ప్రకృతి ఆగ్రహం

Feb 8,2024 07:25 #chile, #Editorial, #fire, #Forest
chile wildfire forest editorial

చిలీ అడవుల్లో భారీ అగ్నికీలలు చెలరేగడం ప్రపంచమంతటా చర్చనీయాంశంగా మారింది. గత శుక్రవారం ఒక చిన్న కార్చిచ్చుగా ప్రారంభమైన మంటలు ఆ దేశపు మధ్య, దక్షిణ భాగంలోని 43 వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న 90కి పైగా అడవులను భస్మీపటలం చేశాయి. అటవీ ప్రాంతాల నుండి జనసమ్మర్ధం ఉన్న నగరాలకు కూడా మంటలు వ్యాపించడంతో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి 131 మంది మరణించారని, మరో 370 మంది ఆచూకీ లభించడం లేదని చిలీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దట్టమైన పొగ, ధూళి వ్యాపించి ఉండటంతో వాస్తవ నష్టం అంచనా వేయడం అసాధ్యంగా ఉందని ఆ దేశాధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రమాద తీవ్రతను, అది వ్యాపించిన వేగాన్ని దృష్టిలో పెట్టుకుంటే పెద్ద సంఖ్యలో మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాయని భావిస్తున్నారు. పర్యావరణానికి, జీవావరణానికి సంభవించిన నష్టం అంచనా వేయడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదని వాతావరణ నిపుణులు అంటున్నారు. చిలీకి కార్చిచ్చులు కొత్త కాదు. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో అడవులు తగలబడటం సహజమే! కానీ, వాతావరణ మార్పుల కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామలు ఈ తరహా ప్రమాదాల తీవ్రతను, నష్టాన్ని పెంచుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వాటితో పాటే ఏర్పడే తీవ్ర కరువు కారణంగా వాతావరణంలో తేమ ఏమాత్రం లేని స్థితికి చేరడం, అదే సమయంలో అడవులు పూర్తిగా ఎండిపోయి చిన్పపాటి రాపిడే పెను ప్రమాదంగా మారుతోంది. మంటలకు శరవేగంతో వీస్తున్న వేడిగాలులు కూడా తోడు కావడంతో పరిస్థితి భయానకంగా మారుతోంది. తూర్పు పసిఫిక్‌ మహా సముద్రంలో కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితులు, ఇటీవలి దశాబ్దాలలో ఎన్నడూ లేనివిధంగా చోటుచేసకున్న తీవ్ర కరువు పరిస్థితులు ఈ ఏడాది అదనం! ఫలితంగా గత దశాబ్ద కాలంలోనే అతి పెద్ద ప్రమాదంగా తాజా కార్చిచ్చు నిలిచింది. గడిచిన ఏడాదంతా వాతావరణ విపత్తులతో నిండిన విషయం తెలిసిందే. ఈ ఏడాదైనా ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుందన్న ఆశలకు ప్రారంభంలోనే గండి పడింది. కాలిఫోర్నియాలో ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయి. స్పెయిన్‌లో తీవ్ర కరువు నెలకొంది. చిలీలో కార్చిచ్చులు భయోత్పాతం సృష్టిస్తున్నాయి. మన దేశంలోనూ కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వార్తలు వచ్చాయి. రానున్న వేసవిలో ఎండలు అత్యంత తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భూమి మీద కొన్ని ప్రాంతాల్లో అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, మరికొన్ని ప్రాంతాలు తుపాన్లు, వరదలు వంటి విపత్తుల్లో చిక్కుకుంటున్నాయి. భూతాపాన్ని నియంత్రించడం ద్వారానే ఈ తరహా ప్రమాదాలను రూపుమాపగలమని నిపుణులు చెబుతున్నారు. అయితే, కార్పొరేట్ల లాభాల పోటీ ప్రపంచంలో అది సాధ్యమవుతుందా అన్నదే అసలైన ప్రశ్న!

ఒక అధ్యయనం ప్రకారం వాతావరణ విపత్తుల కారణంగా గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 12 వేల మంది మరణించారు. అమెరికాకు చెందిన జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయం కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన నివేదికలో గత 20 సంవత్సరాల్లో వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొన్నారు. పరిస్థితి ఇంత ఘోరంగా మారుతున్నా భూ తాపాన్ని నివారించడంలో ప్రపంచ దేశాలు విఫలమవుతుండటం తీవ్ర ఆందోళనకరం! తాజా గణాంకాల ప్రకారం పారిశ్రామిక విప్లవపు పూర్వ సగటు కంటే భూమి దాదాపు 1.2 డిగ్రీల సెల్సియస్‌ వేడెక్కింది. భూ ఉష్ణోగ్రతలో చోటుచేసుకునే స్వల్ప మార్పు కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందన్న నిపుణుల హెచ్చరికలను ధనిక దేశాలు ఏ మాత్రం ఖాతరు చేయకుండా వాతావరణ విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పారిస్‌ వాతావరణ సదస్సు నిర్దేశించిన రెండు డిగ్రీల సెల్సియస్‌కు భూతాపాన్ని పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని అందుకోవడం ప్రశ్నార్ధకంగా మారుతోంది. 1.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగితేనే ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇది మరింత పెరిగితే ప్రకృతి ఆగ్రహం కారణంగా చోటుచేసుకునే విపరిణామాలను తట్టుకోవడం అసాధ్యం. అటువంటి దుస్థితి రాకూడదంటే లాభార్జనకన్నా, విశ్వమానవ కళ్యాణానికి ప్రాధాన్యతనిచ్చే ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించడమే మానవాళి మందున్న మార్గం!

➡️