కీలక దశలో చైనా ఆర్థిక వ్యవస్థ రికవరీ

  • అధ్యక్షుడు జిన్‌పింగ్‌

బీజింగ్‌ : చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడమనేది ఇంకా కీలక దశలోనే వుందని ఆ దేశ అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌ తెలిపారు. కోవిడ్‌ అనంతర కాలంలో దేశీయ కార్యకలాపాలను మందకొడిగా సాగడం, ఆస్తుల రంగం అనేక ఒడిదుడుకులకు లోను కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. చైనా ప్రభుత్వం పెట్టుకున్న ఐదు శాతం లక్ష్యానికి కాస్త తక్కువగా మూడో త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 4.9శాతం మేరకు విస్తరించింది. ”ప్రస్తుతం, దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ఇంకా కీలక దశలో వుంది.” అని జిన్‌పింగ్‌ చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో పేర్కొన్నారని ప్రభుత్వ ప్రసార సంస్థ సిసిటివి పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రోత్సాహమందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా సంక్లిష్టంగా వున్నాయన్నారు. ఇందుకు అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగాల్లో నానాటికి పెరుగుతున్న ప్రతికూల పరిస్థితులు కూడా కారణమని అన్నారు. ఆధునిక పారిశ్రామిక వ్యవస్థ నిర్మాణాన్ని వేగిరపరచడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుందన్నారు. దేశీయ డిమాండ్‌ను విస్తరించాలన్నారు. తద్వారా రిస్క్‌లను నివారించాలని జిన్‌పింగ్‌ కోరారు. కీలకమైన సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో స్వావలంబన పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. తద్వారా కొత్త అభివృద్ధి లే అవుట్‌ నిర్మాణాన్ని వేగిరపరచాలన్నారు.

➡️