ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ .. సిఆర్‌పిఎఫ్‌ ఎస్‌ఐ మృతి

Dec 17,2023 13:43 #Chhattisgarh, #encounter, #Naxalites

రాయ్‌పూర్  :    ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్‌లో జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌) ఎస్‌ఐ మరణించగా, కానిస్టేబుల్‌ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సిఆర్‌పిఎఫ్‌ 165 బెటాలియన్‌కు చెందిన బృందం చేపట్టిన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో.. జాగర్‌గుండ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో ఉదయం ఈ ఘటన జరిగింది.

ఆదివారం ఉదయం ఏడు గంటల సయమంలో సుక్మా జిల్లాలోని జగర్‌గుండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బెద్రెలో ఈ ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైందని, ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డి మరణించారని సీనియర్‌ అధికారులు తెలిపారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో సోదాలు జరుపుతున్నాయని అన్నారు. గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం హెలికాఫ్టర్‌లో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

గత మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు గాయపడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల అనంతరం శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని మోహల్లమాన్‌పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. పది రోజుల వ్యవధిలో ఇది మూడో దాడి ఘటన కావడం గమనార్హం.

➡️