కేంద్ర హౌంశాఖ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలి: తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని కేంద్ర హౌంశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయటాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది చరిత్రను వక్రీకరించడమేనని, పైగా ఎన్నికల సందర్భంగా దీన్ని జారీ చేయటం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని, తక్షణమే నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో అణువంత సంబంధం కూడా లేని వారు ఇది విమోచన దినం అంటున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, జమీందారీ వ్యవస్థ నుంచి విముక్తి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సారధ్యంలో సాగిందీ పోరాటం. పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి నాయకులు నడిపిన పోరాటం. ఈ పోరాటం జరుగుతున్న కాలంలో, స్వాతంత్య్ర సమయంలో బ్రిటిష్‌ పాలకులతో జరిగిన ఒప్పందం మేరకు నెహ్రూ-పటేల్‌ ప్రభుత్వం, నరహంతక నిజాం రాజు మిర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో యధాతథ ఒప్పందం చేసుకున్నది. హైదరాబాద్‌ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా గుర్తించింది. సాయుధ రైతాంగ పోరాటాన్ని అణచలేక, నిజాం రాజు చేతులెత్తేసే సమయంలో నెహ్రూ-పటేల్‌ ప్రభుత్వ సైన్యాలు ప్రవేశించాయి.
ఎలాంటి ప్రతిఘటన లేకుండా నిజాం రాజు లొంగిపోయాడు. హైదరాబాద్‌ రాజ్యాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేస్తూ సెప్టెంబర్‌ 17న సంతకం చేసాడు. అందువల్ల ఇండియన్‌ యూనియన్‌లో హైదరాబాద్‌ రాజ్యం విలీనమైన రోజు. మరోవైపు పటేల్‌ సైన్యాలు నరహంతక రజాకార్‌ నాయకుడు కాశిం రజ్వీని అరెస్టు చేసి మరణశిక్ష విధిస్తారని రైతాంగం ఆశించింది. కానీ సకల సౌకర్యాలతో పాకిస్తాన్‌కు పంపించారు. అంతేకాదు, నరహంతక నిజాం రాజు మిర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ను కూడా అరెస్టు చేయలేదు. పైగా పోరాడుతున్న తెలంగాణ నెత్తిన ఆ రాజునే పేరు మార్చి రాజప్రముఖ్‌గా నియమించారు ఆనాటి హౌంమంత్రి సర్దార్‌ పటేల్‌. రాజుతో కుమ్ముక్కైన ఇండియన్‌ యూనియన్‌ సైన్యాలు రైతాంగం మీద హత్యాకాండ అమలుచేసారు. భయంకరమైన అణచివేత సాగించారు. ఈ వాస్తవాల నుంచి కొత్తతరం ప్రజలను పక్కదోవ పట్టిస్తూ, ఆనాటి పోరాటానికి మతం రంగు పులిమే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సీపీఐ(ఎం) కోరుతున్నది.

➡️