విద్యుత్‌ కష్టాల నుంచి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాలి

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం

ప్రజాశక్తి – అనకాపల్లి విద్యుత్‌ కష్టాల నుంచి స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వం కాపాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సొంత గనులు, రూ.5 వేల కోట్ల వర్కింగ్‌ క్యాపిటల్‌ ఇవ్వకుండా, ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా నిర్లక్ష్య ధోరణితో కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రారంభంలోనే 550 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పారని, దీనిలో ఉత్పత్తి అయిన దానిలో 250 మెగావాట్లు స్టీల్‌ప్లాంట్‌కు సరఫరా చేయగా మిగిలిన 300 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో అందజేసేవారని గుర్తు చేశారు. దానికి కావాల్సిన థర్మల్‌ బగ్గు కోసం ఒడిశాలోని కోలిండియాతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఆ ప్రకారం.. ఏటా సుమారు 17 లక్షల టన్నులు థర్మల్‌ బగ్గును విశాఖ ఉక్కుకు సరఫరా చేయాల్సి ఉందని, కానీ ఇప్పుడలా జరగడంలేదని వెల్లడించారు. దీంతో, ఇపిడిసిఎల్‌పై స్టీల్‌ప్లాంట్‌ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి నెలా రూ.90 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. నేడు రూ.140 కోట్లు వరకూ బకాయి ఉండడంతో ఇపిడిసిఎల్‌ అధికారులు నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రయోజనాల కంటే బిజెపి ప్రయోజనాలకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. గతంలో విశాఖ ఉక్కుకు వచ్చే ఇసుక ర్యాంపులు ఇవ్వకుండా ఆపేశారన్నారు. నేడు విద్యుత్‌ కష్టాలు మొదలైతే విశాఖ ఉక్కు ప్రమాదంలో పడే పరిస్థితికి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఒడిశా నుంచి రావాల్సిన బగ్గును రప్పిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణను ఏనాడూ రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా ఉన్న అమర్‌నాథ్‌ పట్టించుకోలేదని విమర్శించారు. ఒడిశాలోని మహానది నుంచి వచ్చే థర్మల్‌ బగ్గు టన్ను కేవలం రూ.3200కు దొరకుతోందని, అదే అదానీ కంపెనీల నుంచి తీసుకుంటే టన్నుకు రూ.6500 నుంచి రూ.12 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. విశాఖ ఉక్కు ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత భారాన్ని మోసేస్థితిలో లేదన్నారు. విశాఖ ఉక్కును కష్టకాలంలో ఆదుకోవాల్సిందిపోయి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై ఫ్యాక్టరీని మరింత క్షీణ స్థితిలోకి నెట్టేస్తే విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర ద్రోహం చేసినట్లే అవుతుందన్నారు. స్టీల్‌ప్లాంట్‌లోని బిఎఫ్‌-3ని జిందాల్‌ కంపెనీకి అప్పజెప్పిన తరువాత ఉత్పిత్తిపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేసే కుట్రలను సహించేది లేదన్నారు. విద్యుత్‌ కష్టాల నుంచి ఉక్కు పరిశ్రమను కాపాడకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

➡️