ఛత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 88మంది ఐఎఎస్‌ అధికారుల బదిలీ

రాయ్‌పూర్  :   ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఎన్నికైన బిజెపి ప్రభుత్వం 88 మంది ఐఎఎస్‌ అధికారులను, ఓ ఐపిఎస్‌ అధికారిని బదిలీ చేసింది. బదిలీ అయిన  వారిలో 19 జిల్లాల కలెక్టర్లు కూడా ఉన్నారు.  బుధవారం అర్థరాత్రి సాధారణ పరిపాలనా శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ సన్నిహితులు కూడా బదిలీ అయిన వారిలో ఉన్నట్లు సమాచారం.

ఆదేశాల ప్రకారం..  రాయ్‌పూర్,   బమనేంద్రగర్‌- చిర్మిరి-భరత్‌పూర్‌ (ఎంసిబి), కాంకేర్‌,  కోర్బా, రాజ్‌నంద్‌గావ్‌, బెమెతర, కొండగావ్‌, దుర్గ్‌, సూరజ్‌పూర్‌, నారాయణ్‌పూర్‌, దంతెవాడ, బీజాపూర్‌, సుర్గుజా, జంజ్‌గిరి-చంపా, బలోద్‌, ధామ్‌తరి, సారన్‌ఘరి-బిలైఘర్‌, ఖైరాగఢ్‌-చుయిఖదన్‌-గండై మరియు గరియాబండ్‌ జిల్లాల కలెక్టర్లను మార్చినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో బిజెపి అధికారంలో వచ్చిన అనంతరం గతేడాది డిసెంబర్‌ 19న 2006 బ్యాచ్‌కి చెందిన ఐఎఎస్‌ అధికారి పి. దయానంద్‌ను సిఎం సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయనను వైద్య విద్య కార్యదర్శి నుండి తప్పించి.. ఇంధనం, ఖనిజ వనరులు మరియు ప్రజాసంబంధాల శాఖల కార్యదర్శి, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పవర్‌ కంపెనీ చైర్మన్‌, వాణిజ్యం మరియు పరిశ్రమల మరియు విమానయాన శాఖల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. 2006బ్యాచ్‌కి చెందిన మరో ఐపిఎస్‌ అధికారి మయాంక్‌ శ్రీవాస్తవను కమీషనర్‌, ప్రజా సంబంధాల శాఖ డైరెక్టర్‌గా నియమించింది.

➡️