కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య!

Nov 28,2023 10:15 #Sports
  • త్వరలోనే ముంబయి ఇండియన్స్‌ పగ్గాలు
  • అందుకే మళ్లీ పాత ప్రాంఛైజీ గూటికి
  • ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బదిలీ

న్యూ ఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) ఐదుసార్లు చాంపియన్‌. లీగ్‌లో అత్యంత విజయవంతమైన సారథి రోహిత్‌ శర్మ ఆ జట్టు సొంతం. అత్యుత్తమ టీ20 బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, అత్యుత్తమ టీ20 బౌలర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా సహా ప్రపంచ శ్రేణి బ్యాటింగ్‌ లైనప్‌, ఆల్‌రౌండర్లు, బౌలింగ్‌ బృందం ముంబయి ఇండియన్స్‌ శిబిరంలో ఉన్నారు. బ్యాట్‌తో, బంతితో పాటు నాయకత్వం అంశంలోనూ ముంబయి ఇండియన్స్‌కు ఎటువంటి సమస్య లేదు. అయినా, రూ. 15 కోట్లు వార్షిక వేతనంతో పాటు రూ.15-20 కోట్ల వరకు బదిలీ ఫీజు చెల్లించి మరీ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను ముంబయి ఇండియన్స్‌ తిరిగి తెచ్చుకుంది. అందుకు కనిపిస్తున్న ఏకైక కారణం, రోహిత్‌ శర్మ నాయకత్వ వారసుడి అన్వేషణ. ముంబయి ఇండియన్స్‌ ప్రాంఛైజీ సన్నిహిత వర్గాలు సైతం ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి. హార్దిక్‌ పాండ్యను ఆహ్వానిస్తూ ముంబయి ఇండియన్స్‌ యాజమానులు నీతా అంబాని, ఆకాశ్‌ అంబాని సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు పెట్టారు.

రోహిత్‌ వారసుడిగా : భారత క్రికెట్‌ జట్టు పగ్గాలను విరాట్‌ కోహ్లి త్యజించిన తర్వాత.. వైట్‌ బాల్‌ ఫార్మాట్‌లో ఇద్దరు కెప్టెన్లు వచ్చారు. వన్డేలకు రోహిత్‌ శర్మ, టీ20లకు హార్దిక్‌ పాండ్య రెగ్యులర్‌గా నాయకత్వం వహిస్తున్నారు. ఐపిఎల్‌ 2022, 2023 సీజన్లలో గుజరాత్‌ టైటాన్స్‌ నాయకుడిగా అద్భుత ఫలితాలు సాధించిన హార్దిక్‌ పాండ్య.. జాతీయ జట్టు నాయకుడిగా ప్రమోషన్‌ దక్కించుకున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌ నాయకుడిగా ఎం.ఎస్‌ ధోని నుంచి పగ్గాలు అందుకున్న రవీంద్ర జడేజా సైతం జాతీయ జట్టు నాయకత్వ రేసులో నిలిచాడు. కానీ సూపర్‌కింగ్స్‌ను నడిపించటంలో వైఫల్యం అతడిని నాయకత్వ గ్రూప్‌కు దూరం చేసింది. ఓవరాల్‌ కెరీర్‌లో ఏ స్థాయి క్రికెట్‌లోనూ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టని హార్దిక్‌ పాండ్య ఏకంగా ఐపీఎల్‌లో అరంగేట్ర ప్రాంఛైజీకి సారథ్యం వహించాడు. తొలి సీజన్‌లోనే టైటిల్‌ అందించాడు. రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలబెట్టాడు. టైటాన్స్‌ ఆడిన రెండు సీజన్లలో గ్రూప్‌ దశలో అగ్రస్థానంలోనే నిలిచింది. టైటాన్స్‌ సారథిగా ట్రాక్‌ రికార్డు హార్దిక్‌ పాండ్యకు భారత జట్టు కెప్టెన్సీ తెచ్చిపెట్టింది. ఇక ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వచ్చే సీజన్‌ నాటికి 37 వసంతాలు పూర్తి కానున్నాయి. అతి త్వరలోనే ముంబయి ఇండియన్స్‌ నాయకుడి అన్వేషణ మొదలుపెట్టాలి. ఐపీఎల్‌ ఆరంభంలో ఎంతో మంది కెప్టెన్లను ప్రయోగించిన ముంబయి ఇండియన్స్‌ విజయవంతం కాలేదు.

రోహిత్‌ శర్మ తర్వాత అదే పరిస్థితి తలెత్తితే ముంబయి ఇండియన్స్‌ మళ్లీ సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. దీంతో ప్రాంఛైజీ యాజమాన్యం హార్దిక్‌ పాండ్యపై కన్నేసింది. 2015 నుంచి ముంబయి ఇండియన్స్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉన్న హార్దిక్‌ పాండ్య.. రోహిత్‌ శర్మ తర్వాత జట్టును నడిపేందుకు సమర్థ నాయకుడని విశ్వసించింది. ఈ సీజన్లో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా కొనసాగినా.. 2025 నుంచైనా పాండ్యకు పగ్గాలు అప్పగించనున్నారు. లేదంటే, రోహిత్‌ ఉండగానే హార్దిక్‌ పాండ్యకు నేరుగా పగ్గాలు అప్పగించినా అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. 30 ఏండ్ల హార్దిక్‌ పాండ్య దీర్ఘకాలం ముంబయి ఇండియన్స్‌ను ముందుండి నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్‌ గట్టిగా నమ్ముతోంది. ఇక, గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున హార్దిక్‌ పాండ్య ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. రెండు సీజన్లలో కలిపి 30 ఇన్నింగ్స్‌ల్లో 833 పరుగులు చేశాడు. సగటు 41.65 కాగా, స్ట్రయిక్‌రేట్‌ 13.49. బంతితోనూ 8.1 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. 2015లో ముంబయి ఇండియన్స్‌ రూ.10 లక్షల కనీస ధరకు హార్దిక్‌ పాండ్యను తొలిసారి ఎంచుకుంది. 2015, 2017, 2019, 2020 సీజన్లలో ఐపీఎల్‌ విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్‌లో హార్దిక్‌ పాండ్య కీలక సభ్యుడు.

➡️