నాటకం బాగుంది

Feb 18,2024 08:50 #Sneha

నేస్తాలూ, మేము మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల, సంతపాలెం, విశాఖపట్నంలో మూడవ తరగతి చదువుతున్న హ్యుటగాజీ విద్యార్థులం. మా టీచర్‌ విజయభాను కోటే స్కూల్లోనే కాదు.. బడి బయట పిల్లలు ఎలా ఉండాలో మాకు, మా తల్లిదండ్రులకు సూచనలు ఇస్తూ ఉంటారు. ప్రతి వారం ఏదో ఒక చోటికి మా టీచర్‌ తీసుకువెళ్తారు. లేదా మా అమ్మానాన్నా తీసుకువెళ్తారు. మా హెడ్మాష్టర్‌ శ్రీనివాస్‌ సార్‌ కూడా మమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారు. ఆ మధ్య మా టీచర్‌ మా కోసం వుడా చిల్డ్రన్స్‌ థియేటర్‌లో జరిగే వైజాగ్‌ జూనియర్‌ థియేటర్‌ ఫెస్ట్‌కి టికెట్స్‌ తీసుకువచ్చారు. మా టీచర్‌ గారి హస్బెండ్‌ బంగార్రాజు సార్‌ మమ్మల్ని కారులో అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడ వచ్చిన పిల్లలందరిని వరుసలో నిలబెడుతూ, అందరినీ జాగ్రత్తగా చూస్తున్న సెక్యూరిటీగార్డ్సు ఇద్దరిని చూపించారు మా టీచర్‌. వాళ్ళకు ముందు థ్యాంక్స్‌ చెప్పాము. వారు చాలా సంతోషించారు.

అక్కడ పిల్లల కోసం ఎంత బాగా అలంకరించారో. జంతువుల బొమ్మలు, ఒక పెద్ద జీపు బొమ్మ, బోల్డన్ని మొక్కలు పెట్టారు. పేజెస్‌ వాళ్ళు పుస్తకాలు కూడా పెట్టారు. భూమిని ఎలా కాపాడుతామో బోలెడంత మంది పిల్లలు చిన్న చిన్న చీటీలలో రాసి అంటించారు ఒకచోట. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ మాకు మర్యాద చేసి, ప్రేమగా మాట్లాడి, ఫోటోలు తీశారు. ఇవన్నీ చూశాక నాటకం మొదలయ్యే సమయానికి థియేటర్‌లోకి వెళ్ళాం. ‘బారిబట్టల రాజు’ (ఇంగ్లీషులో ఈ కథ పేరు ‘ది ఎంపరర్స్‌ న్యూ క్లోత్స్‌) నాటకం అయ్యేవరకూ నవ్వుతూనే ఉన్నాము మేము. నాటకానికి ముందు కునాల్‌ మోట్లింగ్‌ అంకుల్‌ వాళ్ళు మాటల్లేకుండా స్కిట్‌ వేశారు. అది కూడా బాగా నవ్వు వచ్చింది. వుడా చిల్డ్రన్స్‌ థియేటర్‌ చాలా బావుంది. మీరు వైజాగ్‌ వస్తే తప్పక వెళ్ళి చూడండి. మీరు కూడా ఏదైనా కార్యక్రమానికో, ఏదైనా చోటికో వెళ్తే చెప్పండి. మేమూ కూడా తెలుసుకుంటాం. మళ్ళీ మంచి విషయం చెప్పడానికి వస్తాం. అంతవరకూ బై!

– నిత్యశ్రీ, దుష్యంత్‌ శ్రీరామ్‌, 3వ తరగతి, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల, సంతపాలెం, చినగదిల, విశాఖపట్నం.

➡️