విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం మళ్లీ కపట నాటకం

  • రెండు స్థలాలు సిద్ధంగా ఉన్నా భూ వివాద నెపం
  • పెదవి విప్పని ఎంపిలు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కపట నాటకాలతో పబ్బం గడుపుకుంటోంది. లేని భూ వివాదాన్ని పదేపదే తెరపైకి తెస్తూ ఎడతెగని జాప్యం చేస్తోంది. లోక్‌సభలో గురువారం 2024-25 మధ్యంతర బడ్జెట్‌ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్‌ మాట్లాడుతూ ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు రాష్ట్ర ప్రభుత్వమే స్థలం చూపకుండా మోకాలడ్డుతోంది. వివాదం లేని భూమి ఇస్తే జోన్‌ పనులు ప్రారంభిస్తాం’ అంటూ చెప్పడం చర్చనీయాంశంగామారింది. రైల్వే అధికారులు కూడా మంత్రి ప్రకటన పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఒకటి, రెండు స్థలాలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఒకదానికి డిపిఆర్‌లో కూడా ఆమోదం లభించింది. దీంతో పాటు మడసర్లోవలో కూడా మరో స్థలం ఉంది. వీటిని మంత్రి విస్మరించారు. మరోవైపు పనులు కూడా ప్రారంభిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. నామమాత్రపు సిబ్బందినీ కేటాయించలేదు. సాధారణంగా ఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నా తాత్కాలిక ప్రాతిపదికన కొన్ని ఏర్పాట్లు , కొంత పనులు చేసుకునే విషయం తెలిసిందే! ఈ దిశలో ఒక్క అడుగుకూడా వేయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా అసత్యాలు చెబుతున్నా రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపి కూడా పెదవి విప్పకపోవడం గమనార్హం. రైల్వే వైర్‌లెస్‌ కాలనీలో ప్రత్యామ్నాయ స్థలం 30 ఎకరాలకుపైనే ఉందని, దీనికి డిపిఆర్‌లో కూడా ఆమోదం లభించిందని రైల్వే అధికారులు చెబుతున్నారు . అదే సమయంలో విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు రైల్వే జోన్‌ పనుల ప్రారంభానికి చిహ్నంగా శిలాఫలకం సిద్ధం చేసి, ఆ క్రెడిట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్న బిజెపి నేతల అభ్యంతరాల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో బిజెపి నేతలు కూడబలుక్కుని జోన్‌ పనులు నిలిపివేశారు.

ముడసర్లోవ రైల్వే స్థలంపై వివాదం ఎంత ?

                విశాఖలో బిఆర్‌టిఎస్‌ కోసం రైల్వే నుంచి గతంలో 26 ఎకరాలను జివిఎంసి తీసుకుంది. అందుకు బదులుగా రైల్వేకు ముడసర్లోవ వద్ద సర్వే నెంబరు 57 నుంచి 59 పి, 61పి, 62 పి, 63, 64, 65లో 52 ఎకరాలు కేటాయించింది. 2018లో ఆ స్థలం వద్ద కంచె వేసేందుకు రైల్వే అధికారులు వెళ్లగా ఆ భూముల్లో ఉన్న రైతులు అభ్యం తరపెట్టారు. ఆ సమయంలో సర్వే కూడా రైల్వే చేయగా 27 ఎకరాలు క్లియర్‌గా ఉందని తేలింది. మిగిలిన స్థలం ఆక్ర మణలో ఉన్నట్లు గుర్తించారు. దీనికోసం రైల్వే అధికారులు, జివిఎంసి కలిసి జాయింట్‌ సర్వే చేసేందుకు 2022 నవంబర్‌ 15న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ నుంచి రైల్వే డిఆర్‌ఎం కార్యాలయానికి లేఖ రాశారు. రైల్వేకు అవసరమైన భూమిని తీసుకునేందుకు సర్వేలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దఫదఫాలుగా పిలిచినా రైల్వే అధికారులు హాజరు కాలేదు. మరలా జివిఎంసి కమిషనర్‌ నుంచి 2023 డిసెంబరు 23న కూడా రిమైండర్‌ పంపారు. కానీ, రైల్వే స్పందించలేదు. నిజానికి వైర్‌లెస్‌ కాలనీలో ఐదు ఎకరాల్లో జోన్‌ కార్యాలయ భవనాల నిర్మాణానికి సరిపోతుంది. అయినా, ఇటువైపు రైల్వే శాఖ చూడడం లేదు. జాయింట్‌ సర్వేకు రాకుండా కాలయాపన చేస్తోంది. ఇప్పుడు భూ వివాదం అంటూ నెపం వేయడానికి కేంద్ర మంత్రి ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వాల దొంగాట

                కేంద్రం పితలాటకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదు. రెండూ కలిసే దొంగాట ఆడుతున్నాయంటూ విశాఖ వాసులు పేర్కొంటున్నారు. కేంద్రంలోని బిజెపి సర్కారు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఇస్తున్నట్లు ప్రకటించి ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌ను ఎత్తేసింది. 200 కిలోమీటర్లలోపు విజయవాడ డివిజన్‌ ఉండగా, వాల్తేరు రైల్వే ఎందుకు? అంటూ బిజెపి పెద్దలు వాదించి విజయవాడ డివిజన్లో వాల్తేరు డివిజన్లోని సగభాగాన్ని కలిపించేశారు. మరి విజయవాడకు 40 కిలోమీటర్ల దూరాన్నే గుంటూరు డివిజన్‌ లేదా? రాష్ట్ర ప్రభుత్వం ఈ వాదన కేంద్రం వద్ద చేయడంలేదెందుకు? జోనల్‌ హెడ్‌క్వార్టర్స్‌ వచ్చినంత మాత్రాన డివిజన్‌ ప్రధాన కార్యాలయాన్ని మూసెయ్యాలా?కొల్‌కతాలో రెండు జోనల్‌ హెడ్‌క్వార్టర్లు లేవా? ఒక జోన్‌, ఒక డివిజన్‌ ప్రధాన కార్యాలయం ఒకేచోట ఉంటే తప్పేమిటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రైల్వే జోన్‌ స్థలంపై ఎలాంటి వివాదమూ లేదు : విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున

                   విశాఖపట్నం రైల్వే జోన్‌ స్థలానికి సంబంధించి ముడసర్లోవలో ఎలాంటి వివాదమూ లేదని విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. రైల్వే మంత్రి గురువారం చెప్పిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్‌లో మీడియాతో కలెక్టర్‌ మాట్లాడారు. ‘ముడసర్లోవ సర్వే నెంబర్‌ 26లో సుమారు 52 ఎకరాలను గతంలో రైల్వేతో జివిఎంసి చేసుకున్న ఒప్పందం ప్రకారం సిద్ధం చేశాం. రైల్వే వారిని రావాలని, భూమి తీసుకోవాలని పలుమార్లు కోరినా స్పందన లేదు. వారెప్పుడు వచ్చినా స్థలం ఇస్తాం. ఈ విషయంపై 2023 డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ సిఎస్‌ సమావేశం నిర్వహించి డైరెక్షన్‌ ఇచ్చారు. ల్యాండ్‌ హ్యాండ్‌ ఓవర్‌ చేయాలని జివిఎంసి కమిషనర్‌కి స్వయంగా నేను చెప్పాను. ఆయన కూడా ఈ ఏడాది జనవరి 2న రైల్వేకు లేఖ రాశారు. ట్రెంచింగ్‌ కూడా ఆ భూమిలో క్లియర్‌ చేశాం. భూ వివాదం లేదు’ అని వివరించారు.

➡️