విద్యుత్‌ భారాలు రద్దు చేయండి

  • సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు
  • కొనసాగిన ఎపిఇఆర్‌సి ప్రజాభిప్రాయ సేకరణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పేదలపై మోపిన వివిధ రకాల విద్యుత్‌ భారాలను రద్దు చేయాలని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు డిమాండ్‌ చేశారు. డిస్కములు ప్రతిపాదించిన ఆదాయ అవసరాలు, రిటైల్‌ ధరలపై ప్రజాభిప్రాయ సేకరణ రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌ నియంత్రణ మండలి(ఎపిఈఆర్‌సి) చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జున రెడ్డి అధ్యక్షతన ఎపిఈపి డిసిఎల్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. బాబూరావు మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్‌ను చౌకగా నిరంతరం అందిస్తా మంటూ మూడు దశాబ్ధాల క్రితం ప్రారంభించిన విద్యుత్‌ సంస్కరణలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజలపై భారాలు మోపుతూ రాయితీలకు కోతపెడుతున్న ప్రభుత్వం అదానీ, షీరిడి సాయి వంటి కార్పొరేట్‌ కంపెనీలకు సబ్సిడీలు ఇస్తోందని అన్నారు.ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా వ్యవసాయ పంపుసెట్లకు, గృహా వినియోగదారులకు మీటర్లు ఎలా బిగిస్తారని ప్రశ్నించారు. ఈ పేరుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా దోచుకుంటున్నాయని విమర్శించారు.ఈ అంశంపై తమ పార్టీ నిర్వహించిన ప్రజాబ్యాలెట్‌లో పాల్గొన్న వేలాది మంది ప్రజలు మీటర్లను వ్యతిరేకించారని చెప్పారు. రాష్ట్ర విద్యుత్‌ రంగాన్ని అదానీపరం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో పాలకులకు బినామీ సంస్థగా షిరిడి సాయి కంపెనీ విద్యుత్‌ రంగంపై పెత్తనం చేస్తూ వినియోగదారులను దోపిడీ చేస్తోందన్నారు. పిపిఎలపై సమీక్ష చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మరలా కొత్త పిపిఎలను చేసుకోవడం సరికాదన్నారు. విద్యుత్‌ రంగంలో జరుగుతున్న అవినీతిపై ఎపిఈఆర్‌సి విచారణ చేయాలని, లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ రంగాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంచి మరింత పటిష్టపరచాలని డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ రంగ నిపుణులు బి తులసీదాస్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చిన దాని కంటే డిస్కములు విద్యుత్‌ అధికంగా ప్రైవేట్‌ మార్కెట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. ప్రతి ఏటా కూడా ఇలా జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధిక ధరకు మరింత కొనుగోలు చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వల్ప కాలిక కొనుగోలుపై ఎపిఇఆర్‌సి మార్గదర్శకాలు విడుదల చేసిందని, దీనిని కూడా విద్యుత్‌ పంపిణీ సంస్థలు అమలు చేయడం లేదనే సందేహం తనకు ఉందన్నారు. ఎపిఎస్‌ఎల్‌డిసికి దేశంలోనే మంచి సమర్ధత ఉందన్నారు. ప్రైవేట్‌ మార్కెట్‌కు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ఎస్‌ఎల్‌డిసి అంచనాలను మారుస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా విద్యుత్‌ మార్కెట్‌ పెరుగుతుందని, 8శాతంగా ఉన్న మార్కెట్‌ 25శాతానికి కు పెరిగిందన్నారు. కేంద్రప్రభుత్వం ఒక కమిటీ నియమించి మరీ ప్రైవేట్‌ మార్కెట్‌ను ప్రోత్సాహిస్తుందన్నారు. తాము ప్రజల తరపున ఉన్నామని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం ప్రైవేట్‌ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ఎస్‌ఎల్‌డిసిని ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు. ఎపిఇఆర్‌సి కూడా దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఎఫ్‌పిపిసిఎ విధానం చాలా ఘరోమని ఆందోళన వ్యక్తం చేశారు. 30 విద్యుత్‌ యూనిట్లు వినియోగించే పేదలపై 21శాతం భారం మోపుతూ 400 యూనిట్లు దాటిన వారిపై 5శాతం మోపుతున్నారని వివరించారు. ట్రూఅప్‌ పేరుతో మరో అదనపు భారం మోపుతున్నారి తెలిపారు. నిరుపేదలను కొట్టి సంపన్నులకు రాయితీలు అందించే ఈ విధానం సరికాదన్నారు. ఎఫ్‌పిపిసిఎ, ట్రూఅప్‌ విధానం రద్దు చేయాలని, లేదంటే పేదలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. స్మార్ట్‌ ప్రిపెయిడ్‌ మీటర్లు అవసరం లేదన్నారు. డిమాండ్‌ను తెలుసుకోవాలి అనుకుంటే డిస్ట్రిబ్యూటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ స్థాయిలో అమర్చుకోవచ్చునని చెప్పారు. రాష్ట్రంలో 2వేల స్మార్ట్‌ మీటర్లు కొన్ని గ్రిడ్‌, ట్రాన్స్‌ఫార్మర్లకు అమర్చాని తెలిపారు. సాధారణ గృహ వినియోగదారులను, బడ్డీ కొట్టుల వంటి వారిని వేధించొద్దని సూచించారు. ఐఆర్‌డిఎ మీటర్‌ పనిచేస్తున్నా ప్రిపెయిడ్‌ మీటర్‌ ఎందుకు అమర్చుకోవాలని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారని వివరించారు. ఆర్‌డిఎస్‌ఎస్‌ విధానాన్ని అమలు చేస్తున్న కేరళ ప్రభుత్వం స్మార్ట్‌ ప్రిపెయిడ్‌ మీటర్లను తిరస్కరించిందని చెప్పారు.స్మార్ట్‌ మీటర్లపై రాష్ట్రప్రభుత్వం ప్రయాస్‌ కంపెనీతో చేయించిన సర్వే నివేదికను ఇప్పించాలని కోరారు.

సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన

ప్రజలపై విద్యుత్‌ భారాలు రద్దు చేయాలని, స్మార్ట్‌ ప్రిపెయిడ్‌ మీటర్లు బిగించొద్దని సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలోని ఎపిసిపిడిసిఎల్‌ ఎస్‌ఈ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. సిపిఎం నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌లతో ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, విజయవాడ నగర నాయకులు బి రమణరావు, పి కృష్ణ, చిన్నారావు, శేఖర్‌, సిహెచ్‌ శ్రీనివాస్‌, కృష్ణమూర్తి, ఆదిలక్ష్మీ నిరసనలు చేశారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను ఉపసంహరించుకోవాలని, విద్యుత్‌ ప్రైవేటీకరణ ఆపాలని నినాదాలు చేశారు.

➡️