రైతుల పట్ల కేంద్రం తీరు అమానవీయం : వామపక్ష నాయకులు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (రాయచోటి-అన్నమయ్య) : గిట్టుబాటు ధర, న్యాయమైన డిమాండ్ల కోసం రైతులు చేస్తున్న పోరాటంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అమానవీయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట నియోజకవర్గ బాధ్యులు పూల భాస్కర్‌ మండిపడ్డారు. రాష్ట్ర కేంద్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యమ బాటలో ఉన్న రైతులకు సంఘీభావం తెలుపుతూ శుక్రవారం జాతీయ రహదారిలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కార్మిక నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్‌, పూల భాస్కర్‌ లు మాట్లాడుతూ … దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో పంజాబ్‌ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 21 సంవత్సరాల యువరైతు శుభకరణ్‌ సింగ్‌ మృతి చెందడం తీవ్ర బాధాకరమన్నారు. మరో రైతు గుండెపోటుతో మృతి చెందడం విచారకరమన్నారు. లక్షలాదిమంది రైతులు పోరుబాటలో ఉన్నా పంటకు మద్దతు ధర చెల్లిస్తామని, కేసులు ఎత్తివేస్తామని హామీలు గుప్పించిన బిజెపి ప్రభుత్వం హామీల అమలును ఉల్లంఘించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం బిజెపి నిరంకుశత్వానికి తార్కాణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతుల న్యాయమైన హామీలు నెరవేర్చేవరకు వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కార్మికులు ప్రసాద్‌, సురేష్‌, లక్ష్మణ్‌, హరి, సుంకన్న, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️