పౌరసత్వ సవరణ చట్టం-కథాకమామీషు

Mar 17,2024 06:05 #CAA, #edite page

భారత పౌరసత్వ చట్టానికి 2019లో పార్లమెంటు ఒక వివాదాస్పదమైన సవరణ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ చట్టాన్ని అమలు చెయ్యటానికి సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈనెల 11వ తేదీన రాజపత్రంలో ప్రచురించిన నేపథ్యంలో ఈ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సవరణ చట్టంలో ఉన్న వివాదాస్పద విషయం ఏంటంటే మొట్టమొదటిసారి భారత పౌరసత్వాన్ని పొందటానికి మతం ఒక ప్రాతిపదిక అయింది! సవరించిన చట్టం ప్రకారం పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మరియు ఆఫ్ఘనిస్థాన్‌ దేశాల్లో మత ప్రాతిపదికన వివక్షతకు, వేధింపులకు గురై మన దేశానికి శరణు వచ్చిన హిందు, క్రిస్టియన్‌, బౌద్ధ, పార్శీ, సిక్కు మరియు జైన మతాలకు చెందిన వారు భారత పౌరసత్వం త్వరితగతిన పొందటానికి వీలు కలుగుతుంది. పాత చట్టం ప్రకారం విదేశీయులు నేచురలైజేషన్‌ ప్రక్రియ ద్వారా పౌరసత్వం పొందటానికి భారత్‌ లో 11 ఏళ్ళు నివాసం వుండాలి. సవరించిన చట్టం ప్రకారం ఆ కాలపరిమితిని ఐదేళ్లకు కుదించారు. అయితే ముస్లింలకు ఈ వెసులుబాటు వర్తించదు. ప్రభుత్వ వాదన ఏంటంటే… ఈ మూడు దేశాల్లో ఇస్లాం అధికారిక మతం అయినందున ఆ దేశాల్లో ముస్లింలు మత ప్రాతిపదికన ఏ విధంగా వేధింపులకు గురవుతారు అని? శ్రీలంకలో హిందువులు వివక్షతకు, వేధింపులకు గురై దేశం వదిలి భారత్‌లో తలదాచుకుంటున్నారు. మరి వారిని ఎందుకు విస్మరించింది ఈ చట్టం? ఇక్కడ వాస్తవం ఏంటంటే… ఎక్కడో వివక్షతకు గురైన పార్శీలకు పునరావాసం కలిపించే వంకతో ఇక్కడ ముస్లింలను వివక్షకు, అభద్రతకు గురిచెయ్యటమే ఈ చట్ట ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఈ చట్టం భారతీయ స్పూర్తికి విరుధ్దంగా వున్నది. ఎవరినైనా ఈ గడ్డమీదకు ఆహ్వానించటం, ఆదరించటం భారతీయుల నైజం. బంగ్లాదేశ్‌ యుధ్దం సమయంలో వేలకొలది ఆ దేశం నుంచి మన దేశంలోకి శరణార్ధులుగా వచ్చారు. ఏ మతం అనేది చూడకుండా అందరినీ అక్కున చేర్చుకున్నాం, ఆదరించాం. నాటి ఆంధ్రప్రదేశ్‌ లో కూడా అలా శరణార్ధులుగా వచ్చి స్థిరపడ్డవారున్నారు. లౌకికవాదం రాజ్య విధానమని మన రాజ్యాంగం స్పష్టంగా విశదీకరిస్తున్న నేపథ్యంలో పౌరసత్వం పొందటానికి మతాన్ని ఒక ప్రాతిపదిక చెయ్యడం మరియు ఒక మతం వారికి సవరించిన చట్టం వర్తించదు అని చెప్పటం రాజ్యాంగ ఉల్లంఘనే అని మేధావులు, న్యాయకోవిదులు స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగంలోని 14 వ అధికరణం భారత భూభాగంలో వున్న ఏ వ్యక్తికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం కల్పించే భద్రతను రాజ్యం నిరాకరించదు అని పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే …ప్రాధమిక హక్కుల్లోని ఒక్క 14వ అధికరణంలోనే వ్యక్తి అనే మాట వుంటుంది. ప్రాధమిక హక్కులకు సంబంధించిన మిగతా అధికరణాలలో పౌరుడు అనే మాట వుంటుంది గానీ వ్యక్తి అని వుండదు. అంటే చట్టం ముందు ఏ వ్యక్తి అయినా, అతడు పౌరుడైనా పరదేశీ అయినా, సమానమే అని రాజ్యాంగం చెబుతోంది. మరియు చట్టం కల్పించే భద్రత ఈ భూభాగంలో ప్రతి వ్యక్తికీ వర్తిస్తుందని ఈ అధికరణం స్పష్టంగా చెబుతున్నది. మరి పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వర్తించదు అనే వాదన రాజ్యాంగ విరుధ్ధమే కదా! పార్లమెంటు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదించిన పిదప చట్టం అవుతుంది. అయితే చట్టాన్ని రాజపత్రంలో ప్రచురించిన తరవాతే చట్టం అమలులోకి వస్తుంది. అలా ప్రచురించనంతవరకు చట్టం అమలుకు నోచుకోదు. అయితే ఇది రాజ్యాంగ సవరణకు వర్తించదు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చెయ్యటానికి సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు రావటానికి కేవలం వారం రోజుల ముందు రాజపత్రంలో ప్రచురించటం ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందటానికే అని చాలామంది భావిస్తున్నారు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం తప్పుకాదు. కానీ రాజకీయ ప్రయోజనం కోసం రాజ్యాంగ మౌలిక స్వరూపంతో ఆటలాడుకోవటం విచారకరం. ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి వస్తూనేవుంటాయి. ఒక్కో ఎన్నికలో ఒక్కో విషయం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అది ఆ ఎన్నిక వరకు పరిమితమవు తుంది. కానీ రాజ్యాంగానికి ఒక పవిత్రత, ప్రతిష్ట వుంది. అది శాశ్వత శాసనం. పార్లమెంటు చేసే ఏ శాసనమైనా ప్రాధమిక శాసనానికి లోబడే వుండాలి గానీ, దాన్ని అధిగమించేదిగా ఉండరాదు. ఇది కూడా రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్న విషయమే. ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి కేవలం వారం రోజుల ముందే ఈ వివాదాస్పద అంశానికి మరోసారి తెరలేపడంలో ఉద్దేశం రాబోయే ఎన్నికల్లో హిందువులను ఒక వైపున మొహరించడానికేనని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటివరకు హిందువులు జాతీయ స్థాయిలో మతప్రాతిపదికన ఓటు బ్యాంకు అవ్వలేదు. కానీ సంఘ పరివార్‌ హిందువులను ఒక ఓటు బ్యాంకుగా మార్చాలని గట్టి ప్రయత్నమే చేస్తోంది. హిందువులందరి తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. కానీ హిందూత్వ వాదులు ఈ వైవిద్య స్ఫూర్తిని ఛిద్రం చేయాలని కోరుకుంటున్నారు. హిందువుల్లో వైష్ణవులు, శైవులు, ఉత్రరాది, దక్షిణాదివారి సంప్రదాయాలు వైవిద్యభరితంగా వుంటాయి. పైగా విశ్వాసం అనేది వ్యక్తిగతం అని రాజ్యాంగంలో లిఖించుకున్నాం. విశ్వాసం అనేది పరిపాలనకు, రాజ్య వ్యవస్థకు ప్రాతిపదిక కారాదు. ఈ అభిప్రాయం నేడు అపాయంలో పడింది. భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతం ఆధారంగా మన జాతి నిర్మాణం జరగాలని స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగ సష్టికర్తలు కోరుకున్నది నేడు ప్రశ్నార్ధకమైంది. భిన్నత్వ స్ఫూర్తికి భిన్నంగా నేడు రాజ్య విధానం సాగుతోంది. హిందుత్వ వాదులకు భిన్నత్వం గిట్టదు. ఐక్యం కన్నా ఏకీకరణ ముద్దు. వారికి యూనిటీ కన్నా యూనిఫార్మిటీ ముఖ్యం. అందరూ ఒకే భాష మాట్లాడాలి. ఒకే సంస్కతిని పాటించాలి. జాతి బలపడటానికి ఏకీకరణే ప్రాతిపదిక కావాలనేది హిందూత్వ వాదుల లక్ష్యం. హిందీ భాష, ఏకరూప పౌర స్మతి, ఒక దేశం ఒక ఎన్నిక వంటి అంశాలు ఏకీకరణ ఉన్మాదంలో ముఖ్యమైన మెట్లు. అయితే, హిందూత్వ వాదుల లక్ష్యం నెరవేరదు. సముద్రంలో నీళ్లు తోడిపొయ్యాలనుకోవటం లాంటిదే వారి ప్రయత్నం. కానీ వారు చేసే ప్రయత్నం వలన తగిలే గాయం త్వరగా మానదు. ఈ విషపూరిత, విధ్వంసకర ధోరణిని విశాల దక్పధంతో హిందువులు గమనించాలి. పరిపాలనకు ప్రాతిపదిక మత మౌడ్యమా, ఆధునిక దక్పథమా అన్న సంఘర్షణను దేశం ఎదుర్కొంటోంది నేడు. విశ్వాసానికి, రాజ్యవిధానానికి మధ్య ఉండవలసిన స్పేస్‌ క్రమేణా కుచించుకుపోతూవుంది. గత దశాబ్ద కాలంలో. రాజ్యాంగ వ్యవస్థలు కూడా బలవుతున్నాయి ఈ ధోరణితో. దేవాలయాలు కట్టటం, వాటిని ప్రారంభించటం వంటి విషయాల్లో రాజ్యానికి పెద్దగా ప్రమేయం ఉండేది కాదు గతంలో. కేవలం నియంత్రణ వరకే రాజ్యం పరిధి ఉండేది. నేడు నియంత్రణ కన్నా దేవాలయాల నిర్మాణం, నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది రాజ్యం. తద్వారా హిందువులు ఒక ఓట్‌ బ్యాంకుగా ఏర్పడితే ఎన్నేళ్ళైనా రాజ్యాధికారం హిందుత్వ వాదుల చేతుల్లో ఉంటుంది. వారి విజయానికి ఢోకా వుండదనేది ప్రధాన ఉద్దేశం. దీనికి ఊ అనాలా… ఉహూ అనాలా అనేది భారతీయులందరూ లోతుగా అలోచించి నిర్ణయించాలి. దానికి ఎన్నికలే సరైన సందర్భం. ప్రజలు పరిపాలనా విషయాల పట్ల ఆసక్తి చూపకపోతే, మూర్ఖుల పాలనలో బతకవలసి వస్తుందని ప్లేటో మహాశయుడు ఏనాడో చెప్పాడు.

గుమ్మడిదల రంగారావు

➡️