Chemical Factory లో అగ్నిప్రమాదం – ఆరుగురు సజీవదహనం

రాజస్థాన్‌ : కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు సజీవదహనమవ్వగా, ఇద్దరు తీవ్రగాయాలపాలైన ఘటన శనివారం సాయంత్రం రాజస్థాన్‌లోని జైపూర్‌ పరిధిలో జరిగింది.

జైపూర్‌ పరిధిలో ఉన్న బస్సీలోని షాలిమార్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో నిన్న సాయంత్రం బాయిలర్‌ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఎస్‌ఎంఎస్‌ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతులను మనోహర్‌, హీరాలాల్‌, కృష్ణలాల్‌ గుర్జార్‌, గోకుల్‌ హరిజన్‌లుగా పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో చేరినవారి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక దళం, రెస్క్యూ టీం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. పరిశ్రమలోని బాయిలర్‌ పేలి ఈ ప్రమాదం జరిగినట్లు జైపుర్‌ కలెక్టర్‌ ప్రకాశ్‌ రాజ్‌పురోహిత్‌ తెలిపారు. అయిదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు పోలీస్‌ కమిషనర్‌ బిజు జార్జ్‌ జోసెఫ్‌ వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో గుమికూడిన స్థానికులు పరారీలో ఉన్న ఫ్యాక్టరీ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ అధికారులను ఆదేశించారు.

➡️