జాబ్‌ మోసాలకి పాల్పడుతున్న 100 వెబ్‌సైట్లపై నిషేధం

Dec 6,2023 12:52 #Centre blocks, #job fraud, #websites

న్యూఢిల్లీ  :  మోసపూరిత పెట్టుబడులు, పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతన్న 100 వెబ్‌సైట్‌లపై కేంద్రం నిషేధం విధించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ) సిఫారసు మేరకు ఆ వెబ్‌సైట్లపై చర్యలు తీసుకున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

టాస్క్‌ బేస్డ్‌ లేదా వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడి సంబంధిత ఆర్థిక నేరాలను సులభతరం చేసే ఈ వెబ్‌సైట్లను విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు ఎంహెచ్‌ఎ తెలిపింది. డిజిటల్‌ ప్రకటనలు, చాట్‌ మెసెంజర్స్‌, రెంటెడ్‌ అకౌంట్లను వినియోగించి వీరు తమ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు వెల్లడించింది. ఇలా ఆర్థిక మోసాల నుంచి వచ్చిన నగదును క్రిప్టో కరెన్సీలు, విదేశీ ఎటిఎం కార్డులు, ఇంటర్నేషనల్‌ ఫిన్‌టెక్‌ కంపెనీల సాయంతో మనీలాండరింగ్‌ చేస్తున్నారని గుర్తించినట్లు ఎంహెచ్‌ఎ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ వెబ్‌సైట్‌లు గూగుల్‌, మెటా వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ‘ఇంట్లోనే ఉంటూ సంపాదించడం ఎలా’ వంటి ప్రకటనలతో రిటైర్డ్‌ ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులను టార్గెట్‌ చేస్తున్నట్లు తెలిపింది. యాడ్స్‌ క్లిక్‌ చేయగానే.. వారి ఏజెంట్లు వాట్సప్‌, టెలిగ్రామ్‌ వంటి మాధ్యమాల్లో యూజర్లతో మాట్లాడుతారు. వీడియోలు లైక్‌ చేయడం, సబ్‌స్క్రైబ్‌ చేయడం, రేటింగ్‌ ఇవ్వడం వంటి టాస్క్‌లు చేయాల్సిందిగా బాధితులను ట్రాక్‌ చేస్తారు. మొదట్లో టాస్క్‌ పూర్తి చేసిన తర్వాత కొంత కమిషన్‌ ఇస్తారు. ఆ తర్వాత పెట్టుబడులు పెట్టాలని .. దీంతో మరింత అధిక ఆదాయం పొందవచ్చని ఆశచూపుతారు. దీంతో బాధితులు అధిక మొత్తాన్ని డిపాజిట్‌ చేసినపుడు వారి డిపాజిట్లను నిలిపివేస్తుంటారు. దీంతో తాము మోసపోయామని బాధితులకు తెలుస్తుందని ఎంహెచ్‌ఎ తెలిపింది. అయితే, ఈ వెబ్‌సైట్ల వివరాలను  వెల్లడించలేదు.

➡️