చిరంజీవి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలి : చింతా మోహన్‌

 ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : చిరంజీవి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రెస్‌ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీల్లో పరివర్తన వచ్చిందన్నారు. వీరంతా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని చెప్పారు. గడిచిన పదేళ్లలో వైసిపి, టిడిపిల పాలనలో ఎస్‌సి, ఎస్‌టిలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పథకాలను రద్దు చేయడం, సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించడం వంటి చర్యలకు ఆ ప్రభుత్వాలు పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలోని వైసిపి, టిడిపిలు కేంద్రంలోని బిజెపితో అంటకాగుతున్నాయన్నారు. బిజెపితో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాధికారం కాంగ్రెస్‌తో కాపులు కలిసి రావాలని కోరారు.

➡️