కూటమిలో మార్పులు చేర్పులు?

Apr 5,2024 02:38 #alliance, #BJP, #Changes, #JanaSena, #TDP
  •  నర్సాపురం ఎంపి అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు
  •  మరికొన్ని స్థానాల్లో కొత్త అభ్యర్ధులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన-బిజెపి కూటమిలో మార్పులు, చేర్పులు ఉంటుందనే చర్చ ఆయా పార్టీల్లో జరుగుతుంది. ఇరు పార్టీలు పరస్పర అవగాహనతో కొన్ని నియోజకవర్గాలను మార్చుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా కొన్ని చోట్ల ప్రకటించిన అభ్యర్ధుల స్థానాల్లో కొత్త అభ్యర్ధులను ప్రకటిస్తారని తెలుస్తోంది. పొత్తులో భాగంగా నర్సాపురం లోక్‌సభను బిజెపి తీసుకుంది. అయితే ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్ధి భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మ అయితే వైసిపి సులువుగా గెలుస్తుందన్న అభిప్రాయానికి కూటమి పార్టీలు వచ్చాయి. దీంతో ఈ సీటును టిడిపి తీసుకుని బిజెపికి ఏలూరు లోక్‌సభ సీటును ఇచ్చేందుకు నిర్ణయం జరిగినట్లు తెలిసింది. టిడిపి తరపున సిట్టింగ్‌ ఎంపి కనుమూరు రఘురామకృష్ణంరాజు ఈ నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నారు. ఎన్నికల పర్యటనలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబును ఆయన బుధవారం కలిశారు. శుక్రవారం అధికారికంగా తెలుగుదేశం పార్టీలో ఆయన చేరనున్నారు. అనంతరం నర్సాపురం అభ్యర్ధిగా టిడిపి ప్రకటిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వీటితో పాటు మరికొన్ని చోట్ల టిడిపి తన అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. గజపతి నగరం అభ్యర్ధిగా కొండపల్లి శ్రీనివాస్‌ను, శ్రీకాకుళం అభ్యర్ధిగా గోండు శంకర్‌, పైలా ప్రసాద్‌ను మాడుగులకు, కొలికపూడి శ్రీనివాస్‌ తిరువూరుకు, మడకశిర ఎంఈ సునీల్‌ కుమార్‌ను, తంబళ్లపల్లికి జయచంద్రారెడ్డిని, ఆదిమూలం కొనేటిని సత్యవేడుకు, సొంగ రోషన్‌ను చింతలపూడి అభ్యర్ధులుగా టిడిపి తన అభ్యర్ధులుగా ప్రకటించింది. వీరిలో కొంతమందిపై వ్యతిరేకత ఉండగా, మరికొన్ని చోట్ల ప్రత్యర్థులు బలంగా ఉన్నారని తేలినట్లు సమాచారం, దీంతో వీరిని మార్చే పనిలో టిడిపి అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తయినట్లు చెబుతున్నారు.
పాతపట్నం అభ్యర్థిగా కలమట వెంకట రమణ, శ్రీకాకుళం అభ్యర్ధిగా గుండా లక్ష్మీదేవి, మాడుగుల రామానాయుడు, మడకశిర నుంచి పార్టీ ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు ఎంఎస్‌ రాజును, చింతలపూడి నుంచి కెఎస్‌ జవహర్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరువూరు నుంచి వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి పేరు తెరపైకి వస్తోంది. ఆయన వైసిపి నుంచి బయటకు వచ్చారు. బిజెపి కూడా అనపర్తి అభ్యర్ధిగా ప్రకటించిన శివకృష్ణరాజును మార్చాలని భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సొంత గ్రామం రంగపురం నుంచి సర్పంచ్‌గా పోటీ చేస్తే ఆయనకు డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో శివకృష్ణరాజును మార్చాలనే నిర్ణయం తీసుకుంది. అనపర్తి టిడిపి ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపిలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒత్తిడి తీసుకొచ్చిన్నట్లు సమాచారం. పార్టీ మారే ప్రసక్తే లేదని రామకృష్ణారెడ్డి చెప్పిన్నట్లు తెలిసింది. దీంతో ఈ సీటును టిడిపికి అప్పగించి మరో సీటును తీసుకోవాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు సమాచారం. జమ్మలమడుగు శాసనసభ అభ్యర్థిగా చపిడిరాళ్ల ఆదినారాయణ రెడ్డిని బిజెపి ప్రకటించింది. కడప లోక్‌సభ టిడిపి అభ్యర్థిగా ఆయన సోదరుని కుమారుడు చపిడిరాళ్ల భూపేష్‌ రెడ్డిని టిడిపి ప్రకటించింది. తమ పార్టీలు ఒప్పుకుంటే కడప లోక్‌సభ నుంచి తాను పోటీ చేస్తానని, జమ్మలమడుగు నుంచి భూపేష్‌ పోటీ చేస్తారని ఇటీవల ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయంపై ఇరుపార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాల్సి ఉంది.

➡️