పింఛన్ల వ్యవహారంలో సీఎస్‌పై విచారణ జరపాలని కూటమి ఫిర్యాదు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డిపై టీడీపి, బీజేపీ, జనసేన నాయకులు కేంద్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఎస్‌ ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని , పింఛన్ల వ్యవహారంలో సీఎస్‌పై ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరారు. వాలంటీర్లను పక్కనపెట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో పింఛన్ల పంపిణీకి ఈసీ ఆదేశాలు జారీ చేయగా సీఎస్‌ దానిని పట్టించుకోలేదని ఆరోపించారు.
సీఎస్‌ వైఖరితో 33 మంది మరణించారని వెల్లడించారు. కదల్లేని వారినీ సచివాలయాలకు రావాలని అధికార వైసీపీ ప్రచారం చేసిందని విమర్శించారు. ఇంటి వద్దే పింఛన్లు అందించేలా ఆదేశించాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు అందేలా చూడాలని విన్నవించారు. వైసీపీ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్న సీఎస్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. పింఛన్ల నిధులు సమకూర్చడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

➡️