మూడేళ్ల సర్వీసు పూర్తయితే బదిలీ : సిఎస్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి

 ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఒకే ప్రాంతంలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులను ఈ నెల 25లోగా బదిలీ చేయాలని సంబంధిత శాఖల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీ, బదిలీలు తదితర అంశాలపై సచివాలయంలో సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా, ఆయా శాఖల అధికారులతో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్‌ మాట్లాడుతూ.. భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకనుగుణంగా ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా దీర్ఘకాలంగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో కల్పించాల్సిన కనీస సౌకర్యాలపై దృష్టిపెట్టాలన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణా నియంత్రణతోపాటు పటిష్ట నిఘాకు సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టుల ఏర్పాటును తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారుల భర్తీకి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంకె మీనా మాట్లాడుతూ.. ఇప్పటికే కొన్ని శాఖల్లో బదిలీలు చేపట్టామన్నారు. సమీక్షా సమావేశంలో ఎక్సైజ్‌శాఖ స్పెషల్‌ సిఎస్‌ రజత్‌ భార్గవ, అదనపు డిజిపి (శాంతిభద్రతలు) ఎస్‌బాగ్చి, సెబ్‌ డైరెక్టరు ఎం రవిప్రకాష్‌, ఐజి రవీంద్రబాబు, అదనపు సిఇఒ కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, నిషాంతి పాల్గొన్నారు.

➡️