గ్రామీణ ఉపాధి హామీపై దాడి! : సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో విమర్శ

Jan 3,2024 08:30 #cpm politburo, #MGNREGS
cpm politburo on mgnregs

న్యూఢిల్లీ : గ్రామీణ ఉపాధి హామీకి ఆధార్‌ను తప్పనిసరి చేయడమంటే గ్రామీణ ఉపాధి హామీపై నేరుగా దాడి చేయడమేనని సిపిఐ(ఎం) విమర్శించింది. పార్టీ పొలిట్‌బ్యూరో మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల జేసింది. డిమాండ్‌ ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) పట్ల మోడీ ప్రభుత్వం ఎంత శత్రుపూరితంగా వ్యవహరిస్తున్నదీ తాజా చర్య తేటతెల్లం చేస్తోందని పేర్కొంది. ఇది కోట్లాదిమంది కార్మికుల ఉపాధి హక్కును లాగేసుకోవడమేనని వ్యాఖ్యానించింది. ఆధార్‌ ప్రాతిపదిక చెల్లింపు వ్యవస్థ (ఎబిపిఎస్‌)కు గడువు డిసెంబరు 31తో ముగిసింది. ఈ చట్టం కింద ప్రతి గ్రామీణ కార్మికునికి జాబ్‌ కార్డు పొందే హక్కు వుంటుంది. జాబ్‌ కార్డు కలిగిన ప్రతి వ్యక్తికి ఏడాదిలో కనీసం వంద రోజులు పని కల్పించాల్సి వుంటుంది.జాబ్‌ కార్డు కలిగినవారిలో అర్హులైన వారు, అర్హులు కాని వారు అంటూ కేంద్ర ప్రభుత్వం విభజన తీసుకురావడం ఈ చట్ట తొట్టతొలి ఉల్లంఘనగా పొలిట్‌బ్యూరో పేర్కొంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం,పేరు నమోదు చేసుకున్న 25.25 కోట్ల మంది కార్మికుల్లో కేవలం 14.35కోట్ల మంది మాత్రమే అర్హులు. నరేగా వెబ్‌సైట్‌ ప్రకారం గత మూడేళ్లలో కనీసం ఒక రోజు అయినా పని చేసి ఉంటేనే అర్హులు. జాబ్‌ కార్డు కలిగి ఉండి తనకు పని అవసరం లేదని అనుకున్నా లేదా ఇదివరకు ఆమె పనిచేయకుండా ఉండి ఇప్పుడు పనిచేయాలని నిర్ణయించుకున్నట్లైతే, అమెకు పని దొరకదు. ఎందుకంటే అటువంటి వారిని అనర్హులని ఎంఎన్‌ఆర్‌ఇజిఎ సైట్‌ ప్రకటించేసింది. మరో మాటలో చెప్పాలంటే, చట్ట ప్రకారం జాబ్‌ కార్డు పొందేందుకు అర్హులైన 10కోట్ల మందికి పైగా కార్మికులను అనర్హులుగా ప్రకటించేశారన్న మాట. ఎబిపిఎస్‌ పొందేందుకు ఈ విధంగా అనర్హత వేటు పడినవారికి పని హక్కు నిరాకరిస్తున్నట్లు వెబ్‌సైట్‌ పేర్కొంది. అర్హులుగా ప్రకటించిన 14.35కోట్ల మంది జాబ్‌ కార్డుహౌల్డర్లలో దాదాపు 12.7శాతం మంది అంటే దాదాపు 1.8కోట్ల మందికి ఎబిపిఎస్‌ లేదు. అందువల్ల వారు ఎంఎన్‌ఆర్‌ఇజిఎలో పనిచేయడానికి అర్హులు కాకుండా పోతున్నారు. గతంలో ప్రభుత్వం ఆన్‌లైన్‌ నమోదు పద్ధతిని పెట్టింది. అయితే, గ్రామీణ భారతంలో అనేక ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ వ్యవస్థ అంతంతమాత్రంగా ఉండడంతో పని ప్రదేశాల్లో కార్మికుల హాజరుకు గుర్తింపు లేకుండా పోయింది. ఆన్‌లైన్‌ నమోదు లేదన్న సాకుతో వారికి వేతనాలు చెల్లింపును నిరాకరిస్తూ వచ్చారు. ఇటువంటి చర్యలన్నీ చట్టంపై నేరుగా దాడి చేయడం కిందికే వస్తాయని సిపిఎం పొలిట్‌బ్యూరో విమర్శించింది. వంద రోజుల వరకు పరిమితి విధించడం వంటి కొన్ని లోటుపాట్లు ఈ పథకంలో ఉన్నప్పటికీ గ్రామీణ పేదలకు ఉపాధి హామీ ఒక వరంగా మారినట్లు ఆచరణలో రుజువైంది. ముఖ్యంగా నిరుద్యోగం వల్ల తీవ్ర ఇబ్బందుల్లో వున్న గ్రామీణ ప్రజానీకానికి ఇది కచ్చితంగా ఒక ఆశాకిరణమే. కానీ, మోడీ ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించి చట్టబద్ధమైన వారి హక్కుపై దాడి చేస్తోంది. నరేగా హామీ ఇస్తున్న పని హక్కుపై జరుగుతున్న ఈ అక్రమ దాడిని పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఉపాధి హామీతో ఆధార్‌ ప్రాతిపదిక చెల్లింపు వ్యవస్థను ముడిపెట్టి, తప్పనిసరి చేయడాన్ని తక్షణమే ఉపసంహరించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.

➡️