‘పశ్చిమ’, ‘తూర్పు’లో ముగిసిన సిఎం బస్సుయాత్ర

Apr 18,2024 23:59 #2024 election, #ap cm jagan, #bus yatra
  • రోడ్‌షోలో పలువురితో మాట్లాడుతూ ముందుకు సాగిన జగన్‌
  •  పటిష్ట భద్రతా చర్యలు

ప్రజాశక్తి – తణుకు రూరల్‌, రాజమహేంద్రవరం ప్రతినిధి :  సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర గురువారం పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో ముగిసింది. శుక్రవారం కాకినాడ జిల్లాల్లో యాత్ర కొనసాగనుంది. విజయవాడలో జరిగిన రాయిదాడి ఘటన నేపథ్యంలో నిర్వహించిన యాత్ర కావడంతో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. మొబైల్‌ కమాండింగ్‌ వాహనాన్ని సైతం ఏర్పాటు చేశారు. రోడ్‌ షో పొడువునా ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
గురువారం ఉదయం వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలను పలుకరిస్తూ జగన్‌ యాత్ర కొనసాగించారు. తేతలిలో వృద్ధులతో మాట్లాడిన అనంతరం శర్మిష్ఠ సెంటర్‌ వద్దకు చేరుకోగానే మెదడు పక్షవాతంతో బాధపడుతున్న తణుకు పట్టణానికి చెందిన ఐదేళ్ల బర్ల దుర్గాఅచ్చుతం కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉమెన్స్‌ కళాశాల, పెరవలి, సిద్ధాంతం మీదుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. తూర్పుగోదావరిలో రావులపాలెం, పొట్టిలంక, వేమగిరి, బొమ్మూరు జంక్షన్‌, మోరంపూడి జంక్షన్‌, గామన్‌ బ్రిడ్జి మీదుగా రాజానగరం మండలం ఎస్‌టి. రాజపురం వరకూ యాత్ర సాగింది. శుక్రవారం కాకినాడ జిల్లాలో యాత్ర కొనసాగనుంది.
వైసిపిలో చేరిన రాజోలు జనసేన ఇన్‌ఛార్జి
రాజోలు జనసేన పార్టీ ఇన్‌ఛార్జి బొంతు రాజేశ్వరరావు జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరారు. రాజోలు నుంచి జనసేన తరఫున బొంతు రాజేశ్వరరావు టికెట్‌ ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.

➡️