ముఖ్యమంత్రుల సీమ

  • 45 ఏళ్లలో 8 మంది సిఎంల ప్రాతినిధ్యం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రతియేటా కరువు కాటకాలకు గురయ్యే ప్రాంతం రాయలసీమ… ప్రతియేటా లక్షలాది మంది ప్రజలు ఉన్న ఊర్లో బతకలేక మహానగరాలకు వలసలు పొయేది ఎక్కడ నుండి అంటే రాయలసీమ… రాష్ట్రంలో ఎక్కువ అటవీ ప్రాంతం, ఖనిజ సంపద, నీటి వనరులు వుండేది కూడా రాయలసీమ ప్రాంతమే… దేశంలో అత్యున్నత పదవులు అయినా దేశ ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకరు వంటి వాటితోపాటు పూర్వపు ఉమ్మడి నాలుగు రాయలసీమ జిల్లాలు… ఒక్కొక్క జిల్లా నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 8 మంది ముఖ్యమంత్రులు 45 ఏళ్లకు పైగా ఈ ప్రాంతం వారే రాష్ట్రాన్ని పాలించారు. అంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో ఒక్క పెద్ద పరిశ్రమ లేకపోవడం వింతే. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాంతానికి ఉక్కు ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే ఆ చట్టాన్ని అమలు చేయించుకోలేని అసమర్ధత మూటగట్టుకున్నది కూడా ఈ ప్రాంత నేతలేనన్నది ప్రజల, ఉద్యమకారుల భావన.

నదులున్నా తాగునీటికి కటకటలే..
కృష్ణా, తుంగభద్ర, పెన్నా వంటి నదులున్నా సాగునీరు కాదుకదా ఇప్పటికీ తాగునీటి కోసం కటకటలాడాల్సిందే. తిరుమల, శ్రీకాళహస్తి, కడప పెద్ద దర్గా, వీరబ్రహ్మేంద్రస్వామి మఠం, శ్రీశైలం, మంత్రాలయం, లేపాక్షి, శ్రీశైలం డ్యామ్‌, బెలూం కేవ్స్‌, పుట్టపర్తి వంటి కీలకమైన పర్యాటక ప్రాంతాలతో టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటుచేసి ఉపాధిని పెంచే కార్యక్రమాలను చేపట్టకపోవడం పాలకుల వైఫల్యమే. పాలకుల ఒంటెత్తుపోకడలు, ముఠా తగాదాల మూలంగానే ఈ ప్రాంతం అభివృద్ధికి దూరమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాలకపక్షంలో ముఖ్యమంత్రులుగానే కాదు.. ప్రతిపక్ష నేతలుగా ఈ ప్రాంతం నుండే సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహించారు. మద్రాసు నుంచి విడిపోయి కర్నూలు రాజధాని కేంద్రంగా వుండే ఆంధ్ర రాష్ట్రంలో మూడేళ్లపాటు ముఖ్యమంత్రులుగా కోస్తా జిల్లాలకు చెందిన టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి వున్నా, ఉప ముఖ్యమంత్రిగా అనంతపురం జిల్లాకు చెందిన నీలం సంజీవరెడ్డి చక్రం తిప్పారు. తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డ 1956 నుండి ఇప్పటి వరకు దాదాపు 45 ఏళ్లపాటు రాయలసీమ ప్రాంతం నుండే ముఖ్యమంత్రులుగా పాలించారు. మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 6 ఏళ్లు, ఆ తర్వాత కర్నూలు జిల్లాకు చెందిన దామోదరం సంజీవయ్య రెండేళ్లు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరు ముగ్గురు కేంద్రంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. నీలం సంజీవరెడ్డి లోక్‌సభ స్పీకరుగా కూడా రెండు పర్యాయాలు, రాష్ట్రపతిగానూ పనిచేశారు. అలాగే గాంధీయేతర కుటుంబం నుండి ఐదేళ్లపాటు మొదటిసారి విజయవంతంగా దేశ ప్రధానిగా వ్యవహరించిన పివి నరసింహారావు ఇక్కడి నంద్యాల పార్లమెంటు సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. కర్నూలు జిల్లా నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మూడేళ్లపాటు ముఖ్యమంత్రిగా చేశారు. అనంతరం కృష్ణా జిల్లాకు చెందిన ఎన్‌టి రామారావు ఏడేళ్లపాటు సిఎంగా రాయలసీమలోని తిరుపతి, హిందూపురం నియోజకవర్గాల నుండి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాకు చెందిన నారా చంద్రబాబు నాయుడు 14 ఏళ్లపాటు, అదే జిల్లా నుంచి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడేళ్ల మూడు నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కడప జిల్లా నుండి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్లపాటు, ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వున్నారు. అలాగే ఎన్‌టి రామారావు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలుగానూ వ్యవహరించారు. ఇంతటి ఉద్దండులు ఏలిన ఈ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి వుండేందుకు కారణం పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే
కృష్ణా జిల్లాకు చెందిన ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా వున్నపుడు రూపొందించిన తెలుగుగంగ, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్మాణం కొనసాగుతూనే వున్నాయి. ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే రాయలసీమ ప్రాంతానికి శాశ్వతంగా కరువు నుంచి విముక్తి కలిగే అవకాశం వుంది. అలాగే ప్రభుత్వ రంగంలో ప్రతి జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి దొరుకుతుంది. కొద్దో గొప్పో ఇప్పటికీ కొనసాగుతున్న ఫ్యాక్షనిజం అంతరిస్తుంది.

– బి. గోరంట్లప్ప

➡️