క్యాబేజీ ఉత్పరివర్తనంలో పరివర్తనమా..!

Dec 17,2023 15:00 #Science, #Sneha
cabbage uses


క్యాబేజీ మొక్క డిఎన్‌ఏలోని ఒక చిన్న భాగాన్ని తొలగించడం ద్వారా తెగుళ్ళు రాకుండా పంట దిగుబడిని పెంచవచ్చని, ఇటీవల పరిశోధకులు వెల్లడించారు. బీజింగ్‌లోని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌కు చెందిన స్టేట్‌ కీ లేబొరేటరీ ఆఫ్‌ వెజిటబుల్‌ బయోబ్రీడింగ్‌ పరిశోధకుల ఫలితం విస్తారమైన పంటకు నాంది పలికింది. ఇప్పుడు మనం చూస్తున్న బిటి విత్తనాల కారణంగా మనకెదురవుతున్న నష్టం వీటి ద్వారా ఉండదని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు. మరి అదేమిటో తెలుసుకుందాం.

మన దేశంలో పూర్వం నుంచి సాంప్రదాయ వ్యవసాయం ఆనవాయితీ. అంటే పంట దిగుబడిలోంచి కొన్ని విత్తనాలను మరుసటి సంవత్సరం పంటకోసం దాచుకుని వాడుకోవటమే. కానీ 2002 నుంచి బిటి విత్తనాల ద్వారా అధిక దిగుబడి వస్తుందనే ఆశతో రైతు బిటి విత్తనాలనాశ్రయించడంతో ఇప్పుడు వ్యవసాయమే నిస్సారమైపోయింది. మరి ఇప్పుడు చెప్పేదీ హైబ్రిడు విత్తనాల గురించే కదా.. అంటే ఒక తేడా ఉంది అంటున్నారు నిపుణులు. బిటి విత్తనాలంటే విత్తనం లోపలికి టాక్సిన్‌ ప్రోటీన్‌ను ఇంజెక్ట్‌ చేస్తారు. దాంతో పంట తయారైనప్పుడు కీటకాలు వాటిని తినలేవు. అయితే ఇప్పుడు ఈ బయో బ్రీడింగ్‌లో ఎలాంటి టాక్సిన్‌ మొక్కకు చేరదు. ఒక జన్యుభాగాన్ని తొలగించడం ద్వారా పంట దిగుబడిని పెంచవచ్చునన్నది ఈ ప్రయోగ ఫలితంగా చెబుతున్నారు పరిశోధకులు.

న్యూక్లియోటైడ్‌ బేసెస్‌..

డిఎన్‌ఏ అణువు రెండు పొడవాటి తంతువులను కలిగి ఉంటుంది. ప్రతి తంతువు న్యూక్లియోటైడ్‌ బేసెస్‌ అని పిలువబడే నాలుగు సమ్మేళనాలతో కూడి ఉంటుంది. అవి ఎడినిన్‌, సైటోసిన్‌, గ్వానైన్‌, థైమిన్‌లు. వీటిద్వారా ఏర్పడే రసాయన బంధాలను హైడ్రోజన్‌ బంధాలు అంటారు. ఎడినిన్‌, థైమిన్‌ ఒకతంతువుపై, గ్వానైన్‌, సైటోసిన్‌ బేస్‌పెయిర్స్‌ అంటాము. ఇవి డిఎన్‌ఏ తంతువులను విడిపోకుండా కలిపి ఉంచుతాయి.క్యాబేజీ మొక్క (బ్రాసికా ఒలేరేసియా) జన్యువు 18 క్రోమోజోమ్‌లు, 1.06 బిలియన్‌ బేస్‌-జతలను కలిగి ఉంటుంది. ప్రతి కణం ఒక్కొక్కటి రెండు చొప్పున తొమ్మిది జతలను కలిగి ఉంటుంది. రెండు క్రోమోజోమ్‌ల జతల్లో, ఒక క్రోమోజోమ్‌ పుప్పొడి నుండి వస్తుంది. ప్రతి క్రోమోజోమ్‌ జతలోని డిఎన్‌ఎ ఒకే విధమైన బేస్‌-జతల క్రమాన్ని కలిగి ఉంటుంది.

హైబ్రిడైజేషన్‌..

జతలోని క్రోమోజోమ్‌లలో ఒకదానిలో మాత్రమే ఉత్పరివర్తన జన్యువు ఉన్నట్లయితే, మొక్క పుప్పొడిని తయారుచేయదు. రెండు క్రోమోజోమ్‌లలో ఉంటేనే పుప్పొడి తయారై, పరివర్తన చెందుతుంది. అధిక సామర్థ్యం కలిగిన పురుష-స్టెరైల్‌ ఉత్పరివర్తన జన్యువుల ద్వారా హైబ్రీడ్‌ విత్తనాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియలో పుప్పొడి తయారయేటప్పుడు ప్రోటీన్‌ స్థాయి క్రమంగా ఉంటుంది. బేస్‌-పెయిర్‌ను తొలగించడం ద్వారా క్యాబేజీ పంటలో హైబ్రీడ్‌ విత్తనాలను ఉత్పత్తి చేయవచ్చు. ఆ తొలగించిన జన్యువు పేరు వీర-షస1. ఈ జన్యువును జు=ఖీ ప్రోటీన్‌ బంధిస్తుంది. అలా బంధింపబడిన సమయంలో ప్రొటీన్‌ తయారు కాకపోయినా, పుప్పొడిని కప్పి ఉంచకపోయినా ఆ జన్యువు సామర్థ్యాన్ని కోల్పోతుంది. అంటే వంధ్యత్వం వస్తుంది. వీర-షస1 ప్రోటీన్‌ స్థాయి సమతుల్యంగా ఉంటే ఉత్పరివర్తన సక్రమంగా జరిగి పంట దిగుబడి అధికంగా ఉంటుంది.ఇవి సహజ ఫలదీకరణ ద్వారా ఏర్పడిన విత్తనాల కంటే బలమైన మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. ఎందుకంటే కృత్రిమ ఫలదీకరణ లేదా హెటిరోసిస్‌ వలన త్వరగా, బలంగా పెరిగేందుకు కావలసిన పోషకాలు మొక్కకు అందుతాయి. అయితే హైబ్రిడ్‌ మొక్కలు విత్తనాలనివ్వవు. సహజంగా ఫలదీకరణ చెంది, ఏర్పడిన విత్తనాలే మరల మొలకెత్తుతాయి. కానీ ఈ ఉత్పరివర్తన ద్వారా ఏర్పడిన విత్తనాలు వంధ్యత్వాన్ని పొందకుండా స్థిరంగా ఉంటాయని కొత్త అధ్యయనాలు వివరిస్తున్నాయి. అదే భవిష్యత్తులోనూ కొనసాగితే ఉత్పరివర్తన వంగడాల ద్వారా మంచి దిగుబడి పంటలను ఆశించగలం.

➡️