చెన్నై బోణి

Mar 23,2024 10:30 #2024 ipl, #Cricket, #csk, #Sports, #win
  • బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం
  • బౌలింగ్‌లో మెరిసిన ముస్తాఫిజుర్‌

చెన్నై: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17లో చెన్నై సూపర్‌కింగ్‌(సిఎస్‌కె) బోణీ కొట్టింది. చెపాక్‌ స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని చెన్నై 18.4ఓవర్లలో 4వికెట్లు నష్టపోయి 176పరుగులు చేసి ఘన విజయం సాధించింది. చెన్నై జట్టులో రచిన్‌ రవీంద్ర(37), రహానే(27), మిఛెల్‌(22)తో పాటు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ శివమ్‌ దూబే(34), జడేజా(25) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. గ్రీన్‌కు రెండు, యశ్‌ దయాల్‌, కరణ్‌ శర్మకు ఒక్కో వికెట్‌ దక్కాయి. అంతకుముందు బెంగళూరు టాపార్డర్‌ బ్యాటర్లు విఫలమైనా.. మిడిలార్డర్‌ ఆటగాళ్లు అనుజ్‌ రావత్‌(48; 25బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), దినేశ్‌ కార్తీక్‌(38నాటౌట్‌: 26బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు)లు మెరుపులు మెరిపించారు. డిప్లెసిస్‌ చెలరేగడంతో బెంగళూరు తొలి 5ఓవర్లలో 41 పరుగులు రాబట్టింది. ఆ దశలో చెన్నై బౌలర్‌ ముస్తాఫిజుర్‌ తొలి బ్రేక్‌ ఇస్తూ ఒకే ఓవరలో రెండు వికెట్లు తీశాడు. భారీ షాట్‌ ఆడిన డూప్లెసిస్‌(35) బౌండరీ వద్ద రచిన్‌ రవీంద్రకు చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన రజత్‌ పాటిదార్‌(0)ను ధోనీ వెనక్కి పంపాడు. ఆ తర్వాత బెంగళూరును కోహ్లీ(21), కామెరూన్‌ గ్రీన్‌(18) ఆదుకున్నారు. 78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బెంగళూరును దినేశ్‌ కార్తీక్‌(38నాటౌట్‌), అనుజ్‌ రావత్‌(48)లు ఆదుకున్నారు. వీరు ఆరో వికెట్‌కు వీరు 95 పరుగులు జోడించారు. దీంతో బెంగళూరు భారీస్కోర్‌ నమోదు చేసింది. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్‌కు నాలుగు, దీపక్‌ చాహర్‌కు ఒక వికెట్‌ లభించగా.. రావత్‌ రనౌటయ్యాడు.
స్కోర్‌బోర్డు(సంక్షిప్తంగా..)
బెంగళూరు: 173/6 (20 ఓవర్లలో; రావత్‌ 48, దినేశ్‌ కార్తీక్‌ 38నాటౌట్‌; ముస్తాఫిజుర్‌ 4/29)
చెన్నై : 176/4 (18.4ఓవర్లలో; రచిన్‌ రవీంద్ర 37, దూబే 34నాటౌట్‌; జడేజా 25నాటౌట్‌, గ్రీన్‌ 2/27

➡️