రేపు రేవంత్‌ ప్రమాణస్వీకారం

– ఎల్‌బి స్టేడియంలో మధ్యాహ్నం 1.04గంటలకు ముహూర్తం

– సోనియా, ఖర్గే, రాహుల్‌, ప్రియాంక, ఎఐసిసి నేతలు హాజరు

– ఎపి సిఎం సహా పలు రాష్ట్రాల సిఎంలకు ఆహ్వానం

– తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక పిలుపు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరోతెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కొడంగల్‌ ఎమ్మెల్యే, సిఎల్‌పి నేత ఎ. రేవంత్‌ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ రెడ్డి చేత రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణం చేయించనున్నారు. ఎల్‌బి స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం, టిపిసిసి పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. రేవంత్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ సిఎంలు, మాజీ సిఎంలు చంద్రబాబు, కెసిఆర్‌, పలువురు జాతీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులకు కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానాలు పంపింది. తొలుత గురువారం ఉదయం 10.27గంటలకు ప్రమాణస్వీకార ముహూర్తం నిర్ణయించినప్పటికీ ఢిల్లీ నుంచి వచ్చే ఆహ్వానితులు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే కాంగ్రెస్‌ అభిమానులు, నాయకులను దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నానికి మార్పుచేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆరు గ్యారెంటీల దస్త్రంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతకం చేయనున్నట్లు కాంగ్రెస్‌ శ్రేణులు పేర్కొన్నాయి. టిజెఎస్‌, సిపిఐ, సిపిఎం నాయకులకు, వైఎస్‌ఆర్‌టిపి, టిడిపి నేతలకు ఆహ్వానం పంపారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎల్‌బి స్టేడియంలో ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి రవిగుప్త, జిఎడి, జిహెచ్‌ఎంసి అధికారులు బుధవారం పరిశీలించారు. సిఎల్‌పి నేతగా రేవంత్‌ రెడ్డి పేరును సమర్ధిస్తూ 64మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌కు అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సిఎల్‌పి నేత రేవంత్‌రెడ్డికి గవర్నర్‌ ఆహ్వానం పంపారు.

➡️