న్యూస్‌క్లిక్‌, పుర్కాయస్థలపై 8వేల పేజీలతో చార్జిషీట్‌

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌పైన, ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థపైన ఢిల్లీ పోలీసులు శనివారం దాదాపు 8వేల పేజీలతో మొదటి చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్‌ సెల్‌ ఈ తుది నివేదికను అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి హర్‌దీప్‌ కౌర్‌ ముందు పెట్టింది. పుర్కాయస్థను, పిపికె న్యూస్‌క్లిక్‌ స్టూడియో ప్రైవేట్‌ లిమిటెడ్‌ను నిందితులుగా పేర్కొన్నట్లు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు అఖండ్‌ ప్రతాప్‌ సింగ్‌, సూరజ్‌ రాథి తెలిపారు. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్‌ 16కి వాయిదా వేశారు. గతేడాది డిసెంబరులో మొదటిసారిగా, తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి చార్జిషీట్‌ దాఖలు చేయడానికి కోర్టు గడువును పెంచుతూ వచ్చింది. చివరగా మార్చి 20న మరో పది రోజులు పెంచుతున్నట్లు తెలిపింది. యుఎపిఎ సెక్షన్‌ 43 డి కింద దర్యాప్తును 90నుండి 180రోజుల్లోపు పూర్తి చేయాల్సి వుంటుంది. చైనాకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నారంటూ గతేడాది అక్టోబరు 3న న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థను, హెచ్‌ఆర్‌ హెడ్‌ అమిత్‌ చక్రవర్తిని అరెస్టు చేశారు. అప్రూవర్‌గా మారిపోయేందుకు ఈ ఏడాది జనవరిలో అమిత్‌ పెట్టుకున్న దరఖాస్తును కోర్టు అనుమతించింది.

➡️