద కుమార్‌ మాట్లాడుతూ.. చారిత్రక నేపథ్యం కలిగిన అత్యంత పురాతన నాణేలు సేకరించడంలో హైదరాబాద్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. ఇంటాక్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ పి అనురాధ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ చారిత్రక ఆనవాళ్లు నాణేలలో నిక్షిప్తమై ఉందనీ, యువ పరిశోధకులు చారిత్రక నాణేలను సేకరించి అధ్యయనంపై దృష్టిసారించాలని సూచించారు. ఈ సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రాలతో కూడిన సావనీర్‌ను ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్‌ పి చెన్నారెడ్డి రచించిన న్యూమిస్మాటికా ఇండికా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చరిత్ర విభాగాధిపతి జి.దయాకర్‌, డీన్‌ వడ్డాణం శ్రీనివాస్‌ సదస్సులో కార్యక్రమ వివరాలతో కూడిన నివేదికను సమర్పించారు. అన్ని విభాగాల డీన్లు, డైరెక్టర్లు, బ్రాంచ్‌ల అధిపతులు, ఇతర విశ్వవిద్యాలయాల చరిత్రకారులు, వివిధ శాఖల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గిన్నారు.

➡️