సినిమా … సీరియస్‌ సాహిత్యమే

Mar 24,2024 08:40 #book review, #Sneha

నాటకం అన్ని సాహిత్య ప్రక్రియలలోకెల్లా గొప్పదని చెప్పుకుంటాం. ఆ నాటకాలే కాలానుగుణంగా మారుతూ సినిమాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మనిషికి కావాల్సిన వస్తువుల్లో వినోదమూ ఒకటి. అవి అందిస్తున్న వాటిల్లో సినిమా ఇండిస్టీ ముందుంటుంది. ఓ కొత్త సినిమా విడుదలైంది అంటే అది ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఉత్సాహం అందరిలోనూ ఉంటుంది. మరి పత్రికల్లో, వెబ్‌సైట్స్‌లో రివ్య్వూలు చదివి, బాగుంటే వెళ్లడం, బాగోలేదు అంటే వెళ్లకుండా ఉంటారు. అలాంటిది ఒక సినిమాను సమగ్రంగా పాఠకుడి కళ్లముందు నిలిపి, దాని గుణదోషాలు చేయాలి అంటే విమర్శకుడికి చాలా అధ్యయనం ఉండాలి. అలాంటిది కొన్ని వందల సినిమాల విమర్శలను రాశారు జర్నలిస్టు, విమర్శకుడు, కవి, సినిమా క్రిటిక్‌ ప్రసేన్‌. సినిమాలను ఇష్టపడేవారు, ఎంతో ఇష్టంగా, పిచ్చిగా చూసేవారు ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి.
అందరి జీవితాల్లో భాగమైన సినిమాను చూసినప్పుడు వాటి తాలూకు జ్ఞాపకాలు మనల్ని నాలుగైదు రోజుల వరకూ వెంటాడుతూ ఉంటాయి. మన పనుల్లో, ప్రవర్తనల్లో ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో అవి సమాజహితంగా ఉంటే బాగుంటాయని రచయిత ప్రసేన్‌ ఆకాంక్ష. తనదైన దృష్టి కోణంలో నుంచే చూసి అనేక సినిమాలకు సమీక్షలు రాశారు. అవన్నీ ఓ పత్రికలో ప్రచురితమయ్యాయి. అవన్నీ కలిపి ‘ప్రసేన్‌ఏ సినిమా’ పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో 150 సినిమాల గురించే ఉన్నాయి. ఈ రివ్యూలన్నీ చదివాక ఆయన సినిమాలను ఎంత పిచ్చిగా ప్రేమించారో అర్థమవుతుంది. సినిమా కూడా సీరియస్‌ సాహిత్యమే. ఒక్క తెలుగు సినిమాలే కాదు.. హిందీ, తమిళం, ఇతర భాషల సినిమాలనూ చూశారు. ఆయన సినిమానీ హృదయంతో ఆస్వాదించి, రాసినట్లు కనిపిస్తోంది. నిజమే సినిమాలను ఈ కోణంలోనే చూసి ఆలోచించాలి.. అనిపించేంతగా విమర్శించారు. కాదు కాదూ సినిమాల సమీక్షలను రాస్తూనే విమర్శించారు. తన భాషలో అంతకుముందు వచ్చిన సినిమాల గురించి, సాహిత్యం, సంగీతం, సినిమా నిర్మాణం మీద అవగాహనతో రాశారు.
ప్రతి సమీక్షలోనూ సమాజానికి మంచి చేయకపోయినా చెడు చేయకూడదన్న ఉద్దేశమే కనిపిస్తోంది. ప్రతి సంఘటననీ క్షుణ్ణంగా పరిశీలించి ‘ఇలా ఎందుకు తీశారు దర్శకుడు? అలా ఎందుకు రాసుకున్నారు కథా?’ అంటూ ప్రశ్నించారు. ప్రపంచ సినిమాలతో పోల్చి, తెలుగు ఇండిస్టీ నేర్చుకోవాల్సింది చాలా ఉందని వివరించారు.
నిజమే కదా! సినిమా విజయవంతం కావడం కోసం ప్రతి సినిమాలోనూ బూతుపురాణాలతో ఓ మాస్‌ సాంగ్స్‌, అశ్లీల దృశ్యాలు, వీరత్వంతో పలికించే డైలాగ్స్‌ పెడుతున్నారు. వీటిని జనంలోకి వదిలి, యువతకు ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలి. సమాజంలో చెడుబీజాలు వేస్తుంది ఎవరు? అని నిగ్గదీసి రచయిత అడిగారు.
సినిమాలో దు:ఖం కలిగించే సీన్లు చూసినప్పుడు చాలామందికి తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఆ దు:ఖం మనకు తెలిసిన దు:ఖం కంటే ఎక్కువ అందంగా ఉండటం వల్ల. హాస్యం పుట్టించే సీన్లు చూసినప్పుడూ అంతే ! నవ్వుని కంట్రోల్‌ చేసుకోలేము. నవ్వేస్తూనే ఉంటారు. అంటే ఆ ఆనందం మనకు తెలిసిన ఆనందం కంటే ఎక్కువ ఆనందంగా ఉండటం వల్లే. ఈ విషయం ప్రేక్షకుల మనసులకూ చాలా స్పష్టంగా తెలుసు. అందుకే మంచి కథతో వచ్చిన సినిమాలన్నీ రోజుల తరబడి థియేటర్లో ఆడతాయి. సారం లేని కథలతో వచ్చిన సినిమాలన్నీ ఒకటి రెండు రోజుల్లోనే థియేటర్‌ నుంచి వెళ్లిపోతాయి. అలా రచయిత పెద్ద, చిన్న సినిమా అని బేధం లేకుండా సమీక్ష చేశారు. నాలుగేళ్లపాటు కష్టపడి తీసిన ‘బాహుబలి’ ని, హిట్‌ దర్శకులని పేరు తెచ్చుకున్న కొరటాల శివ, ఆర్జీవి లాంటి వారిని కూడా ఎక్కడా క్షమించలేదు. సినిమాలోని లోపాలను ఎత్తి చూపారు. ఉతికి ఆరేసారు. వందకోట్లను లక్ష్యంగా చేసుకుని సినిమాను తీయడం కాదు.. అందులో ప్రేక్షకుడికి ఏం చెప్పారు? అని రచయిత అడిగారు.
పక్క ఇండిస్టీ వారు నిజాలు చెబుతూ, ప్రయోగాలు చేస్తుంటే తెలుగువారు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. అందులోనూ కవిత్వాన్నీ గుప్పించారు. ప్రేక్షకుడి మెదడుకు పని చెప్పే సినిమాలు తీయమని కోరారు. చిన్న సినిమాల వైపు నిలబడ్డారు. అందులో తెలంగాణ మట్టితనం కనిపించే చేనేత కన్నీటి ఉప్పదనం ఉన్న ‘మల్లేశం’ సినిమా కథను హృద్యంగా చెప్పారు. ఇలా ప్రతి సినిమా రివ్య్వూలోనూ రచయిత తనదైన శైలి కనిపించింది. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వొద్దు అనే వివక్ష పాటించిన పెద్దలను ఓటిటిలో సినిమాలను విడుదల చెయ్యొద్దు అనే హక్కు ఉంటుందా? అని గట్టిగా ప్రశ్నించారు. పెద్ద, చిన్న సినిమాలు అనే గొడవను పక్కన పెడితే సామాన్య ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారనేదే ముఖ్యం. నటీనటులకు తగ్గ కథలను ఇచ్చిన దర్శకులను అభినందిస్తూ, సరైన కథను ఇవ్వని దర్శకులను వారి లోపాలను బట్టబయలు చేస్తూ రాసిన ఈ సినిమాల సమీక్షల ప్రసేన్‌ అదుర్స్‌.

పుస్తకం : ప్రసేన్‌ ఏ సినిమా
రచయిత : ప్రసేన్‌
ధర :400
ఫోన్‌ నెం-9848997241

  • – పద్మావతి, 94905 59477
➡️