ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలి

Dec 17,2023 18:04 #amaravati, #CPI
అమరావతి రాజధాని సాధన కోసం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు
ప్రజాశక్తి – తుళ్లూరు : అమరావతి రాజధాని సాధన కోసం.. కౌలు సొమ్ము కోసం అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి ఆదివారం తో నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తుళ్లూరు రైతు దీక్షా శిబిరంలో ముప్పాళ్ళ మాట్లాడారు. ఎలాంటి ఆదాయ మార్గాలు లేని రైతులకు కౌలు చెల్లించక పోవడం సిగ్గు చేటన్నారు. అమరావతి సామాజిక ఫించన్ ను రూ 5 వేలకు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఫించన్లు పొందేవారు రాజధాని గ్రామాల్లో 15 వేల మంది ఉంటారని,వారిలో వృద్ధులు 5 వేల మందిని మినహాయించినా మిగిలిన 10 వేల మంది ఎందుకు పోరాటానికి ముందుకు రావడం లేదన్నారు. పోరాడక పోతే సమస్య పరిష్కారం కాదన్నారు. ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు కన్నా అమరావతిని ఎక్కువ అభివృద్ది చేస్తానని నమ్మబలికిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారని అన్నారు. టిడిపి హయంలో ఎంతో కొంత అభివృద్ది జరిగిందే తప్ప వైసిపి పాలనలో శూన్యమన్నారు.వచ్చే ఎన్నికలలో వైసిపి సింగిల్ డిజిట్ కి పరిమితం కావాలన్నారు.చంద్ర బాబు సమర్థులకు టికెట్లు ఇవ్వాలన్నారు.అమరావతి జెఎసిలో సమర్థులు ఉన్నారన్నారు. అమరావతి బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు పోతుల బాల కోటయ్య మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా రాజధానిలో ఇసుక, కంకర, ఇనుము దొంగిలించినట్లు అంగన్వాడి కేంద్రాల్లో తాళాలు పగుల గొట్టి గుడ్లు ఎత్తుకు పోతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతం నుంచి పోటీచేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు లక్ష ఓట్ల మెజార్టీ రావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజక వర్గ ఇంచార్జీ చిలకా విజయ్ కుమార్ మాట్లాడుతూ,త్వరలో అమరావతికి రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ వస్తారని, అమరావతికి కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు.దళిత బహుజన జెఎసి కన్వీనర్ చిలకా బసవయ్య మాట్లాడుతూ, అసైన్డ్ రైతులకు మూడేళ్లుగా కౌలు చెల్లించడం లేదని మండిపడ్డారు. ఇంకా కార్యక్రమంలో ధనేకుల రామారావు, బెల్లంకొండ నరసింహారావు, పువ్వాడ సుధాకరరావు, రాయపాటి శైలజ,న్యాయవాది రజనీ, కాటా అప్పారావు పాల్గొన్నారు.తొలుత అమరావతి జెండాను ఆవిష్కరించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అమరావతి అమరవీరులకు నివాళులు అర్పించారు.

➡️