ఫిబ్రవరి 8న ఆశావర్కర్ల ‘చలో విజయవాడ’

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … ఫిబ్రవరి 8 న ‘చలో విజయవాడ’ చేపడుతున్నామని ఆశావర్కర్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం బొబ్బిలిలోని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు లంక శాంతమ్మ ప్రకటన చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం, సెలవులు, వేతనంతో కూడిన మేటర్నిటీ లీవులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు, పనిభారం తగ్గించాలని, తదితర డిమాండ్స్‌ తో ఫిబ్రవరి 8న ఆశా వర్కర్లు ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపడుతున్నామని జిల్లా నుంచి వేలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇస్తున్న వేతనం ఏ మూలకి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనిభారం పెరిగిందని, తమకు సంబంధం లేని పనులు ప్రభుత్వం చేయిస్తుందని ఆరోపించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. శంకర్రావు మాట్లాడుతూ … ఆశాలతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని అన్నారు. కనీస వేతనాలు అమలు చేయకుండా రిటైర్‌మెంట్‌ చెల్లించకుండా పని భారాన్ని పెంచడంతో మానసికంగా ఆశా వర్కర్స్‌ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో పేదల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని పక్కనపెట్టి అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు. గర్భిణీ స్త్రీలకు నిరంతరం వైద్య సహాయం చేస్తున్నారనీ.. అలాంటి ఆశా వర్కర్స్‌ కు ఏ హక్కులు లేకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం తక్షణమే జీతాల పెంపు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ మేటర్నిటీ లీవులు ప్రభుత్వ సెలవులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సమ్మెను చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మీసాల లక్ష్మి, కఅష్ణవేణి, ఆశాలు పాల్గొన్నారు.

➡️