పుస్తక మహోత్సవంలో పిల్లల సృజన

Children's creativity at the Book Festival

పిల్లల సృజన వెలికితీసే వేదికగా 34వ విజయవాడ పుస్తకమహోత్సవంలో శ్రీరమణ ప్రతిభా వేదికపై కార్యక్రమాలు నిర్వహించారు. డిసెంబర్‌ 28వ తేదీన విద్యావేత్త డాక్టర్‌ పరిమి ప్రారంభించిన కార్యక్రమంలో పిల్లలు ఊహాశక్తి పెంపొందించడానికి పుస్తకాలు దోహదం చేస్తాయని వివరించారు. అనంతరం జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి మ్యాజిక్‌తో పిల్లల్ని అలరించారు. డిసెంబర్‌ 29వ తేదీ పిల్లలకు కొన్ని అంశాలు ఇచ్చి, వారికి నచ్చినదానిపై కథ చెప్పే పోటీ జరిగింది. డిసెంబర్‌ 30న జెవివి వారి సైన్స్‌ ప్రయోగాల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. డిసెంబర్‌ 31వ తేదీ ఇచ్చిన అంశంపై కథ రాసే పోటీలో బోలెడన్ని ఆలోచనలు రంగరించి, కథలు రాశారు. జనవరి ఒకటవ తేదీ పిల్లలు ఇచ్చిన కథల పుస్తకం నుండి పైకి చదివేటందుకు పోటీపడ్డారు. మొబైల్‌ ఫోన్‌ ప్రయోజనాలు, ప్రమాదాలు అంశం మీద వక్తృత్వ పోటీలో విశ్లేషణ చేస్తూ మాట్లాడారు. జనవరి మూడో తేదీ హైదరాబాద్‌ నుండి వచ్చిన అనిల్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ వర్కషాప్‌లో పిల్లలు కాగితంతో కళా ఖండాలు సృష్టించారు. ‘పద్యం చెప్పండి’ లో చిన్నారులు ముద్దు గొలిపే రీతిలో చెప్పి, అందరిని అబ్బురపరిచారు. బాల సాహితీవేత్త సి.ఎ ప్రసాద్‌ ‘అనగనగా కథ’ చెప్పి, పిల్లల్ని ఆకట్టుకున్నారు. జనవరి ఐదవ తేదీ సృజనాత్మక రచన పోటీలో పిల్లలు హుషారుగా ఎన్నో కథలు రాసి, బహుమతులు గెల్చుకున్నారు. చొక్కాపు వెంకటరమణ, మనోజ, పత్తిపాక మోహన్‌, నాదెళ్ల అనురాధ, ముంజులూరి కృష్ణకుమారి కవి సీతారాం కథ రాసే శిబిరాలను పర్యవేక్షించారు. డాక్టర్‌ అశోక్‌ నిర్వహించిన ఆడియో విజవల్‌ క్విజ్‌లో పిల్లలు తమ ప్రతిభ ప్రదర్శించారు.చివరిరోజు పిల్లలు వేదిక వద్ద ఇచ్చిన కథల పుస్తకాలు చదివి, అప్పటికప్పుడు సమీక్ష చేశారు. అరవింద హైస్కూల్‌, జిడిఈటి మున్సిపల్‌ హైస్కూల్‌ పిల్లలు పోటీలన్నింటిలో బాగా పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా అనురాధ, మందరపు హైమావతి, అనిల్‌ డానీ, కావూరి సత్యవతి, నిరుపమా, ముసునూరి ప్రమీల, రావెళ్ల శ్రీనివాసరావు సహకరించారు. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ పిల్లల వర్కుషాప్‌లకు సహకారం అందించారు. నాగప్రసూనా, ముంజులూరి కృష్ణకుమారి, జెవివి మురళీ కార్యక్రమాల్ని రూపకల్పన చేసి, నిర్వహించారు.

 

Children's creativity at the Book Festival

➡️