చంద్రబాబు హామీలు అమలు కాలేదు

Jan 3,2024 21:45 #ap cm jagan, #speech
  • పవన్‌తో కలిసి కొత్త హామీలతో మళ్లీ ముందుకొస్తున్నారు
  • పింఛన్ల పెంపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌
  • రాష్ట్రంలో 66.34 లక్షల మందికి పింఛన్లు

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి: చంద్రబాబు అవినీతిలో దత్తపుత్రుడూ భాగస్వామేనని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ పెంపు కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా ఆర్‌ఎంసి మైదానంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ రూ.3 వేలకు పెంచామని, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 66.34 లక్షల మంది లబ్ధిదారులకు పింఛను ఇస్తున్నామని తెలిపారు. ఇందుకోసం నెలకు దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఒకటో తేదీ నాడే వలంటీర్లు తలుపు తట్టి పింఛను డబ్బులు అందిస్తున్నారని తెలిపారు. వైసిపి అధికారంలోకి రాకముందు చంద్రబాబు పాలనలో ఎన్నికలు రెండు నెలలకు ముందు కూడా పింఛను రూ.1000 మాత్రమే ఇచ్చారన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు పింఛనును రూ.2 వేలు చేశారని వివరించారు. ఎన్నికలు రాకపోతే అది కూడా పెంచేవారు కాదన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్కొక్కరికీ పింఛను రూ.58 వేలు ఇస్తే, ఈ నాలుగున్నరేళ్ల పాలనలో తమ ప్రభుత్వం రూ.1.47 లక్షలు ఇచ్చిందన్నారు. వికలాంగులకు రూ.1.82 లక్షలు ఇచ్చామని తెలిపారు. గతానికి, ఇప్పటికి మధ్య తేడా గమనించాలని కోరారు. గతంలో పింఛను కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని ఆరోపించారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు, పవన్‌లపై విమర్శలుప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని చంద్రబాబు దత్తపుత్రుడు చెప్తున్నాడని, అడ్డగోలుగా ప్రజలను చంద్రబాబు మోసగిస్తే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. దీనిపై కేంద్రానికి లేఖ కూడా రాయలేదని పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలను ఆదుకుంటే, ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరుగుతుందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆ దత్తపుత్రుడు నేడు కేంద్రానికి లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అవినీతిలో దత్తపుత్రుడు కూడా భాగస్వామేనని, అందుకే ప్రశ్నించబోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించారని, న్యాయస్థానం ఆయనను జైలుకు పంపిందన్నారు. జైల్లో ఉన్న చంద్రబాబును దత్తపుత్రుడు పరామర్శించారని ఎద్దేవా చేశారు. అవినీతికి తావులేకుండా పాలన చేస్తోన్న వైసిపి ప్రభుత్వంపై మాత్రం తప్పుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారని, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం లబ్ధిదారులకు వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక మోడల్‌ చెక్కును అందించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన ఆర్‌ఒబిని ప్రారంభించారు. రూ.94 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు.

➡️