తైవాన్‌ ఎన్నికలపై అమెరికా వ్యాఖ్యలకు చైనా ఖండన

Jan 15,2024 12:17 #America, #China, #Comments, #elections, #Taiwan

బీజింగ్‌ : తైవాన్‌ ఎన్నికలపై అమెరికా చేసిన వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది. తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (పిడిపి)కి చెందిన లారు చింగ్‌-టె విజయం సాధించడాన్ని తైవాన్‌ స్వాతంత్య్రానికి మొగ్గు చూపిస్తున్నట్లుగా వర్ణిస్తూ శనివారం అమెరికా అభినందనలు తెలిపింది. అమెరికా ప్రకటనపై ఆదివారం చైనా విచారం వ్యక్తం చేసింది. తైవాన్‌ ఎప్పటికీ చైనాలో అంతర్భభాగమేనని స్పష్టం చేసింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ‘అమెరికా ప్రకటన తైవాన్‌లోని వేర్పాటువాద శక్తులకు తప్పుడు సంకేతాన్ని పంపుతుంది’ అని పేర్కొన్నారు. అమెరికా ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం, గట్టిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే, అమెరికా ప్రకటన ‘ఒకే చైనా సూత్రం’ను ఉల్లంఘిస్తుందని, తైవాన్‌తో కేవలం అనధికార సంబంధాలను మాత్రమే కొనసాగించాలని అమెరికాకు చైనా విజ్ఞప్తి చేసింది. తైవాన్‌తో అధికారిక జోక్యాన్ని నిలిపివేయాలని, తైవాన్‌లో వేర్పాటువాద శక్తులకు తప్పుడు సంకేతాలను ఇవ్వడం మానుకోవాలని అమెరికాను గట్టిగా హెచ్చరించారు.

➡️