క్యాన్సర్‌ను జయిద్దాం..!

Feb 4,2024 09:56 #Cancer, #Health Awareness, #Sneha
cancer disease awareness causes precautionscancer disease awareness causes precautions

క్యాన్సర్‌.. క్యాన్సర్‌.. క్యాన్సర్‌.. ఇప్పుడు ఎవరి నోటనైనా.. ఎవరు చనిపోయినా.. ఎక్కువగా వినపడే రోగం క్యాన్సరే..! శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన నేటి డిజిటల్‌ యుగంలోనూ క్యాన్సర్‌ పేరు చెబితే భయపడుతుండటం సహజమే. కానీ భయపడాల్సిన అవసరం లేదు.. దీన్ని అందరం కలిసి జయిద్దాం అంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడు క్యాన్సర్‌ చికిత్సల్లో అనేక అధునాతన పద్ధతులు వచ్చాయి. టీకాలు, చికిత్సలతో సులభంగా తగ్గించుకుని, సాధారణ వ్యక్తుల్లాగే జీవితాలను గడుపుతున్నవారూ మన చుట్టూనే ఉన్నారు. ఏదేమైనా క్యాన్సర్‌ ప్రారంభదశలో గుర్తిస్తే, సులభంగా నయం చేయటమే కాకుండా, తిరిగి రాకుండా నియంత్రణ చేసే అధునాతనమైన చికిత్సా పద్ధతులు నేడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. అందుకే ఎలాంటి భయాలు వద్దంటున్నారు వైద్యులు. ఈ నెల 4వ తేదీన అంతర్జాతీయ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

నేడు మనిషి జీవనశైలిలో వచ్చిన మార్పులు, వాతావరణ కాలుష్యం తదితర అంశాలు క్యాన్సర్‌ ప్రబలడానికి కారణం అవుతున్నాయి. అలా అని భయపడిపోతే సమస్య పరిష్కారం కాదు. అనేక అధునాతన సాంకేతికత అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఇప్పుడు క్యాన్సర్‌కు భయపడాల్సిన పనిలేదు. దాన్ని జయించడం మనందరి చేతుల్లోనే ఉందనేది నిపుణులు చెప్తున్న మాట.

ప్రపంచవ్యాప్తంగా 2023లో సుమారు కోటి మంది క్యాన్సర్‌ బారిన పడి మరణించారు. అంటే రోజుకి 25 వేల మంది వరకూ ప్రాణాలను కోల్పోతున్నారు. మనదేశానికి సంబంధించి నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రకారం 2022లో 14 లక్షల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. అంటే సరాసరిన ప్రతి తొమ్మిది మందిలో ఒక్కరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. 2025 కల్లా మనకి ఈ క్యాన్సర్‌ అనేది సగటున 12 శాతం పెరిగే అవకాశం కనబడుతోంది. పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సరు, స్త్రీలలో ముఖ్యంగా బ్రెస్ట్‌ క్యాన్సరు, చిన్న పిల్లల్లో బ్లడ్‌ క్యాన్సర్‌ (ల్యుకేమియా) అనే రకాల వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. అసలు ఈ క్యాన్సర్‌ ఎందుకు వస్తుంది.. అనేది మనం ఆలోచిస్తే మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు ప్రధాన కారణం. ముఖ్యంగా శారీరక శ్రమ తగ్గడం వల్లే వస్తుంది.

పెరుగుతున్న మరణాలు

క్యాన్సర్‌ అనేది ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పదేళ్ల కిందటి వరకు గుండె సంబంధిత మరణాలు ఎక్కువగా సంభవించేవి. కానీ ప్రస్తుతం క్యాన్సర్‌ వల్ల ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. మన ఇంట్లో, చుట్టుపక్కల, మన స్నేహితులు, బంధువుల్లో గానీ ఈ వ్యాధి బారినపడుతున్న వాళ్లు కచ్చితంగా ఎవరో ఒకరు ఉంటున్నారు. ఈ వ్యాధి, దానికి వైద్య చికిత్సలు మన జీవితంలో నిత్యకృత్యం అయిపోయాయి. క్యాన్సర్‌ చికిత్స తీసుకున్న తర్వాత కొంతమందికి పూర్తిగా తగ్గుతుంది. మరికొంతమందికి తగ్గినా వాళ్ళ జీవితం మునుపటిలా కొనసాగకపోవచ్చు. మరికొంత మందికి ఎంత ట్రీట్మెంట్‌ తీసుకున్నా, ఎంత ఖర్చు పెట్టినా క్యాన్సర్‌ తగ్గకపోవచ్చు. అయితే ఇటీవల వచ్చిన ఆధునిక చికిత్సా పద్ధతుల్లో క్యాన్సర్‌ను జయించడం వీలవుతుంది.

ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే తగ్గుముఖం

మనం ఈ క్యాన్సర్‌ని ముందుగా తెలుసుకోలేమా? తగ్గించలేమా? ఇలాంటి ప్రశ్నలు మనలో చాలామందికి వచ్చే అనుమానాలు. ఒకసారి క్యాన్సర్‌ వస్తే ఇంక దానికి బలి అవడమేనా? పూర్తిగా దాన్ని జయించి, మన సాధారణ స్థితికి రాలేమా? అనేది అందరిలో ఉండే అతిపెద్ద అనుమానం. క్యాన్సర్‌ చికిత్సలో అతి ముఖ్యమైనది ఏమిటంటే క్యాన్సర్‌ని మనం ఎంత ముందుగా గుర్తిస్తే అంత తక్కువ ఇబ్బందులతో, తక్కువ ఖర్చుతో ఎక్కువ శాతం విజయం సాధించొచ్చు.

స్క్రీనింగ్‌ : మనం ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్‌ పద్ధతుల ద్వారా క్యాన్సర్‌ను ముందే గుర్తించొచ్చు. దానివల్ల చాలా వరకూ ఈ క్యాన్సర్లని ప్రాథమిక దశలో గుర్తించి, పూర్తిగా నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్‌కు సంబంధించి స్క్రీనింగ్‌ ఒక ముఖ్యమైన ప్రక్రియ. జబ్బు లక్షణాలు కనబడకుండానే ఆ జబ్బు మనలో వ్యాపించిందా అనేది ముందుగానే గుర్తించే విధానాన్నే స్క్రీనింగ్‌ అంటారు. లక్షణాలు కనబడిన తర్వాత అవసరమైన పరీక్షలు చేయటం ద్వారా జబ్బును కనుక్కునే పద్ధతిని వ్యాధి నిర్ధారణ అంటారు. స్క్రీనింగ్‌ పద్ధతుల్లో క్యాన్సర్‌ను కనుగొన్నట్లయితే రోగులకు చికిత్సకు పెద్ద ఇబ్బందులు రాకుండా చాలా తక్కువ ఖర్చుతో పూర్తిగా నయం చేయటానికి అవకాశం ఉంటుంది. అలాకాకుండా జబ్బు లక్షణాలు కన్పించిన తర్వాత డాక్టర్‌ను కలిసి వ్యాధి నిర్ధారణ చేయించుకుంటే అప్పుడు చేసే చికిత్సల వల్ల ముదిరిపోతుంది. పూర్తిగా నయం చేయటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దానికి తోడు చికిత్స ఖర్చు తర్వాత వచ్చే దుష్పభ్రావాల నుంచి భయటపడటం పేషెంటుకు కష్టసాధ్యమవుతుంది.

మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు..

మనం ఏ క్యాన్సర్లను ముందుగా గుర్తించొచ్చు అనేది ఒకసారి చూస్తే.. మొదటగా స్త్రీలలో రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌.. ఈ రెండూ చాలా ఎక్కువగా కనబడతాయి.రొమ్ము క్యాన్సర్‌ని సంవత్సరానికి ఒకసారి మామోగ్రామ్‌ పరీక్ష ద్వారా చాలా ప్రాథమిక దశలో గుర్తించొచ్చు. అదేవిధంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని పాప్‌ స్మియర్‌ అనే చిన్న పరీక్ష ద్వారా మూడేళ్లకు ఒకసారి చేయించు కుంటే చాలా ప్రాథమికదశలోనే గుర్తించొచ్చు.

cancer disease awareness causes precautionscancer disease awareness causes precautions

ఊపిరితిత్తుల క్యాన్సర్‌..

ఇది చాలా ప్రమాదకరంగా కనబడుతున్న క్యాన్సర్‌. జీవన విధానం, కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ అనేది అనేక రెట్లు పెరిగింది. ఈ క్యాన్సర్‌ని ముఖ్యంగా పొగతాగే వాళ్లలో సంవత్సరానికి ఒకసారి ఒక ఛాతీ ఎక్స్‌రే / సిటీ స్కానింగ్‌ చేయించుకోవడం ద్వారా ప్రాథమిక దశలో గుర్తించొచ్చు. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం, మాంసాహారం ఎక్కువ తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్లు అనేవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ క్యాన్సర్‌ని కూడా ఒక చిన్న మల పరీక్ష ద్వారా ముందుగానే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఎస్‌ఒబిటి (SOBT) అనే పరీక్ష ద్వారా సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే లేదా కొలనోస్కోపీ (COLONOSCOPY) ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయించుకున్నా ఈ పెద్ద పేగు క్యాన్సర్‌ని ముందుగానే గుర్తించొచ్చు.

cancer disease awareness causes precautionscancer disease awareness causes precautions

మద్య, ధూమపానాలే..

వంద మంది క్యాన్సర్‌ పేషెంట్లను పరీక్షిస్తే.. అందులో మద్యపానం, ధూమపానం వల్ల వచ్చే క్యాన్సర్లు 35 శాతం. మనకున్న ఆహారపు అలవాట్లతో గానీ, జీవనశైలితో గానీ వచ్చే క్యాన్సర్లు 30 శాతం. జన్యు లోపంతోనో, వేరే ఇతరత్రా కారణాలతోనో వచ్చే క్యాన్సర్‌ పేషంట్లు మూడో భాగంగా ఉంటున్నారు. ఈ మూడో భాగం కారణాలు మనం పెద్దగా మార్చలేకపోవచ్చు. మూడింట రెండొంతుల కారణాలు మటుకు మనం నివారించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.పొగాకు వాడకంతో 60 శాతం..పొగాకు వాడకం ఏ రూపంలోనైనా సరే.. వాటి ఉత్పత్తుల వాడకం చాలా ప్రమాదకరమైంది. ఈ పొగాకు వల్ల నోటి క్యాన్సర్‌ దగ్గర నుంచి గొంతు క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, అన్నవాహిక క్యాన్సర్‌, జీర్ణాశయ క్యాన్సర్‌, పెద్ద పేగు క్యాన్సర్‌, ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌, మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఇలా చాలా రకాల క్యాన్సర్లకు అతి ముఖ్యమైన కారణం పొగాకు ఉత్పత్తులే. ఇలాంటి అనారోగ్యమైన కారకాలను తగ్గించుకోగలిగితే 60 శాతం వరకు క్యాన్సర్‌ కారకాలను నియంత్రించుకోవచ్చు. మరో 30 శాతం క్యాన్సర్లు వయసు వల్ల కూడా వస్తుంటాయి. కుటుంబంలో ఎవరికైనా కొన్ని రకాల క్యాన్సర్స్‌ వస్తూంటాయి. ఇలాంటి కుటుంబాల్లో జన్యుపరమైన కారణాలతో క్యానర్‌ వచ్చే అవకాశాలున్నాయి. వాటిని ఫెమిలియల్‌ (familia) లేదా జనెటిక్‌ (genetic) ప్రేరేపిత క్యాన్సర్స్‌ అంటారు.

పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌

అరవై ఏళ్లు దాటిన పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ అనేది చాలా సాధారణంగా కనబడుతుంది. ఒక చిన్న రక్తపరీక్షతో చాలా ప్రాథమిక దశలోనే గుర్తించడానికి వీలుంటుంది.

నోటి క్యాన్సర్‌..

నోటి క్యాన్సర్‌ని మనం చాలా సులభతరంగా గుర్తించొచ్చు. పొద్దున్నే బ్రష్‌ చేసుకునే సమయంలో ఒకసారి నోరుని పూర్తిగా తెరిచి, వెలుగు బాగా పడే ప్రదేశంలో నిలబడి నోటి లోపల భాగాలని మనకు మనంగా పరీక్ష చేసుకోవచ్చు. ఏదైనా పుండు గానీ ఎర్రటి / తెల్లటి మచ్చలు గానీ ఉంటే డాక్టర్‌ దగ్గరికి వెళ్లాలి. అందుకు సంబంధించిన మరికొన్ని పరీక్షలు చేసి, నోటి క్యాన్సర్‌ని ప్రాథమిక దశలో గుర్తించే అవకాశం ఉంది.

ఈ పైన చెప్పిన ఈ ఆరు క్యాన్సర్లు మన సమాజంలో చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. వీటిని చాలా చిన్న చిన్న పద్ధతుల ద్వారా మనం ముందుగా గుర్తించొచ్చు. తద్వారా పూర్తిగా నయంచేసుకోవచ్చు.

క్యాన్సర్‌ కారకాల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పొగాకు వాడకం. అది ఏ రూపంలో వాడకమైనా ప్రమాదకరమే. పొగాకు వల్ల నోటి క్యాన్సర్‌, గొంతు, ఊపిరితితులు, అన్నవాహిక, జీర్ణాశయ క్యాన్సర్‌, పెద్ద పేగు క్యాన్సర్‌, ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌, మూత్రాశయ క్యాన్సర్‌తోపాటు ఆడవాళ్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఇలా చాలా రకాల క్యాన్సర్లకు అతిముఖ్యమైన కారణం పొగాకు. ధూమపానం, మద్యపానం, పరిమితికి మించి మాంసాహారం తీసుకోవటం, అనారోగ్యకరమైన జీవన విధానం వంటి కారకాలను తగ్గించుకోగలిగితే 60 శాతం వరకూ క్యాన్సర్‌ రాకుండా నియంత్రించుకోవచ్చు. ఒక 30 శాతం క్యాన్సర్లు వయస్సు, ఇతర జన్యుపరమైన కారణాల వల్ల లేదా మరే ఇతర కారణాలతోనైనా రావొచ్చు.

ఏడు హెచ్చరికలు..

  • 1. శరీరంలో ఎక్కడైనా పుండు ఏర్పడి, అది తగ్గక పోవడం. పుట్టుమచ్చలు రంగు మారడం, పరిమాణంలో మార్పులు.
  • 2. మల, మూత్ర సమయాల్లో మార్పులు.
  • 3. మింగడం కష్టంగా అనిపించడం. అరుగుదల సరిగ్గా లేకపోవడం.
  • 4. మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం, తెలుపు కావడం.
  • 5 శరీరంలో ఏ భాగంలోనైనా వాపు గానీ, గడ్డలు గానీ ముఖ్యంగా మహిళల్లో రొమ్ముల్లో గడ్డలు.
  • 6. అలసటగా అనిపించడం, బరువు తగ్గటం.
  • 7. గొంతు బొంగురు పోవడం, రక్తహీనత, ఎడ తెగని దగ్గు.

పైన చెప్పిన ఈ లక్షణాలన్నీ క్యాన్సర్‌ కావచ్చు. వాటిని అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ దగ్గరికి వెళ్లాలి. అక్కడ పరీక్ష చేయించుకుంటే నిర్ధారణలు చేసి, తగిన చికిత్స తీసుకోవాల్సి వస్తుంది.

ట్రీట్మెంట్‌ : క్యాన్సర్‌ ట్రీట్మెంట్‌ ముఖ్యంగా మూడు పద్ధతుల్లో జరుగుతుంది.

  1. మందుల ద్వారా నయం చేయటం.

2. ఆపరేషన్‌

3. రేడియేషన్‌ఒకేరకమైన చికిత్స ఉండదు..

అన్ని క్యాన్సర్లకు ఒకే రకమైన ట్రీట్మెంట్‌ ఉండదు. రకాన్ని బట్టి, పేషంట్‌ శారీరక స్థితిగతుల బట్టి, అవయవాల తీరును బట్టి క్యాన్సర్‌ దశను బట్టి చికిత్స అనేది మారుతూ ఉంటుంది. కొన్ని క్యాన్సర్లకి కీమోథెరపీ అనేది ముఖ్యమైన చికిత్స. మరికొన్ని కేసులకు సర్జరీ ముఖ్యమైన చికిత్స. ఇంకొన్నింటికి రెడీయేషన్‌ అనేది ముఖ్యమైన చికిత్స అవుతుంది. చాలామంది రోగుల్లో ఈ మూడు పద్ధతులు కలిపి చేయాల్సి ఉంటుంది. మూడింట రెండొంతుల రోగుల్లో ఏదో ఒక రెండు పద్ధతుల ద్వారా చేయాల్సి ఉంటుంది. మూడింట ఒక వంతులో ఏదో ఒక పద్ధతి ద్వారా మాత్రమే చికిత్స చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు సర్జరీ తర్వాత కీమోథెరపీ ఇవ్వాల్సి రావొచ్చు. రేడియేషన్‌ చేయాల్సి రావొచ్చు. రెండూ కలిపిన చికిత్స చేయాల్సి రావొచ్చు. కొంతమంది రోగులకు అసలు సర్జరీయే లేకుండా రేడియేషన్‌ చికిత్స, కీమోథెరపీ కలిపి చేయాల్సి వస్తుంది. మరికొంత మందికి మూడు పద్ధతుల్లో కలిపి చేయాల్సి రావొచ్చు. అది క్యాన్సర్‌ దశను బట్టి, ముఖ్యంగా రోగి యొక్క శారీరక స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది.

పూర్తిగా నయం చేయొచ్చు..

ప్రస్తుతం మనకు అందుబాటులో ఆధునిక వైద్య పద్ధతుల ద్వారా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయొచ్చు. అతి తక్కువ దుష్ప్రభావాలతో చికిత్స చేయడం అనేది ఇప్పుడు చాలా సులభంగా మారింది.

రోబోటిక్‌ పద్ధతుల్లో..

రోబోటిక్‌ పద్ధతుల్లో ఆపరేషన్‌ చేయడం, టార్గెట్‌ థెరపీ, ఇమ్యూన్‌ థెరపీ పద్ధతుల ద్వారా మందులతో చికిత్స చేస్తారు. రేడియేషన్‌కి వచ్చేటప్పటికి అత్యంత అధునాతన పద్ధతులైన రేడియో సర్జరీ, విమాట్‌ (VMAT), ఇమేజ్‌ గైడింగ్‌ రేడియో థెరపీ (IGRT) పద్ధతుల ద్వారా చాలా తక్కువ దుష్ప్రభావాలతో చికిత్సను పూర్తిచేయొచ్చు. క్యాన్సర్‌ ఆనవాళ్లనేవే లేకుండా రోగులకు చికిత్స పూర్తిచేయడం మనకి ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో సులభ సాధ్యమవుతుంది.

cancer disease awareness causes precautionscancer disease awareness causes precautions

ఐదేళ్లు జాగ్రత్త పడాలి..!

చికిత్స పూర్తయిన తర్వాత పేషంటు డాక్టర్‌ చెప్పిన విధంగా ఒక ఐదు సంవత్సరాలపాటు ఫాలో పీరియడ్‌ అనేది కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ పూర్తిగా నయమైందని చెప్పాలంటే చికిత్స జరిగిన ఐదేళ్లలోపు జబ్బు తిరగబెట్టకుండా ఉంటేనే అది పూర్తిగా నయమైనట్లు. క్యాన్సర్‌ తిరగబెట్టడానికి మొదటి రెండేళ్లల్లోనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మొదటి రెండు సంవత్సరాలు ప్రతి రెండు నెలలకు ఒకసారి, మూడో సంవత్సరం నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి, నాలుగో సంవత్సరం నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి, ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకొని, క్యాన్సర్‌ మళ్లీ తిరగబడుతుందా? లేదా? అన్నది మనం పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఐదు సంవత్సరాల్లో క్యాన్సర్‌ ఎప్పుడైనా తిరగబెట్టొచ్చు. క్యాన్సర్‌ తిరగబడుతుంది అనేది మనం ముందుగానే గుర్తించగలిగితే, మనం మళ్ళీ పూర్తిగా నయం చేయడానికి ఇంకొక అవకాశం లభించినట్లే. పేషెంట్‌కు ఉన్న ఇబ్బందులను బట్టి, నిర్దేశిత సమయాన్ని బట్టి ఈ ఫాలో అప్డేట్‌లో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది.

వ్యాక్సిన్లు : క్యాన్సర్‌కు సంబంధించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం హెచ్‌పివి (HPV) వ్యాక్సిన్‌..

ఈ హ్యూమన్‌ పామిలోమా వైరస్‌ అనేది ముఖ్యంగా ఆడవాళ్లలో గర్భాశయం ద్వారా క్యాన్సర్‌, టాన్సిల్‌ క్యాన్సర్‌, గొంతు క్యాన్సర్‌లకు కారణమవుతుంది. క్యాన్సర్లే కాకుండా మిగతా సెక్సువల్లిట్రాన్స్మిటెడ్‌ డిసీజెస్‌ వంటివి కొన్ని రకాల జబ్బులు కూడా ఈ వైరస్‌ వల్ల కనబడుతున్నాయి. ఈ వైరస్‌ వల్ల పిల్లలకు భవిష్యత్తులో క్యాన్సర్‌ను రాకుండా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. 9 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఒక రెండుడోసులు క్రమం తప్పకుండా వ్యాక్సిన్‌ షెడ్యూల్‌ను బట్టి 15 ఏళ్లు పైబడిన పిల్లల్లో ఒక మూడు డోసులు డాక్టరు సలహామేరకు ఇస్తే మనం ఈ పామిలోమా వైరస్‌ వల్ల వచ్చే క్యాన్సర్‌ను సుమారుగా 80 శాతం వరకూ నివారించొచ్చు. వివరాల కోసం గైనకాలజిస్ట్‌ లేదా అంకాలజిస్ట్‌లను సంప్రదించాలి. తొమ్మిదేళ్ల వయస్సు దాటిన బాలబాలికలకు ఈ హెచ్‌పివి వ్యాక్సిన్‌ను వేయించటం చాలా మంచిది. వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్లవుతుంది.

వైద్యరంగంలో పరిశోధనలు

వైద్య రంగంలో క్యాన్సర్‌కు సంబంధించి ఎప్పుడూ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మందులకు సంబంధించి ఎన్ని కొత్త ఔషధాలు మనకి అందుబాటులోకి వచ్చినా.. అలాగే సర్జరీ, రేడియేషన్‌ విభాగాల్లో సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. ఇవేవీ క్యాన్సర్‌ని ప్రాథమిక దశలో గుర్తించడం కన్నా ఎక్కువగా ఉపయోగపడలేవు. అన్నిటికన్నా ముఖ్యం క్యాన్సర్‌ని ప్రాథమిక దశలో గుర్తించడమే. అప్పుడు క్యాన్సర్‌ని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలం. తద్వారా పూర్తిగా నయం చేయడానికి మనకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్‌ లక్షణాలు కనబడక ముందే ప్రాథమికంగా గుర్తిస్తే (స్క్రీనింగ్‌ పద్ధతులు ద్వారా).. నయం చేయడం సులభమవుతుంది.

ఏటేటా పరీక్షలు మేలు..

పొగాకు, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండటం, మద్యపానానికి దూరంగా ఉండటం, శారీరక శ్రమ, మంచి ఆహారం తీసుకోవడం మాంసాహారానికి దూరంగా ఉండడం, ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒకసారి పరీక్షించుకుంటూ ఉండటం ఇవన్నీ క్యాన్సర్‌ని దూరం చేస్తాయి. ఇలాంటి మంచి లక్షణాల్ని మన దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని, పూర్తి ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్య భారతాన్ని నిర్మించవచ్చు.

క్యాన్సర్‌ కారకాల నుంచి దూరంగా ఉందాం.. ఆరోగ్యంగా ఉందాం.. క్షేమంగా ఉందాం.. సంతోషంగా ఉందాం.. క్యాన్సర్‌ను సమూలంగా నిర్మూలిద్దాం..

 

డాక్టర్‌ రామకృష్ణ వంగర, ఎంబిబిఎస్‌, డిఎన్‌బిక్యాన్సర్‌ వైద్యనిపుణులు (రేడియేషన్‌),

మణిపాల్‌ ఆసుపత్రి, తాడేపల్లి, గుంటూరు జిల్లా, సెల్‌ : 9885943446

 

ప్రాథమికస్థాయిలో గుర్తింపు…

క్యాన్సర్‌కు ముగింపు

క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తించగలిగితే..అంత త్వరగా నయం చేయొచ్చు (ఎర్లీ డయాగ్నిసిస్‌ కెన్‌ క్యూర్‌ ది క్యాన్సర్‌). మనిషి తల నుంచి గోటి వరకూ మానవ శరీరంలోని అన్ని కణాలు, ఆఖరుకు రక్తంతో సహా అన్ని అవయవాలకు క్యాన్సర్‌ రావొచ్చు. రొమ్ము క్యాన్సర్‌.. నోటి క్యాన్సర్‌.. కంటి క్యాన్సర్‌.. కాలేయ క్యాన్సర్‌.. కడుపు క్యాన్సర్‌.. చర్మ క్యాన్సర్‌.. బ్లడ్‌ క్యాన్సర్‌.. అన్నవాహిక క్యాన్సర్‌.. అండాశయ క్యాన్సర్‌ ఇలా చెప్పుకుంటే పోతే అనేక రకాలుగా క్యాన్సర్లను చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి అవయవానికి క్యాన్సర్‌ రావొచ్చు. మానవ శరీరం లక్షల కోట్ల కణాలు (సెల్స్‌) తో నిర్మితమైనది. శరీరంలో పెరుగుతున్న కణాలు నియంత్రణ కోల్పోయి, ఇష్టానుసారంగా ఒక గుంపు మాదిరి, ఒకే దగ్గర పెరగటమే క్యాన్సర్‌గా పిలుస్తారు. ఇది ఒక కణజాలాల సమూహంగా అని చెప్పొచ్చు. ఇలా కొత్త సెల్స్‌ తయారై ఒక గుంపుగా మారతాయి. వీటిని ట్యూమర్‌ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మాలిగెంట్‌ ట్యూమర్‌, మరోటి బినైన్‌ ట్యూమర్‌. మొదటిది చాలా ప్రమాదకరం. ఇది పెరుగుతూ శరీరంలో వ్యాపించి, ఇతర కణాలకు కూడా క్యాన్సర్‌ను విస్తరింపజేస్తాయి. బినైన్‌ ట్యూమర్‌, మాలిగెంట్‌లా పక్క టిష్యూస్‌పై దాడి చేయదు. కేవలం ఉన్న చోట మాత్రమే పెద్దవిగా మారతాయి. వేరే చోటకు స్ప్రెడ్‌ కావు. వీటిని ఆపరేషన్‌ చేసి తీసివేస్తే మళ్లీ పెరగవు. కానీ మాలిగెంట్‌ ట్యూమర్‌ మళ్లీ పెరిగే అవకాశం ఉంది.

క్యాన్సర్‌ వ్యాప్తి చెందుతుందంటే…

  1. ఉన్న చోటే పెరిగిపోవటం: మామూలు కణాలకు అందే ఆహారం, రక్తాన్ని క్యాన్సర్‌ కణాలు తీసుకుని, అమాంతంగా పెరిగిపోతుంటాయి. పెరిగి పక్కనున్న అవయవాలకు అతుక్కుని తినేస్తుంటాయి.
  2. లింపాటిక్‌ స్ప్రెడ్‌ : లింపు ద్వారా కలిసి పక్కనున్న లింపు గ్రంథులకు చేరుతుంది.
  3. రక్తం ద్వారా కలుస్తాయి : క్యాన్సర్‌ కణాలు రక్తనాళాల్లో కలిసి వాటి ద్వారా ఎముకలు, లివర్‌, మెదడు, ఊపిరితిత్తులకు చేరి దూరంగా అవయవాల్లో వ్యాప్తి చెందుతాయి.
  4. ట్రాన్స్‌ సీలోమిక్స్‌ స్ప్రెడ్‌ : దీనిని డ్రాప్‌లెట్స్‌ స్ప్రెడ్‌ అంటారు. దీనిని ఎక్కువగా పొట్ట క్యాన్సర్‌లో చూస్తారు. ఆ తర్వాత పైన చెప్పిన విధంగా కాకుండా పక్కనున్న అవయవాలకు క్యాన్సర్‌ అంటుకోవటం జరుగుతుంది.

చికిత్స ఇలా..

  1. శస్త్ర చికిత్సా విధానం క్యూరేటివ్‌ సర్జరీ : ఈ విధానంలో ఆపరేషన్‌ ద్వారా క్యాన్సర్‌ గడ్డలను పూర్తిగా నిర్మూలించబడుతుంది. రక్తానికి సంబంధించిన క్యాన్సర్‌ మినహా ఏ క్యాన్సర్‌లైనా శస్త్ర చికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చికిత్సలో క్యాన్సర్‌ వచ్చిన భాగంతోపాటు పక్కనున్న సాధారణ కణజాలాన్ని దూరంగా తొలగిస్తారు. ఇలా తొలగించటం వల్ల క్యాన్సర్‌ను నిర్మూలించొచ్చు. కొన్ని సందర్భాల్లో ముందే వచ్చే అవకాశాలను తెలుసుకుని, రాకుండా నివారించటానికి కొన్ని సర్జరీలు చేయాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇతర ఏభాగాలకూ వ్యాపించని దశలో పూర్తిగా నయం చేయొచ్చు. ప్రస్తుతం చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆ రోజే రోగి ఇంటికి వెళ్లేలా ‘డే కేర్‌ ప్రొసిజర్‌’గానూ చేయొచ్చు. క్యాన్సర్‌ వచ్చిన భాగానికి పక్కనున్న లింపు గ్రంథులు, లింపు పిక్కలు పెరుగుతుంటాయి. దాంతో లింపు గ్రంథులను పూర్తిగా తొలగిస్తారు. తద్వారా అవి తిరిగి రాకుండా ఉంటాయి. ప్రివెంటివ్‌ సర్జరీ : పెద్దపేగు చివరిభాగం (కోలన్‌)లో పాలిప్‌ కనిపించినప్పుడు ఎలాంటి క్యాన్సర్‌ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగించొచ్చు. కుటుంబంలో రక్త సంబంధీకులకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్‌సీఏ 1, బీఆర్‌సీఏ 2, ఊపరెక్టమీ వంటి జీన్‌ మ్యుటేషన్‌ పరీక్షలతో క్యాన్సర్‌ ముప్పును ముందే తెలుసుకుని, రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్‌స్మియర్‌ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి, గర్భాశయాన్ని తీసేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల క్యాన్సర్‌ రాకుండా నివారించొచ్చు. పాలియేటివ్‌ సర్జరీ : క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణిత పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించటానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. విపరీతమైన నొప్పి, రక్తస్రావం కారిపోతూ ప్రాణానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఈ సర్జరీ ద్వారా కొంతవరకూ ఇబ్బందులు తగ్గుతాయి.

2. ఇంజక్షన్లు, లేదా టాబ్లెట్లు ఇవ్వటం కీమో థెరపీ : ఇంజక్షన్‌ లేదా టాబ్లెట్‌ రూపంలోగానీ క్యాన్సర్‌ కణాలను చంపటానికి రోగికి ఇచ్చే మందులను కీమోథెరపీ అంటారు. కొన్ని వ్యాధులకు ఆపరేషన్‌ ముందు మందులు ఇస్తారు. మరికొన్ని వ్యాధులకు ఆపరేషన్‌ తర్వాత మందులు ఇస్తారు. అవి రోగికి వ్యాధి తీవ్రతను బట్టి నిర్ధారిస్తారు. దీనివలన క్యాన్సర్‌ సైజు తగ్గుతుంది. అయితే సైడ్‌ఎఫెక్ట్‌లు కూడా ఉంటాయి. కీమోథెరపీ ఉపయోగాల ముందు దుష్ప్రభావాలు తాత్కాలికమే. టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యునోథెరపీ, మెడికల్‌ ట్రీట్‌మెంట్‌లో భాగంగానే చెప్పుకోవచ్చు. ఈ విధానాలతో క్యాన్సర్‌ కణాలను గురిచూసి కొట్టడం ద్వారా తొలగించొచ్చు. తద్వారా క్యాన్సర్‌ను నియంత్రించొచ్చు.

3. కరెంట్‌ పెట్టడం రేడియేషన్‌ థెరపీ : రేడియో థెరపీ ద్వారా క్యాన్సర్‌ కణాలను హైఎనర్జీ కిరణాల ద్వారా నియంత్రించటం కుదురుతుంది. ఆ చికిత్సను రేడియో థెరపీగా పిలుస్తుంటారు. రేడియేషన్‌ థెరపీలో కూడా 15 ఏళ్లలో ఆధునిక పద్ధతులు వచ్చాయి. కొన్నిరకాల క్యాన్సర్లకు రేడియేషన్‌తో మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ డైమన్షనల్‌, స్టిరియోటాక్టిక్‌, బ్రాకీ థెరపీ వంటి కొత్త చికిత్సలతో తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా చాలా చెడు ప్రభావాలు కూడా తగ్గాయి.

రాకుండా ఏమి చేయాలంటే..

  1. హెచ్‌పివి వ్యాక్సిన్‌ : గర్భ సంచి ముఖ ద్వార క్యాన్సర్‌ రాకుండా హెచ్‌పివి వ్యాక్సిన్‌ దోహదపడుతుంది. ఇది 10 సంవత్సరాలు దాటిన పెళ్లికాని యువతులకు ఇవ్వటం ద్వారా 98 శాతం క్యాన్సర్‌ నివారించొచ్చు.
  2. హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ : ఈ వ్యాక్సినేషన్‌ ద్వారా లివర్‌ ఇన్ఫెక్షన్‌ను నియంత్రించొచ్చు. తద్వారా లివర్‌ క్యాన్సర్‌ రాకుండా నివారించొచ్చు. ఇది ఎక్కువగా వైద్య సిబ్బందికి ఉపయోగపడుతుంది.
  3. మామోగ్రఫీ : స్క్రీనింగ్‌ మామోగ్రఫీ (రొమ్ము ఎక్స్‌రే) ద్వారా 35 సంవత్సరాలు దాటిన మహిళలు ఏడాదికి ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవటం ముందుగా రొమ్ముక్యాన్సర్‌ను గుర్తించటానికి వీలు కలుగుతుంది. అంటే జయించటానికి దోహదపడుతుంది.

పేప్సిమియర్‌ : 25 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ పాప్సిమియర్‌ చేయించుకోవటం ద్వారా క్యాన్సర్‌ను ముందే గుర్తించొచ్చు. తద్వారా క్యాన్సర్‌ రాకుండా జాగ్రత్త పడొచ్చు.

జాగ్రత్తలు

  1. మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి

2. మద్యం, ధూమపానం చేయకూడదు

3. చెడు లక్షణాలకు దూరంగా ఉండాలి

4. ప్రతిరోజూ వ్యామాయం చేయాలి

5. పైన చెప్పిన విధంగా డాక్టరు సూచన మేరకు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.’రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా క్యాన్సర్‌ను జయించొచ్చు.

cancer disease awareness causes precautionscancer disease awareness causes precautions

‘డాక్టర్‌ చాతరాజుపల్లి మురళీకృష్ణ, ఎంఎస్‌, ఎంసిహెచ్‌ (బిహెచ్‌యు), ఎఫ్‌ఎంఎఎస్‌చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, అడ్వాన్స్‌డ్‌ లేపరోస్కోపిక్‌ సర్జన్‌, శ్రీగాయత్రి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కొత్త వంతెన సెంటర్‌ విజయవాడ. సెల్‌ : 9618823815

 

  • సంభాషణ – యడవల్లి శ్రీనివాసరావు

 

➡️