ఫలించిన సీపీఎం సుదీర్ఘ పోరాటం : జగ్గు నాయుడు

cpm on visakha steel expats housing
  • ఉక్కు నిర్వాసితులకు ఇళ్ళ స్థలాలు మంజూరు 

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : 38 ఏళ్ల సుదీర్ఘ పోరాటం వల్ల ఎట్టకేలకు ఉక్కు నిర్వాసితులైన అగనం పూడి దగ్గరలోని కర్ణవాని పాలెం, శనివాడ గ్రామాలకు చెందిన 97 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు కేటాయించడాన్ని సీపీఎం పోరాట విజయంగా ప్రకటిస్తున్నమని కర్నవానిపాలెం దగ్గరలోనే లేఅవుట్ వేసి ఒక్కో కుటుంబానికి 107గజాల చొప్పున ప్రభుత్వం ఇళ్ళ స్థలాల పట్టాలు మంజూరు చేసిందనీ సిపిఎం కర్యదర్సి ఎం జగ్గు నాయుడు తెలిపారు. శుక్రవారం ఉదయం మద్దిలపాలెంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్కు కర్మాగారం నిర్మాణానికి 68గ్రామాల ప్రజలు 23వేల ఎకరాల భూమిని త్యాగం చేశారనీ తమ ఇళ్లను, భూములను త్యాగం చేసిన అనేక మంది నిర్వాసితులకు పునరావాస సదుపాయాలు కల్పించ కుండా ఏలిన పాలకులు అనేక ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. మొదట నుండి సీపీఎం ఉక్కు నిర్వాసితులకు అండగా ఉండి వారికి న్యాయం జరిగేలా అనేక పోరాటాలు చేసింది. కర్నవాని పాలెం, శనివాడ గ్రామాల్లో 119 ఉక్కు నిర్వాసిత కుటుంబాలకు పాలకులు రకరకాల కుంటి సాకులు చెప్పి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన 107 గజాల ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, ఉక్కు యాజమాన్యం ఒకరి కొకరు మాది కాదు భాధ్యత అని వివాదాలు సృష్టించి ఇన్నేళ్ళు వారికి అన్యాయం చేస్తూ వచ్చాయి. వీరి నిర్లక్షం వల్ల ఇన్నేళ్ళు పురిగుడిసెల్లో వీరు దయనీయమైన జీవితం గడపాల్సి వచ్చిందనీ తెలిపారు. సీపీఎం ఈ సమస్య మీద సుదీర్ఘ పోరాటం చేసి ఉక్కు యాజమానం మీద వత్తిడి చేసి భూ సర్వే చేపించి 119 కుటుంబాలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి పలు మార్లు లేఖలు పంపేలా కృషి చేసింది. ఆతరువాత పలుసార్లు రాష్ట్ర ముఖ్య మంత్రులు, రెవిన్యూ మంత్రుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళి జిల్లా కలెక్టర్ కి తగు ఆదేశాలు ఇచ్చేలా సీపీఎం చేసింది. అనేక సార్లు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక చర్చలు జరపటంతో పాటు అనేక సార్లు ఆందోళనలు నిర్వహించింది. చివరికి జిల్లా కలెక్టర్ కి ఇళ్ళ స్థలాల కోసం భూమిని చూపించటంతో పాటు దానిని సర్వే చేపించి లేఅవుట్ ఏపించింది. ఇప్పుడు ఎట్ట కేలకు ప్రభుత్వం 96 కుటుంబాలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసింది. ఇప్పటికైనా నిర్వాసితులకు న్యాయం చేసినందుకు జిల్లా అధికారులకు సీపీఎం ధన్య వాదాలు తెలియజేస్తున్నది. అలాగే తక్షణం వీరు ఇల్లు నిర్మాణాలు చేసు కోవటానికి 10లక్షల సబ్సిడీతో కూడిన ఆర్థిక సహకారం అందించాలని, లే ఔట్ లో రోడ్లు, కాలువలు, విద్యుత్, మంచినీరు ఇతర సామాజిక మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని అధికారులను సీపీఎం తరపున ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శవర్గ సభ్యులు కె.ఎం.శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావు పాల్గొన్నారు.

➡️